new perspective
-
వివక్షకు విరుగుడు పదవేనా?
► కొత్త కోణం గత మూడేళ్లుగా దళిత, ఆదివాసుల అభివృద్ధి లక్ష్యంగా కొత్త పథకాలేవీ ప్రారంభించిన దాఖలాలు లేవు. పైగా దేశవ్యాప్తంగానే కాదు, విశ్వవిద్యాలయాల్లో సైతం దళిత ఆదివాసీ, మహిళ, మైనారిటీలపై వేధింపులు పెరిగిపోయాయి.భారీ ప్రాజెక్టుల పేరిట దేశంలోని చాలా ప్రాంతాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలను నిర్వాసితులను, నిరాశ్రయులను చేస్తున్నారు. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌నుS రాష్ట్రపతిని చేస్తే చాలదు. అభద్రత, వెనకబాటుతనం, వివక్ష, దోపిడీల నుంచి వారికి విముక్తిని కలిగించాలి. అదే నిజమైన దళిత అభివృద్ధి. ‘‘ఎన్నికల సమయంలో మనమంతా హిందువులమేనని ఓట్లేయించుకున్నారు. గెలిచాక మమ్మల్ని బానిసలకన్నా హీనంగా చూస్తున్నారు. అందుకే మేం హిందూ మతాన్ని వదిలి బౌద్ధాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాం. మా గ్రామాల్లోని ఠాకూర్లు మాపై దాడులు జరిపినందుకుగాను బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, పోలీసులు వారిపై చర్యలు తీసు కోవాల్సిందిపోయి, మమ్మల్నే నిర్బంధిస్తున్నారు. ఆదిత్యనాథ్ కూడా ఠాకూర్ అయినందువల్ల మాకు ఠాకూర్ల నుండి ఇంకా ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది.’’ తమను కాపాడలేకపోగా తమ జీవితాలను ఛిద్రం చేసిన ఆ హిందూ మతాన్నే త్యజించిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లా దళితోద్యమ నవ యువకుడు పాతికేళ్ల నరేంద్ర గౌతమ్ చేసిన వ్యాఖ్య లివి. అప్పటివరకు తాము పూజించిన హిందూదేవతల విగ్రహాలను వంద లాది మంది దళితులు కాలువలో పారేసి, బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భ మది. వారా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? స్వాతంత్య్రానంతరం డెబ్భై ఏళ్లు గడుస్తున్నా దేశంలోని చాలా ప్రాంతాల్లో నెలకొన్న వివక్షాపూరిత, విద్వే షభరిత పరిస్థితులు దళితులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు ఆర్థిక, సామాజిక ఆధిపత్యం గల కులాల చెప్పు చేత ల్లోనే పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడూ ప్రభుత్వాలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఏవో నామమాత్రపు చర్యలు చేపట్టినా అవి కుల వివక్షకు, అణచివేతకు, దాడులకు, అత్యాచారాలకు గురవుతున్న దళితులకు ఎటు వంటి ఉపశమనాన్నీ కలిగించడం లేదు. పైగా కుల వివక్ష, అంటరానితనం, దళితులపై దాడులు పెచ్చుమీరి పోతున్నాయే తప్ప ఆగడం లేదు. ఆ క్రమం లోనే సహరాన్పూర్ దళితుల తిరుగుబాటును అర్థం చేసుకోవాలి. దాడికి గురైన దళితులపైనే కేసులా? ఆ జిల్లాలోని çషబ్బీర్‌పూర్ గ్రామంలో దళితులపైన ఠాకూర్లు దాడి చేసి 25 ఇళ్లను తగులబెట్టగా దళితులు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడానికి దళితులు చేసిన ప్రయ త్నాన్ని భూస్వాములైన ఠాకూర్లు అడ్డుకున్నారు. దళితవాడలోని రవిదాస్ మందిర్‌లో ఆ విగ్రహాన్ని పెట్టుకోవడానికి సైతం అడ్డుపడ్డారు. పైగా మే 5న రాణా ప్రతాప్ శోభాయాత్రను దళితుల వాడలో నుంచి తీసుకెళ్లడానికి ఠాకూర్లు పూనుకున్నారు. ఊరేగింపు జరుపుతూ ‘‘అంబేడ్కర్ ముర్దాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఊరేగింపును ఆపాలని కోరుతూ దళితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇంతలో పథకం ప్రకారమే పక్కనే ఉన్న మరో సిమ్లానా నుంచి ఠాకూర్లు మారణా యుధాలతో వచ్చి దళితులపై దాడులకు దిగారు. పోలీసులు కూడా వారి చేతిలో గాయపడ్డారు. దళితులకు చెందిన 25 ఇళ్లను తగులబెట్టారు. మహి ళలను అవమానపరిచారు. లైంగికంగా వేధించారు. పొరుగు గ్రామమైన మహేష్పూర్లోని దళితులకు చెందిన ఐదు దుకాణాలను ధ్వంసం చేశారు. అయినా పోలీసులు ఈ దహన, విధ్వంస, దౌర్జన్య కాండలకు పాల్పడ్డ ఠాకూ ర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దాడులను నిరసిస్తూ మే 21న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరి గింది. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడానికి పూనుకోకపోగా, మే 5 ఘటనలకు చంద్రశేఖర్ రావణ్‌ను బాధ్యుణ్ణి చేసి అరెస్టు చేయించాయి. చంద్రశేఖర్ 2015లో స్థాపించిన భీమ్ ఆర్మీ దళిత పిల్ల లకు విద్యను అందించే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తూ వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా అది దాదాపు 300 పాఠశాలలను నిర్వహిస్తున్నది. చంద్రశేఖర్ అరెస్టు సహరాన్పూర్ దళితుల్లో తీవ్ర నిరసన జ్వాలలు రేపింది. వారు ఆయన స్థానంలో ఆయన తల్లి కమలేష్ దేవిని భీమ్ ఆర్మీ నాయకురాలుగా ఎన్నుకున్నారు. ఆమె పిలుపు మేరకు జూన్ 18న మరోసారి ఢిల్లీలో భారీ ప్రదర్శన జరిగింది. దాన్ని విఫలం చేయడానికి యూపీ పోలీసులు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. వందలాది మందిని అరెస్టు చేశారు. కానీ దళితులు వాటిని తప్పించుకుని ఢిల్లీ ర్యాలీని విజయవంతం చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది. అయితే సహరాన్పూర్ దళితులు అంత టితో ఆగలేదు. వేల ఏళ్లుగా సాగుతున్న బానిసత్వానికి చరమగీతం పాడాల నుకుని, కుల వ్యవస్థను పెంచిపోషిస్తున్న హిందూ మతంలో ఇమడలే మంటూ అంబేడ్కర్ బాటన బౌద్ధాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారు. చిత్తశుద్ధి కొరవడితే రాష్ట్రపతి ఎవరైనా ఒకటే యూపీ సహా చాలా రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం దళితుల రక్షణకు, వారి ఆత్మగౌరవ పరిరక్షణకు చర్యలు చేపట్టకపోగా రాజ కీయక్రీడను మొదలుపెట్టింది. అది, దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్ర పతి అభ్యర్థిగా ప్రకటించడం ఆహ్వానించదగినదే. రాజకీయాల్లో ప్రాతిని«ధ్యం వహించడానికి వివిధ వర్గాలకు చెందినవారు ఉన్నత పదవులను అధిష్టిం చడం మంచిదే. దానితో ఆ వర్గాల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తాము ఎవ రికీ తీసిపోమని, ఎవరికన్నా తక్కువ కామనే భావన వస్తుంది. గతంలో భారత రాష్ట్రపతిగా కె.ఆర్. నారాయణన్ దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. అయితే విధాన నిర్ణయాల్లో రాష్ట్రపతి పాత్ర బహుస్వల్పం. ఏదేమైనా బీజేపీ నిర్ణయం ఒక ముందడుగే. ఇంతటితోనే మొత్తం సమస్యలు పరి ష్కారం కావు. దళితుల సమస్యల పరిష్కారం వైపు కేంద్రం దృష్టి సారిం చాలి. ముఖ్యంగా వారిపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో చిత్త శుద్ధితో చర్యలు తీసుకోకపోతే రాష్ట్రపతిగా ఎవరు ఉన్నా ఒరిగేదేమీ ఉండదు. గత మూడు సంవత్సరాలుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాలు దళితులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవు. ముఖ్యంగా బడ్జెట్లో దళితులకు చెందాల్సిన వాటా లభించడం లేదు. గత మూడేళ్లలో మోదీ ప్రారంభించిన పథకాల్లో దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల అభి వృద్ధికి ఉద్దేశించినవి ఏవీ లేవు. అయితే ఆయన 2016, సెప్టెంబర్, 15న ‘న్యూస్ 18’కు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వూ్య కుల సమస్యపట్ల, దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన దృక్పథం ఎలాంటిదో అర్థం అవుతుంది. ఆ ఇంటర్వూ్యలో మోదీ ఇలా అంటారు: ‘‘వేల ఏళ్ల సంస్కృతి మనది. కొన్ని అసమానతలున్నాయి. తెలివిగా మనం వాటి నుంచి బయటపడాలి. ఇది ఒక సామాజిక సమస్య. ఇది చాలా లోతైన అంశం’’ అంటూ దళితుల, ఆది వాసీల సమస్యలను వివరించారు. అంటరానితనం, కులవివక్షల ప్రస్తావన ఎక్కడా తేలేదు. పైగా గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ హయాంలో దళి తులపై అత్యాచారాల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. కానీ అది నిజం కాదు. ఎన్డీఏ హయాంలో దళితులపై అత్యాచారాల సంఖ్య, హత్యలు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. 