కొంపలు ముంచే కొత్తదేవుళ్లు
అక్షర తూణీరం
ప్రభుత్వాలకి, పోలీస్ శాఖకి ఇలాంటి డేరాలు మొలకెత్తగానే తెలుస్తుంది. రకరకాల ప్రలోభాలతో వాటిని పెంచి పోషిస్తున్నారు. చివరకు ఎవరో బలైపోతారు.
మన నింగీ నేలా సదా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఉగ్గుపాలతో తత్త్వాన్ని రంగరించి పోసే జాతి మనది. ఈ జన్మ జాతకం మీద కన్నా పై జన్మ సుఖాల మీద వ్యామోహం ఎక్కువ. అందుకే దొంగ స్వాముల, బాబాల పంట పండుతోంది. అన్నీ చూస్తూనే ఉంటారు, కథలన్నీ వింటారు– అయినా కానీ, మళ్లీ మాయలో పడుతూనే ఉంటారు. తాజాగా డేరాబాబా ఘోరాలు వెలుగులోకి వచ్చాయ్. ఈ లోగా ఎన్ని ప్రాణాలు, ఎన్ని మానాలు మట్టి కలిసిపోయాయో తెలియదు. ఒక పుట్ట, ఒక పొద రాత్రికి రాత్రి పెరిగి పెద్దదవదు. చాలా వ్యవధి, అనుకూల పరిస్థితులు కలసి పుట్టకోటలవుతాయి.
దాదాపు పాతికేళ్ల క్రితం గుర్మీత్ రామ్‌రహీమ్ బాబా సాదాసీదా గురువుగా ఆవిర్భవించారు. పంజాబ్, హరియాణాలలో బాబా ఒక వర్గంపై పట్టు సాధించారు. ఆయన చెప్పిందే శాసనంగా చెలామణీ అయ్యే స్థాయికెదిగారు. ఆ తర్వాత ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతూ వచ్చింది. 2007లో ఈ దైవాంశ సంభూతుడికి నాటి యూపీఏ ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రత కల్పించింది. బదులుగా బాబా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి తన ఆశీస్సులిచ్చారు. ఇలాంటి విషయాల్లో రాజకీయ పార్టీలన్నీ ఏకతాటి మీద నడుస్తాయి. తరువాతి ఎన్నికల్లో డేరాబాబా భాజపాకి అండగా నిలిచారు. ఇలాంటి నేపథ్యంలో, ప్రభుత్వాలు బాబా దుశ్చర్యల్ని ప్రశ్నించలేకపోయాయ్. సమాంతర ప్రభుత్వాన్ని అన్ని హంగులతో నడుపుతున్న కొత్త దేవుణ్ణి చూసీచూడనట్టు వదిలెయ్యడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాయి. తృటిలో గురి తప్పింది గానీ లేకుంటే ఏ పద్మవిభూషణ్ తోనో ఢిల్లీ సర్కారు తనని తాను సన్మానించుకోవలసిన మాట! దేవుడికి ధన్యవాదాలు, కనీసం ఇరవై ఏళ్లకైనా డేరాల పాపం పండింది. ఓటు బ్యాంకు రాజకీయాల దృష్ట్యా ఉదాసీనతగా వ్యవహరించే ప్రభుత్వాలకు మైనస్ మార్కులు బాగానే పడతాయి. మతాన్ని అడ్డుపెట్టుకునే స్వాముల్ని, బాబాల్ని అస్సలు ఉపేక్షించకూడదు. భింద్రెన్‌వాలే నుంచి ఇప్పటిదాకా కావల్సినన్ని అనుభవాలు. అన్నీ చేదు అనుభవాలే.
చంద్రస్వామి తాంత్రిక గురువుగా ప్రభుత్వ గౌరవాలు పొందారు. ఒక దశలో తీహార్ జైలు జీవితమూ చూశారు. అప్పుడు ఆయనతో పాటు ఇంకో పదిమంది నేరస్థులు ఒకే డార్మిటరీలో ఉండేవారు. అక్కడో భయంకరమైన శిక్ష పడింది చంద్రస్వామికి. అక్కడే శిక్ష అనుభవిస్తున్న ఒక రౌడీ షీటర్ చంద్రస్వామిని అనరాని మాటలు అనేవాడట. కొట్టేవాడు, తిట్టేవాడు. ‘‘మేమంతా రౌడీలం, ముద్ర వేసుకుని తప్పుడు పనులు చేస్తున్నాం. కానీ నువ్వేంటి... దేవుణ్ణని నమ్మించి జనాన్ని దగా చేస్తున్నావ్’’ అంటూ ఓ లెంపకాయ కొట్టేవాడు. దారుణం ఏమిటంటే ఆ షీటర్ ఎప్పుడు కొడతాడో, కొట్టడో తెలియదు. ఒక్కోసారి పరగడుపున, మరోసారి అర్ధరాత్రి నిద్ర లేపి వడ్డించేవాడట. అధికారులకు చెబితే శిక్ష ఇంకా పెరుగుతుంది. ఆ విధంగా నరకాన్ని చూపించాడట. మన ప్రభుత్వాలకి, పోలీస్ శాఖకి ఇలాంటి డేరాలు మొలకెత్తగానే తెలుస్తుంది. రకరకాల ప్రలోభాలతో వాటిని పెంచి పోషిస్తున్నారు. చివరకు ఎవరో బలైపోతారు. ఒక్కోసారి నేతలు కూడా. ఇందుకు ఉదాహరణ ఇందిరాగాంధీ.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