ఫుల్‌హ్యాపీ
పెండింగ్‌లో కొత్త లెసైన్సుల జారీ
పాత లెసైన్సుల పొడిగింపుపై ఆశలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో అంతా నష్టపోయామని బాధపడుతుంటే మద్యం వ్యాపారులు మాత్రం తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మద్యం లెసైన్సుల గడువు ముగియకముందే ఎన్నికలను నిర్వహించి మద్యం వ్యాపారులకు భారీ ఆదాయం సమకూరేలా చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త లెసైన్సులు జారీ చేయకుండా పెండింగ్‌లో పెట్టడంపై వీరంతా పండగ చేసుకుంటున్నారు. మరి కొన్నాళ్ల పాటు ఇలాగే లెసైన్సులు జారీ చేయకుండా ఉంచు దేవుడా అంటూ మొక్కుకుంటున్నారు.
మద్యం వ్యాపారులపై ఏసీబీ కేసులు పెట్టి కొన్నాళ్లు హడలుగొట్టినా ఆఖర్లో మాత్రం ఆఫర్లపై ఆఫర్లు ఇవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. వ్యాపారం ఫుల్లుగా సాగుతుండడంతో వారంతా ఆనందోత్సహాల్లో మునిగితేలుతున్నారు. మద్య నిషేధాన్ని ఎత్తేసి వాడవాడలా బెల్టు షాపులకు మార్గం సుగమం చేసిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతోనే తమ లెసైన్సుల గడువును కొంత కాలం పెంచుతారని ఆశపడుతున్నారు.
వాస్తవానికి జూన్ 30 తేదీ నాటికి మద్యం లెసైన్సుల గడువు ముగుస్తోంది. ఈలోగానే కొత్త లెసైన్సుల జారీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ రాష్ట్ర విభజన నేపధ్యంలో మద్యం డిపోలను ఈ నెల 27 నుంచీ మూసేసి ఆదాయవ్యయాలను లెక్కిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొత్త లెసైన్సుల గందరగోళాన్ని సృష్టించుకోవడం లేదు. ఇదే మద్యం వ్యాపారులకు కలిసొచ్చింది. ఎలాగూ మరికొన్నాళ్లు లెసైన్సు గడువు పెంచుతార న్న ఆశల్లో ఉన్నారు.
అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా కావల్సినంత మద్యం కొనుగోలు చేయడానికి వ్యాపారులకు అవకాశమిస్తున్నారు. మద్యం డిపోలను మూసివేస్తున్నందున ఎలాంటి ఆంక్షలు లేకుండా కావల్సినంత మద్యం కొనుక్కోవాలని సూచిస్తున్నారు. అప్పోసప్పో చేసి మద్యం నిల్వలను భారీ ఎత్తున విడుదల చేసి వ్యాపారులు గొడౌన్లలో నిల్వ చేస్తున్నారు.