2012లో దళితులపై జరిగిన మొత్తం నేరాల సంఖ్య 33,655, 2013లో 39,408 కాగా, 2015లో 45,003కు పెరి గింది. అదేవిధంగా దళితుల హత్యలు 2012లో 651, 2013లో 676 కాగా, 2015లో 707కు చేరాయి. మహిళలపై అత్యాచారాలు 2012లో 1,570, 2013లో 2,073, కాగా 2015లో 2,326కు పెరిగాయి. ఇవి ప్రభుత్వంవారి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పిన లెక్కలే. కానీ ప్రధాని మోదీ అలవోకగా దళితులపై అత్యాచారాలు తగ్గాయని అబద్ధమాడారు. ఇది ఆయనకు దళిత ఆదివాసీల çసమస్య పట్ల ఉన్న తేలిక భావాన్ని వెల్లడి చేస్తుంది. దళితుల సమస్యల పట్ల చిన్న చూపు అదే ఇంటర్వూ్యలో ఆయన ‘‘దళితుల అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. అదేవిధంగా ఆదివాసీల విషయంలో కూడాను. అణగారిన వర్గాలకు, వివక్షకు గురవుతున్న వారికి, మహిళలకు అండగా ఉంటాను’’ అని హామీ ఇచ్చారు. కానీ గత మూడేళ్లలో కేంద్రం ప్రారంభించిన డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్, స్టాండప్, పవర్ సెక్టార్, రహదారులు, గంగా ప్రక్షాళన తదితరాలు, జన్‌ధన్, పెద్దనోట్ల రద్దు కార్యక్రమాల్లో ఏ ఒక్కటీ ఆయన హామీని అమలు చేయడానికి ఉద్దేశించినది కాదు. పైగా గత 45 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులకు మంగళం పాడారు. ఈ నిధుల కేటాయింపు, వినియోగం, పర్యవేక్షణలకు చట్టబద్ధత కల్పించాలని గత పదేళ్లుగా చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది రాష్ట్రాలకు అందించాల్సిన పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లలో కోత పెట్టారు. విశ్వ విద్యాలయాల్లో చదువుకునే స్కాలర్ల ఫెలోషిప్లను గణనీయంగా తగ్గిం చారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను బాగా తగ్గించారు. ఇది వాస్తవ పరిస్థితి. దళిత, ఆదివాసుల అభివృద్ధి ప్రధానంగా విద్య, ఉపాధి రంగాలతో ముడిపడినది. అలాగే ఆర్థిక సహాయక, స్వయం ఉపాధి కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి పథకాలేవీ కొత్తగా ప్రారంభించిన దాఖ లాలు లేవు. పైగా విశ్వవిద్యాలయాల్లో దళిత ఆదివాసీ, మహిళ, మైనారిటీ విద్యార్థులపై వేధింపులు పెరిగిపోయాయి. రోహిత్ వేముల బలిదానం అందులో భాగమే. గత రెండేళ్లకు పైగా దేశంలోని వివిధ జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల్లో దళితులు, ఆదివాసీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలున్నాయి. అంతేకాదు భారీ ప్రాజెక్టుల పేరిట దేశంలోని చాలా ప్రాంతాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలను నిర్వాసితులను చేస్తున్నారు. వారి భూముల నుంచి, వారి సంస్కృతి నుంచి, వారి అడవులను నుంచి దూరంగా విసి రేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీలు చివరకు అన్నీ కోల్పోయి నిరాశ్రయు లుగా మారుతున్నారు. కొన్ని జాతులు, తెగలు ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన రామ్‌నాథ్ కోవింద్ కోల్ అనే కులానికి చెందినవారు. యూపీలో ఎక్కువగా ఉండే ఆ కులం నేతపని మీద ఆధారపడినది. ఆ కులం ఈ రోజు ఆ వృత్తిని కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారారు. అటువంటి కులాల మనుగడ గురించి ఆలోచించాలి. రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేయడంతో సరిపెట్టుకోకుండా దళితులకు అభద్రత, వెనకబాటుతనం, వివక్ష, దోపిడీల నుంచి విముక్తి కలిగించాలి. అదేనిజమైన దళిత అభివృద్ధి అవుతుంది. అంతేగానీ, కొద్దిమందికి పదవులి వ్వడం దళితుల అభివృద్ధికి తార్కాణంగా నిలవదని ఏలినవారు అర్థం చేసుకోవాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
మధుకర్ హత్య కేసులో కొత్త కోణం
-
అంబేడ్కర్ ఆలోచనే ఊపిరిగా...
- కొత్త కోణం అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని సాంస్కృతిక విప్లవంగా ఎలినార్ అభివర్ణించారు. అంబేడ్కర్‌పై ఆరెస్సెస్‌కు అంత గౌరవం ఉంటే... హిందూమతాన్ని వదిలి అది బౌద్ధాన్ని స్వీకరించాలనీ, అదే అన్ని సమస్యలకు పరిష్కారమని అన్నారు. ‘‘పద్నాలుగో ఏట నుంచే ఆఫ్రో-అమెరికన్ నల్లజాతి ఉద్యమాలను సమర్థిస్తున్న నాలో సహజంగానే భారత దేశంలోని అంటరాని కులాల పోరాటం గురించి తెలుసు కోవాలనే ఆసక్తి పెరిగింది. అలా నేను అంబేడ్కర్ ఆలో చన, ఆచరణల పట్ల ఆకర్షితు రాలినయ్యాను’’ పదిరోజుల క్రితం కన్నుమూసిన ఇలి నార్ జెలియట్ (89) మాటలివి. అమెరికాలోని కార్లె టన్ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ల పాటు చరిత్ర అధ్యాపకు రాలిగా పనిచేసిన ఆమె అంబేడ్కర్ ఆలోచనకు పడమటి ప్రపంచపు ద్వారాలను తెరిచిన విశిష్ట వ్యక్తి. జెలియట్ మొదటిసారిగా, 1962లో భారతదేశానికి వచ్చి, పూనాలోని దక్కన్ కాలేజీలో చేరి రెండేళ్ల పరిశో ధనకు అనుమతి పొందారు. స్థానిక అంబేడ్కర్ ఉద్యమ కార్యకర్తలతో కలసి సైకిల్‌పై పూనా చుట్టుపక్కల ప్రాంతా లలో తిరుగుతూ, స్థానిక దళితవాడలలో గడుపుతుండే వారు. ఆమె 1965లో తిరిగి ఆమెరికా వెళ్ళారు. 1969లో ఆమె పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరే ట్ను పొందారు. అంతటితో ఆమె అంబేడ్కర్‌పై తన అధ్య యనాన్ని ఆపివేయలేదు. ఆ తర్వాత చాలాసార్లు భారత దేశానికి వచ్చారు. అంబేడ్కర్ పోరాటాలతో పాటు, తద నంతర కాలపు దళిత పోరాటాలను తన వ్యాసాలలో పొందుపరిచారు. దాదాపు 80కి పైగా వ్యాసాలు, మూడు పుస్తకాలు ఇందులో చెప్పుకోదగినవి. ఒక రకంగా చెప్పా లంటే, అమెరికా సహా పశ్చిమ దేశాలకు అంబేడ్కర్ ఉద్య మాన్ని ఒక సమగ్ర దృక్పథంతో పరిచయం చేసిన వారిలో మొదటి స్థానం ఇలినార్దే. అంబేడ్కర్ కేంద్రంగా రచ నలు సాగించిన ఇలినార్ మన దళిత ఉద్యమంతో పాటూ, ఆ ఉద్యమ ప్రజాస్వామ్య దృక్పథాన్ని, అంబేడ్కర్ సాగిం చిన సైద్ధాంతిక పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అమెరికాలో విద్యాభ్యాస కాలంలో అంబేడ్కర్‌ను ప్రభావితం చేసిన వ్యక్తులను, సిద్ధాంతాలను గురించి తెలి యజెప్పినవారు ఇలినార్ ఒక్కరే. ‘‘అమెరికాలో విద్యా భ్యాసం అంబేడ్కర్లో కార్యదీక్షను రగిలించింది. ఆశావా దాన్ని పెంపొందించింది’’ అని ఇలినార్ వ్యాఖ్యానిం చారు. అక్కడ ఆయన భారతదేశంలో బ్రిటిష్ పాలన చెడు ఫలితాలపై చేసిన పరిశోధనను ఆమె స్వతంత్ర పరిశోధ నగా పేర్కొన్నారు. మానుష శాస్త్రంలో ఆయన కులాల పుట్టుకపై సాగించిన అధ్యయనం కూడా పాశ్చాత్య ప్రపం చాన్ని నివ్వెర పరిచింది. అంబేడ్కర్ పరిశోధనల వల్ల ఆయనకు సామ్యవాద భావాలున్నట్టు తెలుస్తుందిగానీ వాటిని అమలుచేసే అవకాశం ఆయనకు లభించలేదని ఇలినార్ అన్నారు. ఆయన ఆశించినట్టు ప్రణాళికా సంఘా నికి నేతృత్వం వహించి ఉంటే తన భావాలను ఆచరణలో పెట్టే అవకాశం లభించేదని ఆమె అభిప్రాయపడ్డారు. గాంధీతో సైద్ధాంతిక సంఘర్షణలో అంబేడ్కర్ చూపిన చొరవ ఆయనను భారత రాజకీయ చరిత్రలో ఒక యోధునిగా నిలిపిందని ఆమె అభిప్రాయం. రాజకీ యంగా, తాత్వికంగా గాంధీతో విభేదించి వైకోం సత్యా గ్రహం మొదలుకొని 1944 వరకు అంబేడ్కర్ నిరం తర సమరం సాగించారు. 