భాగ్యనగరి..బుల్లి రైలు...
సిటీబ్యూరో: చారిత్రక వారసత్వం కలిగిన పురాతన నగరం హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగే క్రమంలో సరికొత్త రవాణా వ్యవస్థలనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ సంవత్సరంలో పట్టాలెక్కనున్న మెట్రోరైలుతో పాటు నగరంలో మరో సరికొత్త రవాణా వ్యవస్థ ‘న్యూ జనరేషన్ ట్రామ్ వే ’కూ ఏర్పాట్లు చేస్తున్నారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ నగరంలోని ట్రామ్‌వేలను పరిశీలించిన మేయర్, అధికారులు మన నగరానికీ ట్రామ్వేలు అత్యంత అనుకూలమైనవని అంచనా వేశారు. బోర్డెక్స్ సిటీకి, హైదరాబాద్‌కు వివిధ అంశాల్లో సామీప్యతలుండటంతో అక్కడ నిత్యం వేలాదిమందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ట్రామ్‌వేలను నగరంలో ప్రవేశపెట్టాలని ఆలోచించారు.
తొలుత చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న, పర్యాటక ఆకర్షణ కలిగిన, పాదచారుల పథకం అమలవుతున్న చార్మినార్ వద్ద ఈ ప్రాజెక్టును అమలు చేయాలని భావించారు. మొజంజాహి మార్కెట్ నుంచి చార్మినార్ వరకు 2.9 కి.మీ.ల మేర ట్రామ్వే ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు, ఖర్చు తదితరమైనవి అంచనా వేసేందుకు నగరానికి వచ్చిన ఫ్రెంచ్ ప్రతినిధుల బృందం సోమవారం పాదచారుల పథకాన్ని పరిశీలించింది. అనంతరం ఆస్కిలో నగరంలోని వివిధ విభాగాల అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్ మంగళవారం కూడా కొనసాగనుంది. మంగళవారం మోజాంజాహిమార్కెట్ నుంచి చార్మినార్ వరకు ట్రామ్వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, ఖర్చు తదితరమైనవి పరిశీలించి ఒక నివేదిక రూపొందిస్తారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాక, ప్రభుత్వ ఆమోదంతో పనులు చేపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మలి దశలో కుతుబ్షాహి టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు కూడా ట్రామ్వే ఏర్పాటు ఆలోచన ఉందన్నారు. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వీటి ఏర్పాటు ద్వారా అటు పర్యాటకులకు ఆకర్షణగానే కాక, ఇటు కాలుష్య తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. ఇందుకనుగుణంగా ట్రామ్వే ఏర్పాటయ్యే ప్రాంతాల్లో తగినంత పార్కింగ్ సదుపాయం కల్పించే యోచనలో ఉన్నారు.
ఇతర నగరాల్లో..
ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్తోపాటు మనదేశంలోని ముంబై, కోల్కత్తా వంటి నగరాల్లోనూ ట్రామ్వేలున్నాయి. చార్మినార్ చుట్టూ దాదాపు 7.7 కి.మీ. ల మేర ఔటర్‌రింగ్ రోడ్, 2.6 కి.మీల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికారులు పేర్కొన్నారు. చార్మినార్ వద్ద చిరువ్యాపారులను తరలించేందుకు సాలార్జంగ్ మ్యూజియం వద్ద మూసీపై బ్రిడ్జి నిర్మించే అంశం కూడా పరిశీలనలో ఉంది.
మనకెంతో అవసరం...
దాదాపు ఐదాలరు లక్షల జనాభా కలిగిన బోర్డెక్స్లోనే ట్రామ్వేలుండగా, కోటిమంది జనాభా కలిగిన హైదరాబాద్‌లో వీటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ వర్క్‌షాప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ అన్నారు. ప్రజారవాణాతోనే ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారమన్నారు. పర్యాటకంగా మనకెన్నో అపురూప సంపదలున్నా తగినవిధంగా పర్యాటకులను ఆకర్షించడంలో వెనుకబడి ఉన్నామని చెబుతూ, వీలైన అన్ని మార్గాల్లో ట్రామ్‌వేలను పరిశీలిస్తామన్నారు. శివార్ల దాకా ఈ రవాణా ఉంటే నగరం వెలుపలే డబుల్బెడ్రూమ్ ఇళ్లు కట్టవచ్చునని చెప్పారు. ప్రయాణ సదుపాయం లేకే పలువురు నగరం వెలుపలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. దీంతోపాటు మూసీ సుందరీకరణ అంశాన్నీ బోర్డెక్స్ ప్రతినిధులతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
పాదచారుల పథకానికి అనుసంధానం..
నగరంలో దాదాపు దశాబ్దం క్రితం ప్రారంభమైన చార్మినార్ పాదచారుల పథకం పనులు మరో నాలుగైదు నెలల్లో పూర్తికానుండటంతో దానికి అనుసంధానంగా ట్రామ్‌వేను అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖిల్వత్ వద్ద మల్టీలెవెల్ కార్ పార్కింగ్ పనులు కూడా చేపడుతున్నారు. పాదచారుల పథకానికి దాదాపు రూ. 35.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు.