శ్రీవరి.. సిరులే మరి!
కొత్త పద్ధతి మంచిగనిపిస్తన్నది
నాకు నీళ్ల సవులత్కు బోరున్నది. ఎప్పుడు ఏసినట్టె ఆనకాలంల ఎకరం ఒరేయాలనుకున్న. పొలం తయారు చేసేటందుకు దుక్కి దున్నుకుంటున్న. గప్పుడే మా ఉళ్లే ఉన్న సీనువాస్ సార్, ఆంజనేయులుతోని నా పొలం కాడికి వచ్చిండ్రు. శ్రీ పద్ధతిల ఒరి వేయమని ఒక్క తీరుగ జె ప్పిండ్రు. ఎట్లయితె అట్లయితదని ఆ ళ్లు చెప్పినట్టె నారు పోసిన.
జెరంత ముదిరిన నారు ఏసిన. అయినా పె ద్దగ కష్టం లేకుండనె శేను బాగా ఎది గింది. నిరుడు 30 బస్తాలు పండిన శేన్ల 40-45 బస్తాలు మోస్తదనిపిస్తున్నది. ఒక్కరోజుల నలుగురు నాటేసిండ్రు. అన్ని ఖర్సులు బాగా తగ్గినయ్. - బాలయ్య, నెంటూరు
వరి పొలంలో ఎల్లప్పుడూ నీరుంటే..
వరి పొలంలో ఎల్లపుడు సమృద్ధిగ నీరుంటేనే అధిక దిగుబడి వస్తుందన్నది అపోహ మాత్రమే. పొలంలో నీరు నిల్వ ఉన్నట్లయితే మొక్క వేరులో గాలి సంచులు తయారు చేసేందుకు ఎక్కువ శక్తి వినియోగించాల్సి ఉంటుంది. ధాన్యం తయారీకి దోహదపడాల్సిన ఈ శక్తిని గాలి సంచులు తయారు చేసి మొక్క బతకడానికి వాడుకుంటుంది. వేరు వ్యవస్థ కొసలు వరి పూత దశకు వచ్చేటప్పటికి 70 శాతం మేర కుళ్లి పోషకాలను తీసుకోలేవు. దీంతో దిగుబడి పడిపోతుంది. శ్రీ పద్ధతిలో సాధారణ వరి సాగుకులో మూడో వంతు నీరు మాత్రమే సరిపోతుంది. నీరు నిల్వ ఉండదు కాబట్టి వేర్లు భూమిలోనికి చొచ్చుకుపోయి మొక్కలు దృఢంగా, బలంగా పెరుగుతాయి.
విత్తనంలో తాలు గింజల తొలగింపు
విత్తుకొద్ది పంట అంటారు పెద్దలు. అందుకే మనం ఎంపిక చేసుకున్న విత్తనంలో తాలు గింజలు, రోగ కారక విత్తనాలు లేకుండా చూసుకోవాలి.శ్రీ వరి విధానంలో ఒక ఎకరం పొలంలో నాటు వేసేందుకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. తాలు తొలగించేందుకు విత్తనాలను మొదట మంచినీటిలో వేయాలి. తేలిన తాలు గింజలను తొలగించాలి. తరువాత విత్తనాలను ఉప్పు నీటిలో వేసి తేలిన వాటిని తీసేయాలి. నీటి అడుగు భాగానికి చేరిన విత్తనాలను (గట్టి గింజలు) మంచి నీటితో రెండు సార్లు కడిగి ఆవు మూత్రం, పేడ ద్రావణం పట్టించి నీడలో ఆరబెట్టి 24 గంటలు మండెకట్టాలి.
నారుమడి యాజమాన్యం
‘శ్రీ’ పద్ధతిలో 8 నుంచి 12 రోజుల నారు నాటాలి కాబట్టి నారు పెంచడంలో మెలకువలు పాటించాలి. ఒక సెంటు మడిలో 2 కిలోల విత్తనం చల్లి నారు పెంచితే ఎకరం పొలానికి సరిపోతుంది. భూమిని మెత్తగా దున్ని దమ్ము చేసి, ఎత్తుగా తయారు చేసి చుట్టూ కాలువలు తీయాలి. తడిమట్టి జారిపోకుండా నారుమడి చుట్టూ చెక్కతోగాని, బొంగులతోగాని ఊతం ఏర్పాటు చేయాలి. నారుమడి తయారైన తరువాత చివి కిన మెత్తటి పశువుల ఎరువును ఒక పొరలాగా చల్లి, 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టిన మొలకెత్తిన విత్తనాన్ని పలుచగా చల్లాలి. విత్తనాలపైన మరోపొర పశువుల ఎరువు చల్లి గడ్డిని కప్పాలి. మొలకెత్తిన వెంటనే గడ్డిని తీసేయాలి.
శ్రీపద్ధతిలో లాభాలు మెండు
శ్రీపద్ధతిలో విత్తన ఖర్చు బాగా తగ్గుతుంది. సాధారణ పద్ధతికి భిన్నంగా ఆరుతడి పంట కాబట్టి 30 నుంచి 40 శాతం వరకు నీటి వినియోగం తగ్గుతుంది. సేంద్రియ విధానం ఆచరించడం వల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన ధాన్యంతోపాటు, నాణ్యమైన పశుగ్రాసం లభ్యమవుతుంది. రసాయన ఎరువులు, పురుగుల మందుల ఖర్చు తగ్గుతుంది. వీడర్‌తో ఎక్కువగా మట్టిని గుల్ల చేయడంతో పోషక పదార్థాల లభ్యత అధికమై కంకి పొడవు, గింజ బరువు పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుంది. 10 రోజుల వరకు పంటకాలం తగ్గుతుంది. ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుంది. నీటి కష్టాలుండవు.