1930-31 రౌండ్ టేబుల్ సమా వేశాల్లో గాంధీజీ అభిప్రాయాలను ఆయన చాలా దృఢంగా ఎదుర్కొన్నారు. 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్రపై, 1942 ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిపై ఒక పెద్ద పుస్తకమే రాశారు. కవిత్వం, సాహిత్యం, చిత్రలేఖనం లాంటి విషయా లపై అంబేడ్కర్ ఉద్యమ ప్రభావం ఏ మేరకు ఉందో ఇలినార్ అధ్యయనం చేశారు. ముల్క్‌రాజ్ ఆనంద్‌తో కలసి ఆమె మరాఠీ సాహిత్యాన్ని ఇంగ్లిష్‌లోకి అనువ దించి, ప్రచురించారు. యోగిందర్ సికంద్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలినార్ ‘‘ శ్వేతజాతీయులు నల్ల జాతి సంస్కృతి గురించి రాయలేరు. నల్లజాతి సామాజిక, ఆర్థిక, పరిస్థితుల గురించి రాయడానికి ప్రయత్నించ వచ్చు. భారతదేశంలో దళితేతరులు కూడా దళితుల సంస్కృతి మీద రచనలు చేయలేరు. దళిత సామాజిక, ఆర్థిక విషయాలపైన రచనలు చేయవచ్చు. దళితుల అభివృద్ధి కోసం కృషి చేయవచ్చు’’ అంటూ దళితేతర సమాజం నిర్వర్తించాల్సిన పాత్రను తాత్వికంగానూ, సోదాహరణంగానూ వివరించారు. అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని సాంస్కృతిక విప్లవంగా ఆమె అభివర్ణించారు. ఇటీవలి కాలంలో ప్రపం చంలో బౌద్ధం ఒక సామాజిక చైతన్యంగా ముందుకు సాగుతున్నదని, ఫ్రాన్స్, వియత్నాం, థాయ్‌లాండ్‌లలో జరుగుతున్న కార్యక్రమాలను ఇలినార్ పేర్కొనారు. దళిత ఉద్యమం, దళిత సంస్కృతి బ్రహ్మణవాద వ్యతిరేకతపై మాత్రమే నిర్మాణం కావనీ, దళిత చరిత్రలోని అనేక ప్రగతి శీల ఉద్యమాల స్ఫూర్తి, అనేక కుల వ్యతిరేక పోరాట అనుభవాల మీద మాత్రమే ఆధారపడాలని ఆమె సూచిం చారు. అంబేడ్కర్ తమ భావాలకు అనుగుణంగానే ఉన్నట్టు చూపాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నదనీ, అంబే డ్కర్‌పై ఆరెస్సెస్‌కు గౌరవం ఉంటే, హిందూమతాన్ని వదిలి అది బౌద్ధం స్వీకరించాలనీ, అదే అన్ని సమస్యలకు పరిష్కారమవుతుందని ఇలినార్ సూచించారు. ఎక్కడో పరాయి దేశంలో పుట్టి, మరో దేశంలోని ఒక పోరాట యోధుని గురించి, ఆయన సాగించిన ఉద్యమం, అతని తాత్వికతల సారాంశాన్ని ప్రపంచ ప్రజలకు పంచేందుకు ఇలినార్ జెలియట్ తన జీవన సర్వస్వాన్ని ధారపోశారు. ఆమె మన దేశంలోని మేధావులందరికీ ఆదర్శం కావాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
నైపుణ్యమే అసలు సంపద
కొత్త కోణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మాత్రమే కాదు, భారతదేశమే తన దృక్పథాన్ని మార్చుకోవాలి. వ్యాపార వాణిజ్య వర్గాలు, పరిశ్రమల అధిపతులు ఇప్పుడు అమలులో ఉన్న విద్యా విధానాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించాలి. పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార రంగాల్లో దేశం అభివృద్ధి కావాలంటే నైపుణ్యం కలిగిన కార్మిక, ఉద్యోగ శక్తులు అవసరం. భారత ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రధానమైన అడ్డంకి ఈరోజు అమలులో ఉన్న విద్యావిధానం. చాలామంది పరిశ్రమాధిపతులు నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగలను. ఇక్కడి పద్ధతి నాకు నచ్చింది. శిక్షణ నుంచి నేను బయటికొచ్చేసరికి ఒక మంచి ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌గా తయారుకాగలను. నాకు ఇది ఎంతో సంతృప్తినిస్తున్నది.’ జర్మనీకి చెందిన 18 సంవత్సరాల రాబిన్ దిత్తమర్ అన్న మాటలివి. రాబిన్‌కు చిన్నప్పటి నుంచి విమానాలంటే పిచ్చి. గాలిని చీల్చుకుంటూ వినువీధుల్లో దూసుకెళ్లే రెక్కల వాహనాన్ని నడపగ లిగితే... అని కలలుకంటూ ఊహల్లోకి ఎగిరిపోయేవాడు. కానీ పాఠ శాలలో రాబిన్‌కు వచ్చిన గ్రేడ్ ప్రకారం పైలట్ అర్హత లేదు. ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ కావడానికి అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు నచ్చచెప్పారు. జర్మనీ విమాన కంపెనీ లుఫ్తాన్సాలో రాబిన్ అప్రెంటిస్‌గా చేరారు. పైలట్ కాలేకపోతేనేం, విమానాన్ని మరమ్మతు చేసే మెకానిక్‌ని నేనౌతానంటూ అందులోనే ఆసక్తిని పెంచుకున్నాడు. ద్విముఖ శిక్షణ జర్మనీ విద్యావిధానంలో పాఠశాల చదువు సాగిస్తూనే, ఏదో ఒక సాంకేతిక, పారిశ్రామిక, లేదా ఇతరత్రా ఉత్పాదక రంగంలో పనిచేసే నైపుణ్యం సంపాదించుకోవడానికి విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఇది విద్యార్థులను అత్యంత చురుకుగా ఉంచుతూ, ప్రతిభావంతులుగా తయారుచేస్తుందని రాబిన్ లాంటి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. రాబిన్ తన రోజువారీ పనిలో మూడింట రెండు వంతులు లుఫ్తాన్సా వర్క్‌షాప్‌లోనే గడుపు తున్నారు. మూడున్నర సంవత్సరాల శిక్షణ తర్వాత రాబిన్‌కు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది. దాదాపు 60 శాతం మంది విద్యార్థులు రాబిన్ మార్గాన్నే ఎంచుకుంటారు. శిక్షణ సమయంలో స్టైపెండ్ ఇస్తారు. జర్మనీలో ప్రతి సంవత్సరం పదిహేను లక్షల మందికి ఈ పద్ధతిలో తర్ఫీదు ఇస్తారు. ద్విముఖ శిక్షణగా పేరుగాంచిన ఈ విధానం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఇటీవల బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ జర్మనీలో సాగుతున్న విద్య-ఉద్యోగ విధానంపైన ఆసక్తి కన బరిచారు. జర్మనీలో అమలవుతున్న విద్య-ఉద్యోగ విధానంపైన దాదాపు 20 మంది బ్రిటన్ యువ పరిశోధకులు గత సంవత్సరం మార్చిలో ఒక సర్వేను నిర్వహించారు. వృత్తిపరమైన శిక్షణలో సాంకేతిక అంశాలను జోడించడం, అదేవిధంగా వ్యాపార, వాణిజ్య వర్గాలను విద్యావిధానంలో పాఠశాల, కళాశాలల నిర్వహణలో భాగస్వా ములను చేయడం వంటి విషయాలను ఆ బృందం పరిశీలించింది. ఆ వివరాల ప్రకారం, జర్మనీలో మూడు అంచెల విద్యావిధానం అమలులో ఉంది. ప్రాథమిక స్థాయిలో చదువు చెబుతారు. సెకండరీ స్థాయిలో ద్విముఖ వ్యూహం అమలులో ఉంది. అంటే పాఠశాలకు వెళుతూనే, వృత్తి నైపుణ్యం సంపాదించడానికి అప్రెంటిస్‌షిప్ చేస్తూ తాము ఆర్జించిన జ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా పరీక్షించి నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. మూడవది వివిధ రకాలైన శాస్త్ర, సాంకేతిక, చరిత్ర, సంగీతం, తత్వశాస్త్రం లాంటి అధ్యయ నాలు. ఏ విద్యార్థి ఏ కోర్సుకి వెళ్లాలో వారి వారి ఆసక్తిని బట్టి, వారి ప్రతిభను బట్టి నిపుణులు సలహాయిస్తుంటారు. అంటే జర్మన్ విద్యావిధానం ఒక రకంగా శాస్త్రీయ పద్ధతిలో సాగుతున్నట్టు