ఇన్ఫీ బోణీ.. ప్చ్!
క్యూ4 లాభం రూ.3,603 కోట్లు...; వృద్ధి నిల్!
► ఆదాయం రూ.17,120 కోట్లు; 3.4% వృద్ధి
► సీక్వెన్షియల్‌గా ఆదాయం, లాభాలు డౌన్
► ఈ ఏడాది ఆదాయ గైడెన్స్‌లో భారీ కోత...
► రూ. 14.75 చొప్పున తుది డివిడెండ్
► డివిడెండ్, షేర్ల బైబ్యాక్ కోసం రూ.13,000 కోట్లు కేటాయింపు
బెంగళూరు: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఫలితాలతో బోణీ చేసింది. వ్యవస్థాపకుల ఒత్తిడితో ఒకపక్క ఇన్వెస్టర్లకు డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్ రూపంలో భారీమొత్తంలోనే కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. కంపెనీ పనితీరు మాత్రం నిరాశకు గురిచేసింది. దీనికితోడు.. ఈ ఏడాది(2017–18) ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) భారీగా తగ్గించేయడం కూడా మార్కెట్‌కు రుచించలేదు. దీంతో గురువారం ఒక్కరోజే కంపెనీ షేరు ధర 4 శాతంపైగా దిగజారింది.
ఇన్ఫోసిస్ కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (2016–17, క్యూ4) రూ.3,603 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన లాభం రూ.3,597 కోట్లతో పోలిస్తే.. వృద్ధి పూర్తిగా అడుగంటి 0.2 శాతానికి పడిపోయింది. మొత్తం ఆదాయం 3.4 శాతం వృద్ధితో రూ.17,120 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఆదాయం రూ.16,550 కోట్లుగా ఉంది. ప్రధానంగా అమెరికా, యూరప్ మార్కెట్లో అనిశ్చితికి తోడు.. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా బలపడటం రాబడులపై ప్రభావం చూపినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీక్వెన్షియల్‌గా క్షీణత...: గడిచిన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం రూ.3,708 కోట్లతో పోలిస్తే (సీక్వెన్షియల్ ప్రాతిపదికన) క్యూ4లో 2.8 శాతం క్షీణించింది. అదేవిధంగా ఆదాయం కూడా క్యూ3లో నమోదైన రూ.16,969 కోట్లతో పోలిస్తే 0.9% దిగజారింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో రూ.3,570 కోట్ల నికర లాభాన్ని, రూ.17,235 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, డాలరు ప్రాతిపదికన నికర లాభం మార్చి క్వార్టర్లో 1.8% వృద్ధి చెంది 543 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆదాయం 5% వృద్ధి చెంది 2.5 బిలియన్ డాలర్లకు చేరింది. పూర్తి ఏడాదికి కంపెనీ డాలరు ఆదాయం 7.4% పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. నికర లాభం 4.3% వృద్ధి చెంది 2.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
గైడెన్స్ డీలా...
ప్రస్తుత 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాల(గైడెన్స్)ను తగ్గించేసింది. డాలరు ప్రాతిపదికన ఆదాయ గైడెన్స్ 6.1 శాతం నుంచి 8.1 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన చూస్తే.. 6.5–8.5 శాతం ఉండొచ్చని గైడెన్స్‌ను ప్రకటించింది. విశ్లేషకులు అంచనా వేసిన 7–9 శాతం గైడెన్స్ కంటే ఇది తక్కువే. కాగా, రూపాయిల్లో చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ గైడెన్స్‌ను ఇన్ఫీ 2.5–4.5 శాతంగా ప్రకటించింది. 2016–17 పూర్తి ఏడాదికి డాలర్లలో ఆదాయ వృద్ధి 7.4 శాతం, రూపాయిల్లో ఆదాయ వృద్ధి 9.7 శాతం కావడం గమనార్హం.
ఇతర ముఖ్యాంశాలివీ...
⇒ 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఒక్కోషేరుపై రూ.14.75 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. దీంతో కలిపితే పూర్తి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.25.75గా లెక్కతేలుతుంది. అంటే వాటాదారులకు డివిడెండ్ రూపంలో చెల్లిస్తున్న మొత్తం రూ.7,119 కోట్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
⇒ క్యూ4లో కంపెనీ మార్జిన్లు 49 బేసిస్ పాయింట్లు తగ్గి 24.60 శాతంగా నమోదయ్యాయి.
⇒ మార్చి క్వార్టర్లో కంపెనీ కొత్తగా 6 భారీ కాంట్రాక్టులను దక్కించుకుంది. వీటి విలువ 806 మిలియన్ డాలర్లు.
⇒ ఉత్తర అమెరికా వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా 1.3 శాతం వృద్ధి నమోదైంది. ఇక యూరప్ వ్యాపారం 1.6 శాతం క్షీణించింది. భారత్ వ్యాపారంలో కూడా 5.4 శాతం క్షీణత నమోదైంది. మిగతా దేశాలకు సంబంధించి ఆదాయం 0.8 శాతం పెరిగింది.