చీడపీడల నివారణ
సేంద్రియ ఎరువుల వాడకం, మొక్కల మధ్య దూరం వల్ల ఈ పద్ధతిలో చీడపీడలు ఆశించే అవకాశాలు తక్కువ. ఎప్పుడైనా వీటిని నివారించాల్సిన సమయంలో సంప్రదాయ పద్ధతులు, సహజ జీవన ఎరువులు వాడాలి. వేపనూనె లేదా వేప గింజల కషాయంతో పురుగుల సంతతి అరికట్టవచ్చు.
ప్రధాన పొలం తయారీ
సాధారణ పద్ధతి మాదిరిగా ఎక్కువ రోజులు పొలంలో నీరు నిలబెట్టి లోతుగా దుక్కి దున్నకూడదు. పొలం దున్నడానికి, పచ్చిరొట్ట ఎరువు మురగడానికి సరిపడా నీటిని దాదాపు వారం రోజులపాటు పొలంలో ఉంచాలి. 3-4 అంగుళాల లోతుకు మించకుండా దుక్కి దున్నుకోవాలి. దీనివల్ల వీడర్ దిగబడదు. వరి మొక్కను పైననే నాటాలి కాబట్టి ఈ లోతు దుక్కి సరిపోతుంది. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు దమ్ములో వేయాలి. దమ్ము చేసిన పొలంలో చేతితో లాగే రోలర్ మార్కర్‌తో 25ఁ25 సెంటీ మీటర్ల దూరంలో నిలువు, అడ్డంగా గీతలు గీయాలి. నాలుగు గీతలు కలిసిన చోట వరి నారు మొక్కలు నాటాలి.
నాట్లు వేయడంలో జాగ్రత్తలు
శ్రీపద్ధతిలో 8నుంచి 12 రోజుల వయసు లేత నారును నాటాలి. చలికాలంలో 13-15 రోజుల నారు వేయవచ్చు. నాటుకు ముందే ఎరువులు దుక్కిలో వేసి దమ్ము చేయాలి. లేత మొక్కను తక్కువ ఎత్తులో నాటడం వల్ల తొందరగా నిలదొక్కుకుని పిలకల సంఖ్య పెరుగుతుంది. నారు పీకిన తరువాత సాధ్యమైనంత త్వరగా అదేరోజు మొక్కలు నాటాలి.
మొక్క అంటిపెట్టుకున్న గింజను వేర్లు దెబ్బతినకుండ బొటన వేలు, చూపుడు వేలు సహాయంతో గీతలు కలిసే చోట తక్కువ ఎత్తులో జాగ్రత్తగా నాటాలి. దూరంగా మొక్కలు నాటడం వల్ల ప్రతి మొక్క ఆకులకు సూర్యరశ్మి బాగా సోకుతుంది. దీంతో తగినంత స్థలం, నీరు, పోషకాలు అంది వేర్లు దృఢంగా పెరిగి మొక్క చకచకా వృద్ధి చెందుతుంది. నారువేసిన మరుసటి రోజు నుంచి 10 రోజుల వరకు పలుచగా నీరుపట్టాలి.
నీటి పారుదల
శ్రీపద్ధతిలో పొలం తడిచేలా మాత్రమే నీళ్లు పెట్టాలి. నేల సన్నటి నెర్రెలు ఏర్పడుతున్న దశలో మళ్లీ నీళ్లు పెట్టాలి. నేల, వాతావరణం ఆధారంగా ఎన్ని రోజులకోసారి నీళ్లు పెట్టాలో నిర్ణయించుకోవాలి. వీడరు తిప్పుటకు ఒకరోజు ముందు నీరు పెట్టాలి. శ్రీ పద్ధతిలో తడుల సంఖ్య 30 శాతం మేర తగ్గుతుంది.
సాధారణ వరిలో ఒక కిలో విత్తనం పండించేందుకు 5,000 లీటర్ల నీరు అవసరం కాగా శ్రీపద్ధతిలో 2,000-2,500 లీటర్ల నీరు సరిపోతుంది. పొలాన్ని నిరంతరం తడుపుతూ ఆరబెట్టడం వల్ల నేలలోని సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెంది ఎక్కువ పోషకాలు సులభంగా మొక్కలకు అందుతాయి. పునరుత్పత్తి, పొట్ట దశలో కూడా పొలానికి పలుచగా నీళ్లు పెట్టాలి.
కలుపు యాజమాన్యం
పొలంలో నీరు నిలువకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య అధికం. కలుపు నివారణకు వీడర్‌తో నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తరువాత 10-12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి మరో మూడుసార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. తద్వారా ప్రతిసారి హెక్టారుకు ఒక టన్ను పచ్చిరొట్ట ఎరువు భూమికి చేరుతుంది.
అంతేకాకుండా మొక్కల వేళ్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దీంతో సూక్ష్మజీవులు వృద్ధిచెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి. వీడర్ చేరుకోలేని కుదుర్ల పక్కన ఉన్న కలుపు మొక్కలను చేతితో తీసేయాలి. వీడర్‌ను మహిళలు సైతం సులభంగా తిప్పి కలుపు నివారించుకోవచ్చు.