భావించాలి. ఈ విధానాన్ని అనుసరించడం వల్లనే ప్రపంచంలోనే నిరుద్యోగ రేటులో జర్మనీ అన్ని దేశాలకంటే చివరలో ఉన్నది. అంటే ఉద్యోగాల కల్పనలో జర్మనీ ప్రథమ స్థానంలో ఉందన్నమాట. ఇక్కడ విద్యను అభ్యసించిన వాళ్లలో నూటికి 98 శాతం మంది ఉద్యోగ, ఉపాధిని కలిగి ఉన్నారు. ఇది అమెరికా, యూరప్‌లోని అన్ని దేశాలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను అందిస్తున్నది. సహజంగానే పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ఎదురెదురుగా నిలబడి సంఘర్షణకు సిద్ధంగా ఉండే కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాయి. పైగా ప్రతి సంవత్సరం నిర్ణయించుకుంటున్న లక్ష్యాలలో కూడా కార్మిక, ఉద్యోగ సంఘాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. అనేక కంపెనీలు ప్రతి పాఠశాలతో సంబంధాలను కలిగి ఉంటాయి. ప్రాథమిక విద్య దశనుంచే విద్యార్థులకు తాము భవిష్యత్‌లో ఏయే రంగాల్లో నైపుణ్యం సంపాదించుకోవచ్చనే అవగాహనను కంపెనీలు నిరంతరం తెలియజేస్తుంటాయి. ఇందుకుగాను ప్రతి సెకండరీ పాఠశాలలో పారిశ్రామిక సంస్థల నుంచి ఒక సమన్వయకర్త ఉంటారు. విద్యార్థుల ఆసక్తి, ప్రవృత్తి, శక్తి సామర్థ్యాలను బట్టి విద్యార్థులకు మార్గదర్శకత్వం చేస్తారు. ఎవరికైనా పారిశ్రామిక, సాంకేతిక విద్యవైపు కాక ఇతర సామాజిక, సాహిత్య విష యాలపై ఆసక్తి ఉంటే వాటికి సంబంధించిన వివరాలను కూడా పాఠశాల స్థాయిలోనే అందిస్తారు. కంపెనీల యజమానులు, యజమానుల సంఘాలు, కళాశాల, విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ఉన్న సమన్వయ సంస్థలు ప్రశ్నలు, జవాబుల రూపంలో ఆడియో, వీడియో, పుస్తకాలను రూపొందిస్తాయి. సెకండరీ స్థాయి విద్యలోకి అడుగుపెట్టేటప్పటికేప్రతి విద్యార్థీ తన గమ్యాన్ని, అందుకు సంబంధించిన తన గమనాన్ని నిర్దేశించుకుంటాడు. నైపుణ్యం కొరవడిన విద్య భారతదేశంలోని పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. అందులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యావిధానం మరింత హేతువిరుద్ధం. ఉపాధి, ఉద్యోగ కల్పన విషయంలో మన ప్రభుత్వాలు తీవ్ర వైఫల్యం చెందాయి. ఇందుకు నాయకుల సంకుచితత్వమే ప్రధాన కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలను కేవలం కొద్దిమంది వ్యాపారులకు లాభాలు సంపాదించిపెట్టే కర్మాగారాలుగా మార్చారు. కేవలం ఇంటర్మీడియట్ విద్యను మాత్రమే కేంద్ర బిందువుగా మార్చారు. అటు ప్రాథమిక విద్య, ఇటు ఉన్నత విద్య కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. దానితో పాటు అమెరికా ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని, ఐటీ రంగమే ఆరాధ్య వృత్తిగా ప్రచారం చేసి ఎన్నో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలను ఉనికిలోకి తెచ్చారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని, తగిన బోధనా సిబ్బంది లేని వందల ప్రైవేట్ ఇంజ నీరింగ్ కళాశాలలు దాని ఫలితమే. ఇవి కూడా యాజమాన్యాలు కోట్లు గడించడానికి మాత్రమే పనికివస్తున్నాయి. వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఎటువంటి నైపుణ్యంలేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌గా రోడ్ల మీదికి వదులుతున్నాయి. స్వతంత్ర భారతదేశంలో విద్యావిధానం మీద చాలా చర్చ జరిగింది. 1963-64 ప్రాంతంలో నియమించిన కొఠారి కమిషన్ ఉన్నతమైన, ప్రయోజనకరమైన సిఫారసులు చేసింది. అందులోనే, సెకండరీ స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి నైపుణ్యాన్ని నేర్పించాలన్న ముఖ్యమైన సిఫారసు కూడా ఉంది. దానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనైనా పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటిఐ)ల ఏర్పాటు జరిగింది. 1970-80 ప్రాంతంలో ఐటిఐలలో శిక్షణ పొందిన ప్రతి విద్యార్థి ఉద్యోగం తెచ్చు కున్నాడు. అప్పుడు ఐటీఐలన్నింటినీ పరిశ్రమలతో అనుసంధానం చేశారు. దానితో ఐటిఐ చదివిన విద్యార్థి తనకు అవకాశం వచ్చిన కంపెనీలో అప్రెంటిస్‌షిప్ చేసి అక్కడే పర్మినెంట్ ఉద్యోగం పొందేవాడు. కాలక్రమంలో ఆ విధానం మూలపడింది. తర్వాత 1983 ప్రాంతంలో వృత్తివిద్యా కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు ఎన్ని వచ్చినప్పటికీ అవి కొద్దిమంది రాజకీయ నాయకులకు ఉపాధి కల్పించే సంస్థలుగానే ఉపయోగపడ్డాయి. విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనాన్ని అందించలేకపోయాయి. దాని ఫలితమే ఈరోజు లక్షలాది మంది డిగ్రీలు చేతబట్టుకొని అర్హతకు, ఆసక్తికి సంబంధంలేని పనులు చేస్తున్నారు. చాలా మందికి అవీ లభ్యం కావటం లేదు. జర్మనీ విధానమే ఆదర్శం గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఉపాధి కల్పన జపం చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయే తప్ప నిరుద్యోగుల్లో ఒక్క శాతం కూడా ఉద్యోగాలు పొందే పరిస్థితిలేదు. శిక్షణ పేరుతో ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం దగ్గర నిధులు రాబట్టి కేవలం అటెండెన్స్ రిజిస్టర్లో పేరు నమోదుచేసి ఎటువంటి శిక్షణా ఇవ్వకుండా సర్టిఫికెట్లు నిరుద్యోగుల ముఖాన కొట్టి కోట్లు గడించాయి. ఇందువల్ల స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు అర్థం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు. శిక్షణ పొందిన ప్రతి విద్యార్ధి ఉపాధి పొందేవిధంగా నిర్దిష్టమైన చర్యలపై ప్రభుత్వ దృష్టి లేదు. ఈ మొత్తం పరిస్థితి మారడానికి మన విద్యావ్యవస్థను ప్రాథమిక స్థాయి నుంచే సమూలంగా మార్చాలి. అందుకు ఏకైక ఆదర్శం జర్మనీ విధానం. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మాత్రమే కాదు, భారతదేశమే తన దృక్పథాన్ని మార్చుకోవాలి. అదే విధంగా వ్యాపార వాణిజ్య వర్గాలు, పరిశ్రమల అధిపతులు ఇప్పుడు అమలు జరుగుతున్న విద్యావిధానాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించాలి. పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార రంగాల్లో దేశం అభివృద్ధి కావాలంటే నైపుణ్యం కలిగిన కార్మిక, ఉద్యోగ శక్తులు అవసరం. భారత ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రధానమైన అడ్డంకి ఈరోజు అమలులో ఉన్న విద్యావిధానం. చాలామంది పరిశ్రమాధిపతులు నైపుణ్యం కలిగిన కార్మికుల, ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నారు. నైపుణ్యంలేని కార్మికుల, ఉద్యోగుల కొరత వలన భారీ నిర్మాణాలలో ఇతర దేశాల నిపుణులను రప్పించాల్సి వస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెల్డింగ్ పనులకు చైనా కార్మికులను తెప్పించుకున్నారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తక్షణం మన విద్యా వ్యవస్థ, ఉద్యోగ కల్పనా రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టాల్సి ఉందన్న సంగతి అర్థమవుతుంది. దేశప్రజలూ, ముఖ్యంగా యువతరం చేతినిండా పనితో, కడుపు నిండా అన్నంతో బతికే మార్గాన్ని అన్వేషించాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
దళితజాతి చరిత్ర సమస్తం..