⇒ అనుబంధ కంపెనీలతో కలిపితే మార్చి క్వార్టర్లో ఇన్ఫోసిస్ ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 17.1 శాతానికి తగ్గింది. క్రితం క్వార్టర్లో ఇది 18.4 శాతంగా ఉంది. అయితే, 2016–17 పూర్తి ఏడాదికి మాత్రం అట్రిషన్ రేటు 19.2%కి పెరిగింది. 2015–16లో ఇది 18.7%గా ఉంది.
⇒ క్యూ4లో నికరంగా కంపెనీ 601 మంది ఉద్యోగులను జతచేసుకుంది. దీంతో మార్చి చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,00,364కు చేరింది.
నిరుత్సాహకరమైన ఫలితాలు, గైడెన్స్ నేపథ్యంలో ఇన్ఫీ షేరు గురువారం బీఎస్ఈలో ఇంట్రాడేలో 4% పైగా దిగజారి రూ.927 కనిష్టాన్ని తాకింది. చివరకు 3.8% నష్టపోయి రూ.931 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.8,590 కోట్లు ఆవిరై... రూ.2,13,937 కోట్లకు పడిపోయింది.
సీజనల్‌గా కాస్త నిస్తేజమైన త్రైమాసికం కావడంతోపాటు అనుకోనివిధంగా ఎదురైన కొన్ని నిర్వహణపరమైన సవాళ్లు, అవాంతరాలు కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న కాలంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా అధిగమించేందుకు వీలుగా తగిన వ్యూహాలను అమలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. ఈ దిశగా అనేక సానుకూల సంకేతాలు కనబడుతున్నాయి. ఉద్యోగుల వలసలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీర్ఘకాలంలో వాటాదారులకు మరింత విలువను చేకూర్చడమే మా లక్ష్యం. ఇక గడిచిన 15 ఏళ్లలో టెక్నాలజీ పరిశ్రమకు సంబంధించి వీసాల పాత్ర చాలా పటిష్టం కావడంతో పాటు గణనీయంగా పెరిగింది. అయితే, తాజాగా నెలకొన్న వీసా ఇబ్బందులను(అమెరికా అధ్యక్షడు ట్రంప్ హెచ్1బీ వీసాలపై విధిస్తున్న కఠిన నిబంధనల గురించి మాట్లాడుతూ) ఐటీ పరిశ్రమ తప్పించుకోలేదు. దీనికి అనుగుణంగా ముందుకెళ్లాల్సిందే. ఈ విధమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థానిక, గ్లోబల్ స్థాయిలో నిపుణులను తగిన రీతిలో నియమించుకోవాల్సిన అవసరం నెలకొంది . – విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ
కొత్త డివిడెండ్ పాలసీ.. రూ.13,000 కోట్ల బైబ్యాక్!
కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంచాలంటూ గత కొంతకాలంగా ఇన్ఫీ వ్యవస్థాపకులు, మాజీ సీనియర్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం దిగొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్లు లేదా షేర్ల బైబ్యాక్‌ల కోసం(లేదా ఈ రెండింటికి కలిపి) రూ.13,000 కోట్లు వెచ్చించనున్నట్లు ఇన్ఫీ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు కొత్త డివిడెండ్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ నికర లాభాల్లో సగాన్ని డివిడెండ్ల కోసం ఇచ్చే విధానం ఉంది.
ఈ ఏడాది నుంచి అమలయ్యే కొత్త పాలసీ మేరకు వార్షికంగా ఉండే ‘ఫ్రీ క్యాష్ ఫ్లో’లో 70 శాతాన్ని ఇన్వెస్టర్లకు డివిడెండ్ల కోసం కేటాయించనున్నారు. ఇన్ఫోసిస్ వద్ద ప్రస్తుతం 6 బిలియన్ డాలర్ల మేర నగదు నిల్వలున్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కాగ్నిజెంట్ సహా పలు దేశీ ఐటీ కంపెనీలు ఇటీవల వరుసపెట్టి షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ప్రకటించిన మొత్తాన్ని పూర్తిగా షేర్ల బైబ్యాక్ కోసం వినియోగిస్తారా లేదా డివిడెండ్లతో కలిపి ఖర్చుచేస్తారా అనే విషయాన్ని ఇన్ఫోసిస్ స్పష్టంగా వెల్లడించలేదు.
కో–చైర్మన్‌గా రవి వెంకటేశన్
ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న రవి వెంకటేశన్‌ను కో– చైర్మన్‌గా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలి పింది. కంపెనీలో కార్పొరేట్ గవర్నె న్స్ దిగజారిందంటూ ఇన్ఫీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. 2011 ఏప్రిల్ నుంచి వెంకటేశన్ ఇన్ఫీ బోర్డులో కొనసాగుతున్నారు.
‘బోర్డు విధుల్లో తగిన సహకారం అందించడంతో పాటు కంపెనీ వ్యూహాల అమలులో యాజమాన్యానికి రవి ఇక నుంచి మరింత చేదోడుగా నిలవనున్నారు’ అని ఇన్ఫీ చైర్మన్ ఆర్.శేషసాయి వ్యాఖ్యానించారు. రవిని ఈ పదవికి ప్రమోటర్లెవరూ సూచించలేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్ దిగజారిందని, బోర్డును ప్రక్షాళన చేయాలంటూ ఇటీవల ప్రమోటర్లు చేసిన ఆరోపణలకు ఈ నియామకానికి ఎలాంటి సంబంధం లేదని శేషసాయి చెప్పారు.