కొత్త కోణం ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు ఒక సారూప్యత ఉంది. ఇక్కడ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఆయా దిగువస్థాయి సామాజిక వర్గాల వారు సంఘటితం కాగలిగారు. కానీ ఆధిపత్యంలోకి వచ్చిన కులాలు.. నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఇంకా దిగువన ఉన్న అంటరాని కులాలను మరింత అమానుషంగా అణచివేయడానికి సిద్ధపడ్డాయి. ఎదురు తిరిగితే తలలు తెగనరికారు. ఇప్పటికీ ఆ నరమేధాన్ని కొనసాగిస్తున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మాంఝీ అంటరాని కులాలలోనే అంటరానిదిగా చెప్పే ముషాహార్ కులానికి చెందినవారు. అంటే ఎలుకలను ఆహారంగా తీసుకునే కులమని అర్థం. బిహార్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా వారు అధిక సంఖ్యలో ఉన్నారు. పొరుగున ఉన్న నేపాల్లోనూ ఉన్నారు. దాదాపు 900 అంటరాని కులాలలో ముషాహార్ను అత్యంత వెనుకబడిన కులంగా పరిగణిస్తారు. వీరు కూడా గ్రామాలకు సుదూరంగా, అంటరాని కులాల నివాసాల కంటే దూరంగా నివసిస్తున్నారు. దేవాలయాలతో పాటు, ఇతర బహిరంగ స్థలాలలోకి కూడా వీరి ప్రవేశం నిషిద్ధం. స్వతంత్ర భారతదేశం రూపొందించుకున్న రాజ్యాంగంలో అంటరాని కులాలకు రక్షణ కల్పించారు. 1955లో పౌరహక్కుల రక్షణ చట్టంతో పాటు, 1989లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని కూడా రూపొందించారు. ఎవరైనా అంటరాని కులాల వారిని అవమాన పరిస్తే అలాంటివాళ్లని శిక్షించే అవకాశం ఈ చట్టం ఇస్తున్నది. దేశవ్యాప్తంగా ఎన్నో వేల కేసులు నమోదవుతు న్నాయి. ఏటా వందల సంఖ్యలో వీరు హత్యలకు గురి అవుతుండగా, వేల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలు అత్యాచారాలకు బలౌతున్నారు. ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జీతన్‌రామ్ మాంఝీ కూడా అంట రానితనం కారణంగా వివక్షకు గురికావడమే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ అంశం మీడియాలో అంత ప్రచారానికి నోచుకోలేదు. రాజ్యాంగం పరిధిలో పనిచేసే రాజకీయ పార్టీలలో ఏ ఒక్కటీ కూడా ఈ దుర్ఘటనను ఖండించక పోవడం తీవ్రమైన విషయం. ముఖ్యమంత్రి అయినా వివక్షేనా? జీతన్‌రామ్‌ను జనతాదళ్ (యు) ఇటీవల ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించింది. నితీశ్‌కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత జీతన్‌రామ్ ‘హిందుస్తానీ ఆవామ్ మోర్చా’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ రాజకీయ అంశాలను వేరే చర్చించవచ్చు. తన పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఈ నెల 6న సహార్స పట్టణానికి వెళుతూ మార్గమధ్యలో సుపాల్ పట్టణంలో ఆయన ఆగారు. సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధుడు రామ్మనోహర్ లోహియా విగ్రహానికి అక్కడ పూలమాల వేశారు. ఆ వెంటనే రాష్ట్రీయ జనతాదళ్ విద్యార్థి విభాగం, లోహియా విచార్‌మంచ్ కార్యకర్తలు లోహియా విగ్రహాన్ని నీటితో కడిగి మరో మాల వేశారు. నిజానికి జీతన్‌రామ్ అధికారంలో ఉండగా కూడా ఒక సంఘటన జరిగింది. మధుబని జిల్లాలోని ఒక దేవాలయంలో పూజలు నిర్వహించి వెళ్లిన వెంటనే ఆ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి అవమానం జరగడం భారతీయ సమాజానికే సిగ్గుచేటు. జనవరి 26, 1950న భారతీయులందరి పక్షాన రాజ్యాంగ రచనా సభ ఆమోదించిన లిఖిత పూర్వక రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని నిషేధించుకున్నాం. దీని ప్రకారం పౌరులంతా సమానులేననీ, ఎవరిని హీనంగా చూడరాదనీ, కులం పేరుతో అంటరానితనాన్ని పాటించడం నేరమనీ రాజ్యాంగంలో పేర్కొన్నారు. అయినా రాజ్యాంగం అమలులోకి వచ్చిన 65 ఏళ్ల తరువాత కూడా అలాంటి దుర్ఘటనలు పునరావృతం కావడం సమాజంలో కొనసాగుతున్న కులతత్వ క్రూరత్వానికి అద్దం పడుతున్నది. ఏమైంది లోహియా స్ఫూర్తి? మరొక అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. రామ్మనోహర్ లోహియా వంటి వారు కులం మీద ధ్వజమెత్తినవారే. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తరువాత కులాన్ని నిరసించిన వారిలో లోహియా ముఖ్యులు. కుల వ్యవస్థ మీద ఆయన వివరమైన పుస్తకం రాశారు. వనరులలో, నైపుణ్యంలో, జ్ఞానంలో సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పిం చాలనీ, అప్పుడే కుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందనీ సూచించారు. సామాజిక రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా కులతత్వ వ్యతిరేక శక్తులతో ఒక వేదికను ఏర్పాటు చేయాలని కూడా ఆశించారు. అందుకోసం అంబేడ్కర్‌తో లోహియా చర్చలు జరిపారు. ఉమ్మడిగా, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రాజకీయ కార్యక్రమం తీసుకోవాలని కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఈరోజు లోహియా పేరుతో సంఘాలు నడుపుతున్నవారు ఆయన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడం బాధ కలిగిస్తుంది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలను శత్రువులుగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా లోహియా శిష్యుడినని చెప్పుకుంటారు. యూపీఏ ప్రభుత్వం చివరికాలంలో పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీ పదోన్నతులలో రిజర్వేషన్‌ను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందకుండా, బిల్లు ప్రతులను చించివేసి అడ్డుకోవడం మనం చూశాం. అప్పటి నుంచి ఆ బిల్లు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ పరిణామం ఉపయోగపడుతుంది. ఆ రాష్ట్రంలోని ఎస్సీలు పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో ఉండడం, గ్రామాలలో ఎస్సీలకూ ఓబీసీ వర్గాలకూ; ముఖ్యంగా యాదవ్‌లకు మధ్య సాగుతున్న ఘర్షణలను పెంచడం కోసమే ఇటువంటి అప్రజాస్వామిక అరాచక చర్యకు సమాజ్‌వాదీ పార్టీ పాల్పడింది. తమిళనాట దళితుల ఊచకోత తమిళనాడు పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. గత యాభై ఏళ్లలో ఆ రాష్ట్రంలో ఎస్సీలపై జరిగిన మారణకాండ అంతా ఇంతా కాదు. 1968లో దాదాపు 44 మంది దళితులను సజీవంగా తగులబెట్టిన దుర్ఘటన దేశాన్ని నివ్వెరపరిచింది. 1977లో మెలవలవు అనే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సహా ఏడుగురిని పట్టపగలు గొడ్డళ్లతో నరికి చంపిన ఘటన ప్రపంచ వేదికల మీద చర్చకు వచ్చింది. 1977 ప్రాంతంలోనే జరిగిన కెలకణ్మని ఘటన కూడా ఇదే రకమైన క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రముఖ సామాజికోద్యమ నాయకుడు ఈవీ రామస్వామి నాయకర్ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు. అప్పటి వరకు ఉన్న బ్రాహ్మణ చాందసవాదాన్నీ, కులాధిపత్యాన్నీ చీల్చిచెండాడారు. అయితే ఆయన మరణానంతరం, ఆయన ఉద్యమంతోనే ఉత్తేజితమైన ద్రావిడ సంఘాలూ, సంస్థలూ ఈ రోజు దళితుల ఊచకోతకు కారకులవుతున్నారు. పైగా, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగమవుతున్నది కాబట్టి రద్దు చేయాలని అడుగుతున్నారు. సంఘటితం, ఆపై విధ్వంసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటువంటి అనుభవమే కనిపిస్తుంది. ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామిచౌదరి పురాణాల బూటకాన్ని ఎండకట్టారు. ఎన్నో ప్రగతిశీలమైన ఆలోచనలకు పునాదులు వేశారు. అయితే ఆయన బోధనలతో ఉత్తేజం పొందిన సమాజమే - ఒకవైపు బ్రాహ్మణ పురోహిత వర్గానికి వ్యతిరేకంగా సంఘటిత ఉద్యమాన్ని నిర్వహించింది. అయితే కాలక్రమంలో ఆ సంఘటిత తత్వమే కారంచేడులో హత్యాకాండకు పూనుకొనేటట్టు చేసింది. దీనిని చూసి, మరొక సామాజిక వర్గం చుండూరులో మరో దారుణానికి ఒడిగట్టింది. ఈ మూడు ప్రాంతాలలో ఒక సారూప్యత కనిపిస్తుంది. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. ఆర్థికంగా, రాజకీ యంగా, సామాజికంగా ఆయా దిగువస్థాయి సామాజిక వర్గాల వారు సంఘ టితం కాగలిగారు. అయితే నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఇంకా దిగువన ఉన్న అంటరాని కులాలను మాత్రం బ్రాహ్మణ వర్గం స్థానంలో ఆధిపత్యంలోకి వచ్చిన కులాలు, అంతకంటే అమానుషంగా అణచివేయడానికి సిద్ధపడ్డాయి. ఎదురు తిరిగితే తలలు తెగనరికారు. ఇప్పటికీ ఆ నరమేధాన్ని కొనసా గిస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం దళితుల హత్యలూ, వారిపై సాగుతున్న అత్యాచారాలూ పైన చెప్పుకున్న రాష్ట్రాలలోనే ఎక్కువ. 2013 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 676 మంది దళితులు హత్యకు గురైతే, అందులో 222 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 53 మంది, బిహార్‌లో 50 మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 2,072 మంది దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగితే, వీరిలో 294 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. ఆంధ్రప్రదేశ్‌లో 114, బిహార్‌లో 68 మంది ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ పోలీస్స్టేషన్ల వరకు వచ్చిన ఉదంతాల వివరాలు. కానీ బిహార్ వంటి చోట పోలీస్ స్టేషన్ల వరకు రావడం సాధారణ విషయం కాదు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు జరిగిన చోట సమాజం పై పొరలో ఉన్న కొన్ని కులాలు ఆధిపత్యస్థానంలోకి వచ్చి మళ్లీ అదేదారిలో అణచివేత, దోపి డీలను సాగించడమే కాకుండా, ఎదురు తిరిగితే ఎంతటి అమానుషానికైనా తెగిస్తున్నారన్న వాస్తవం ఈ ఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. జీతన్‌రామ్ తమ చెప్పుచేతల్లో ఉన్నంతకాలం ఏమీ మాట్లాడలేదు. స్వతంత్రంగా నిలబడ దామనుకున్న వెంటనే సీటును లాగేసుకుని అడుగడుగునా అవమానిస్తు న్నారు. అందుకే కులం ఆధిపత్య వ్యతిరేక స్వభావం మాత్రమే సరిపోదు. సంపూర్ణంగా కుల నిర్మూలన జరగాలని డాక్టర్ అంబేడ్కర్ అన్న మాటలు అక్షరసత్యాలుగా నిలిచిపోతాయి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
అమరావతి పేరు.. ప్రజలపై పోరు
కొత్త కోణం ఉన్నత, నీచ భేదం కానరాని ఆదర్శ సమాజాన్ని ఆవిష్కరించిన నేల అమరావతి. ఆ పేరుతో రాజధానిని నిర్మిస్తున్న ప్రభుత్వం ప్రజల పట్ల కరుణ, ప్రేమలను ప్రదర్శించలేకపోవడం, వివక్షతతో అణచివేయడం గ ర్హనీయం. ‘ధర్మహీనముగా పాలింపరాదు’ అంటూ ఆచార్య నాగార్జునుడు కూడదన్న పనినే... అదీ ‘అమరావతి’ కోసమే చేయడం భావ్యమేనా? అమరావతి పేరును స్వీకరిస్త్తున్న ప్రభుత్వం అలనాటి రాజధాని సాంస్కృతిక, ధార్మిక, పాలనా వారసత్వానికి భిన్నంగా ప్రవర్తించడమంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమే. ‘‘పంటలు నష్టమైన రైతులకు విత్తనాలిచ్చి, పన్నులు తొలగించాలి. పేదలపై పన్నులు వేయవద్దు. పన్నుల కోసం ప్రజలను బాధించవద్దు. ఎవరి నైనా విచారించేటప్పుడు నిన్ను ఆ స్థానంలో ఊహించుకొని అట్లే విచారణ జరపవలెను. పంచభూతాలు అందరికీ అందుబాటులో ఉన్నట్టే రాజు ప్రజ లకు అందుబాటులో ఉండవలెను.’’ ఇది బౌద్ధ గురువు బోధిసత్వ ఆచార్య నాగార్జునుని ప్రబోధం. ఆయన తన సమకాలికుడైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి చక్రవర్తికి బోధించిన రాజ్యధర్మ దర్శనం. అది రాజుల, చక్రవర్తుల వంటి పాలకులందరికీ చేసిన మార్గనిర్దేశన కూడా. సహోదరత్వం, ప్రజాహితమే సద్ధర్మం ‘‘పరలోకమందుండి తేలేరు రాజ్యము మరు జన్మకు తోడుగా రాబోదు రాజ్యము ధర్మముచే సంప్రాప్తమైనది భాగ్యం ధర్మహీనముగా దాని పాలింపరాదు.’’ రాజ్యపాలన ధర్మం కోసమే గానీ మరిదేని కోసం కాదని, పరహితమే సద్ధర్మమని నాగార్జునుడు ప్రవచించాడు. ధర్మనిలయాలను నెలకొల్పి పండి తులను, నిస్వార్థపరులను, విచక్షణ కలిగిన వారిని అధికారులుగా నియమిం చాలనీ, నీతిధర్మం తెలిసినంత మాత్రాన సరిపోదని శీలం, నిర్మలత్వం, మం చి మనసున్న వారిని మంత్రులుగా, అధికారులుగా నియమించాలనీ ఆయన చక్రవర్తులకు సూచించారు. నాగార్జునుడు శాతవాహనుల పాలనా కాలంలో కృష్ణా తీరంలో బౌద్ధ ధర్మాన్ని విల్లసిల్లజేశాడు. ధాన్యకటకం అంటే అమరా వతి రాజధానిగా శాతవాహనులు క్రీ.పూ.3వ శతాబ్ది నుంచి క్రీ.శ 3వ శతాబ్ది వరకు దాదాపు ఆరువందలేళ్లు సువిశాల సామ్రాజ్యాన్ని పాలించారు. అశో కుని కాలంలోనే అక్కడ ఒకమహా స్తూపం నిర్మాణం ప్రారంభమై, చాలా కాలం సాగింది. అన్ని మతాలపట్ల సమాదరాన్ని పాటించిన శాతవాహనులు బౌద్ధంతోపాటు, వైదిక మతాన్ని కూడా పోషించారు. సామాన్య ప్రజలలో నాడు బౌద్ధం ప్రబలంగా ఉండేది. స్తూపం నిర్మాణానికి అన్ని వర్గాల, వృత్తుల ప్రజలు సహకరించారు. స్తూపంలో ఉంచిన పలు వస్తువులు, పాత్రలు వారు బహూకరించినవేనని పరిశోధకులు తేల్చారు. స్తూపంలోని పూర్ణఘటం విధికుడు అనే చర్మకారుని కానుక. బౌద్ధం ప్రకారం పూర్ణఘటం సంపూర్ణ జ్ఞానానికి సంకేతం. బౌద్ధం ప్రభావం వలన నాడు సామాజిక అంతరాలు బలంగా లేవు. ప్రజల మధ్య సహోదరత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పూర్ణ ఘటాన్ని తర్వాత పూర్ణకుంభంగా మార్చి 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నంగా ప్రకటించారు. నాటి అభివృద్ధికి పునాది మానవతావాదం బౌద్ధ ధర్మంతోపాటే అమరావతి చుట్టూతా అల్లుకున్న మానవతావాదం ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు. దక్షిణాసియాదేశాల పాలకుల మీద, ప్రజల మీద విశేష ప్రభావాన్ని నెరపింది. ముఖ్యంగా విదేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాల్లో బౌద్ధం విప్లవాత్మకమైన మార్పులను తెచ్చింది. దీంతో ఎగుమ తుల కోసం వస్తువుల ఉత్పత్తి పెద్ద ఎత్తున విస్తరించింది. వ్యాపారులకు, వృత్తి పనివారికి లభించిన ప్రోత్సాహంతో వారు బౌద్ధాన్ని తమ సొంత మతంగా భావించారు. అంతవరకు వైదిక మతం సముద్రయానాన్ని నిషేధించడం వల్ల వస్తువుల ఎగుమతి నిలిచిపోయి, వృత్తులన్నీ మూలపడ్డాయి. నాటి ైవె దిక మతం విచ్చలవిడిగా చేస్తుండిన యజ్ఞయాగాల వల్ల పశుసంపద క్షీణించి పోయే పరిస్థితి ఏర్పడి, వ్యవసాయాభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. ఆ పరిస్థితుల్లో అనవసరంగా పశువులనే కాదు, ఏ జీవినీ చంపరాదని, హింసిం చరాదని బౌద్ధం జీవకారుణ్యాన్ని ప్రచారం చేసింది. వ్యవసాయానికి ప్రధాన చాలక శ క్తియైన పశు సంపద క్షీణతకు అడ్డుకట్ట వేసి బౌద్ధం రైతులకు భరోసా నిచ్చింది. బౌద్ధ ధర్మం చాటిన మానవతావాదం, జీవకారుణ్యాల ఫలితంగా అమరావతి ప్రాంతం వ్యవసాయ కేంద్రంగా మారి, ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందింది. అమరావతి ధాన్యకటకంగా మారింది. బౌద్ధ చరిత్రలో గౌతమ బుద్ధుని తర్వాత ఆచార్య నాగార్జునునికే అంతటి ప్రాచుర్యం లభించింది. ఆయన మహాయాన బౌద్ధంలోని మాధ్యమికవాద ప్రవక్త. శాతవాహనుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవ తెలుగు రాజవంశంలో జన్మించిన బోధిధర్మ చైనాలో జెన్ బౌద్ధానికి ఆద్యుడు. ఆత్మ రక్షణ కోసం బౌద్ధ బిక్షువులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ఆదిగురువు బోధి దర్ముడే. ఆయన కూడా అమరావతి బౌద్ధం నుంచే ప్రేరణ పొందాడు. ఈ కృష్ణా తీరం నుంచే బౌద్ధులు పెద్ద సంఖ్యలో శ్రీలంకకు వెళ్లినట్టు ఆధారాలున్నాయి. శ్రీలంకలోని కొన్ని బౌద్ధ చైత్యాలలో తెలుగు తాళపత్ర గ్రంథాలున్నట్టు తెలుస్తున్నది. కొలంబోలోని నేషనల్ మ్యూజియం లైబ్రరీలో సైతం తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిని పరిశోధించి, క్రోడీకరిస్తే తెలుగునేలపై విలసిల్లిన బౌద్ధ చరిత్రలోని పలు కొత్త కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అలాగే దక్షిణాసియా దేశాల్లో కూడా తెలుగు బౌద్ధం ప్రభావం చాలా ఉన్నది. ఆ విషయాలపై సైతం సమగ్ర పరిశోధన అవసరం. ‘అమరావతి’ కోసం సమధ ర్మంపై యుద్ధం ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు ప్రస్తావించడానికి కారణం నేడు అమరావతి పేరు మరోమారు మారుమోగుతుండటమే. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం పేరును ‘అమరావతి’గా నిర్ణయించారు. మానవత్వం, కారుణ్యం, సమభావాలను ఎలుగెత్తి చాటిన గొప్ప బౌద్ధ చారిత్రక స్థలి పేరుతో నిర్మి స్తున్న నవ్యాంధ్ర రాజధాని నాటి చరిత్రను గుర్తుకు తెస్తోంది, వర్తమానంతో బేరీజువేసి ఆలోచించేలా చేస్తోంది. ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత కొంత కాలంగా రాజధాని కోసం ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించింది. మూడు కాలాలు మూడు పంటలు పండే వేలాది ఎకరాలను రాజధాని కోసం సేకరిం చడం ఆ ప్రాంత ప్రజలందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. రైతులే స్వచ్ఛం దంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని ప్రభుత్వం అంటోం ది. అది నిజం కాదనీ, బెదిరించి, ప్రలోభపెట్టి ప్రభుత్వం భూములను స్వాధీ నం చేసుకుంటున్నదనీ రైతులు, ప్రజలు ప్రభుత్వ తీరును దుయ్యబడుతు న్నారు. సేకరణకు లేదా సమీకరణకు సహకరించని రైతులు నష్టపోతారని ముఖ్యమంత్రే హెచ్చరికలు చేసిన వైనాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ‘ధర్మహీ నముగా పాలింపరాదు’ అంటూ నాగార్జునుడు కూడదన్న పనినే... అదీ ‘అమరావతి’ కోసమే చేయడం భావ్యమేనా? పైగా పట్టా భూములున్న రైతులకు కోట్ల రూపాయల ఆశలు చూపు తున్న ప్రభుత్వం అసైన్డ్ భూముల రైతాంగంపై చిన్నచూపు చూస్తూ అసమ ధర్మమే తమ మతమని చాటుతుండటం విచారకరం. రైతులతో అది సమావేశాలు నిర్వహిస్తోంది, వారిని బుజ్జగిస్తోంది. కానీ అసైన్డ్ భూముల రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా అసైన్డ్ భూములనే ఎక్కు వగా కలిగిన దళితులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిగతా రైతులకు కల్పి స్తున్న ప్రయోజనాలను వీరికి ఇవ్వడం లేదు. పట్టా రైతులకు 1,200 గజాల అభివృద్ధి చేసిన భూమిని ఇస్తే, దళిత ైరె తుల అసైన్డ్ భూమికి 800 గజాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇక భూమిలేని వ్యవ సాయ కూలీలు, కౌలు రైతులకు కలుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. వారి గురించి ప్రభుత్వం ఆలోచించినట్టే కనిపించడం లేదు. భూసేకరణ జరుపు తున్న ప్రాంతంలో దళితులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలా కొద్ది మందికే భూమి ఉంది. వ్యవసాయ కూలీలే ఎక్కువ. వారి గతి ఏమిటని పట్టించుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధం, అమరావతి ధర్మానికే విరుద్ధం. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటారా? నాడు నాగార్జునుడు బోధించిన రాజధర్మం గురించి ఏపీ ప్రభుత్వం, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించడం అవసరం. గౌతమీపుత్ర శాత కర్ణిది రాచరిక పాలన. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల క్షేమం కోసం పాలన జరగాలి. రాజ్యం భగవంతుడు ఇవ్వలేదు, పై లోకాల నుంచి ఊడిపడలేదన్న ఆచార్య నాగార్జునుని బోధనలు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత ఎక్కువగా వర్తిస్తాయి. అమరావతి అంటే మరణం లేని స్థలం. సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన ప్రజలు నివసించే స్థలం కింద లెక్క. అంటే మానవతావాదం, కరుణ, జ్ఞానం, ప్రజ్ఞగల మనుషులు సంచరించిన నేల. మనిషిని మనిషి ప్రేమించడం, ద్వేషాన్ని త్యజించడం బౌద్ధధర్మ స్థలం ప్రత్యేకత. ఉన్నత, నీచ భేదం కానరాని ఒక ఆదర్శ సమాజాన్ని ఆవిష్కరిం చిన నేల అమరావతి. ఆ పేరుతో రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం ప్రజల పట్ల కరుణ, ప్రేమలను ప్రదర్శించలేకపోవడం, వివక్షతతో అణచి వేయడం గర్హ్హనీయం. అమరావతి పేరును స్వీకరిస్తున్న ప్రభుత్వం అలనాటి రాజధాని సాంస్కృతిక, ధార్మిక, పాలనాపరమైన వారసత్వానికి భిన్నంగా ప్రవర్తించడమంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమే. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
మధ్యతరగతి మౌనం వీడాలి
విశ్లేషణ - కొత్త కోణం ప్రభుత్వాలు తప్పులు చేయడం సహజం. అయితే నోరున్న మధ్యతరగతి మేధావి వర్గం స్పందిస్తే ప్రభుత్వాలు పునరాలోచనలో పడతాయి. లేదంటే మౌనాన్ని పూర్తి అంగీకారంగా భావించి తప్పుడు విధానాలనే కొనసాగిస్తాయి. కార్పొరేట్ రంగం నేడు వేగంగా గ్రామాలను, వ్యవసాయాన్ని, కులవృత్తులను ధ్వంసం చేస్తోంది. దళితులు, గిరిపుత్రులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. కార్పొరేట్ రంగం అల్లిన రంగుల కలల ప్రపంచం నుంచి మధ్యతరగతి వర్గం బయటపడాలి. జన్మనిచ్చిన పల్లెకు, బతుకునేర్పిన సమాజానికి అండగా నిలవాలి. మేధావులంటే పండితులే కావాల్సిన అవసరంలేదు. పండితులంతా మేధావులూ కానవసరంలేదు. ఏదో ఒక రంగంలో నైపుణ్యం కలిగి, అవస రమైతే అధికారాన్ని ప్రశ్నించగలిగిన వారే మేధావులు. అందుకే ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ ఇటీవల ఒక సభలో పాండిత్యం ఉంటే మేధావులు అవుతారనేది అబద్ధం అని వ్యాఖ్యానించారు. ప్రముఖ జర్నలిస్టు నిఖిల్ చక్రవర్తి స్మారకోపన్యాసం చేస్తూ ఆమె భారత మేధావుల తీరు పట్ల ఆందోళన వెలిబుచ్చారు. అధికారాన్ని ప్రశ్నించకపోవడం దేశ ప్రగతికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అది కేవలం ఆందోళన మాత్రమే కాదు పచ్చి వాస్తవం కూడా. చనిపోవడానికి ముందు సోక్రటీస్ ప్రశ్నించేవాడే మేధావి పాశ్చాత్య ప్రపంచంలో గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ మొదలుకొని ఎంతో మంది మేధావులు అధికారాన్ని ప్రశ్నించారు. అలా ప్రశ్నించే హక్కు కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడ్డారు. మన దేశంలో ప్రత్యక్షంగా అలాంటి ధిక్కార సంప్రదాయానికి గౌతమ బుద్ధుడిని మూలపురుషునిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అల్లకల్లోలం రాజ్యమేలు తున్న కాలంలో ఆయన అందుకు కారకులైన వారిని నిలదీ శాడు. అంతేకాదు ప్రత్యామ్నాయాలను చూపి, సమాజ విముక్తికి మార్గం చూపించాడు. బౌద్ధం ఆ రోజుల్లో ఒక విప్లవంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రశ్నించడంతోనే బుద్ధుడి సామాజిక జీవితం మొదలైంది. ఆయన వృద్ధుడిని, రోగిని, శవాన్ని, పేదవాడిని చూసి సన్యాసం తీసుకున్నాడని ప్రచారంలో ఉన్న కథ అసత్యం. ఆయన జన్మించిన శాక్య తెగకు, పొరుగున ఉన్న కొలియ తెగలకు మధ్య రోహిణి నది నీటి కోసం ఘర్షణలు సాగేవి. ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని అన్నందుకు ఆయన దేశం వదిలిపెట్టి పోవాల్సివచ్చింది. ఆ విధంగా ఇంటిని వదలిన గౌతముడు సమాజాన్ని ఆకళింపు చేసు కొని, పరిష్కార మార్గాలను కనుగొని బుద్ధుడిగా మారాడు. ఆయన ఆరోజు శాక్య గణసభను ప్రశ్నించి ఉండకపోతే, సుఖాలను త్యజించి సమాజం కోసం తపించకపోతే ఏం జరిగేదో చెప్పలేం. అదేవిధంగా భారత స్వాతంత్య్ర పోరా టానికి పునాదులు వేసిన దాదాభాయి నౌరోజి, మహదేవ్ గోవింద్ రనడే లాంటి వారి ప్రశ్నల కొడవళ్లే భారత జాతిని జాగృతం చేశాయి. ఆ ప్రశ్నల నుంచే గాంధీ నెహ్రూ లాంటి నాయకులు ఉద్భవించారు. భారత కుల సమా జాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించిన అంబేద్కర్ అంటరానితనాన్ని రూపు మాపకపోతే ఈ సమాజానికి నిష్కృతిలేదని భావించారు. ధైర్యంగా దాన్ని ధిక్కరించారు, తిరుగుబాటు చేశారు. లేకపోతే మన రాజ్యాంగం అంటరాని తనాన్ని నిషేధించి ఉండేదేకాదు. చరిత్రనిండా మేధావులు అధికారాన్ని, అధి కార భావజాలాన్ని ధిక్కరించిన ఉదాహరణలెన్నో. సమాజం నేడు ఈ స్థాయి లో అభివృద్ధి చెందడానికి కారణం ఎందరో మేధావులు చేసిన త్యాగాలే. పన్నులు కట్టే దెవరు? రాయితీలు ఎవరికి? మేధావులకు ఒక ముఖ్యవనరు అయిన మధ్యతరగతి నేడు సమాజ శ్రేయస్సు గురించిగాక, తమ బాగుకోసం మాత్రమే ఆలోచిస్తోంది. అంతేకాదు, దేశ సంపదను, వనరులను గుప్పిట పట్టిన కార్పొరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి, సమాజంలో నిరాదరణకు గురవుతున్న, వివక్షకు బలౌతున్న వర్గాల పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అనంతరం ఈ ధోరణి మరింతగా పెరిగింది. రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మధ్యతరగతి వర్గాన్ని మార్కెటీకరణ వెలుగు జిలుగులు అమితంగా ఆకర్షిస్తు న్నాయి. ప్రభుత్వాలు కూడా ఇటువంటి వర్గాలు మరింతగా వ్యక్తిగత ప్రయో జనాలకు అంటిపెట్టుకునేలా వారికి రాయితీలను ఇస్తున్నాయి. ఇటువంటి విధానాలు పేదలకు, మధ్యతరగతికి మధ్యన పెద్ద అగాధాన్ని సృష్టిస్తున్నా యి. ఇటీవల జరిగిన ఒక సర్వేలో దేశంలోని నూటికి 80 శాతం మంది కేవలం రోజుకు 25 రూపాయల ఆదాయం, ఖర్చుతో జీవిస్తున్నట్టు తేలింది. దీన్ని బట్టి దేశంలోని పేదల జీవన విధానానికి, సంపన్నుల జీవన విధానానికి మధ్యనున్న అంతరం ఎంత విపరీతంగా పెరిగిపోయిందో తేలిపోతోంది. ఈ దుస్థితిని దృష్టిలో పెట్టుకొని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నాటి నుండి నేటి వరకు మేధావులు, పట్టణ మధ్య తరగతి వర్గాలు విమర్శలను గుప్పిస్తూనే ఉన్నాయి. నిజానికి అర్హులైన కూలీ లలో సగం మంది మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఉపయో గించుకున్నవారికి కూడా నిర్దేశించిన దానిలో సగం దినాలు మాత్రమే పని లభించిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అదేవిధంగా ఆహార భద్రతా చట్టం విషయంలోనూ మధ్యతరగతి చాలా తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించిం ది. కొందరు దీన్ని ప్రజాధన దుర్వినియోగం అన్నారు. మరికొందరు తాము కడుతున్న పన్నులతో ఖజానాకు సమకూరిన ధనాన్ని సంక్షేమ కార్యక్రమాల పేరిట వృథా చేస్తున్నారని వాపోయారు. ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నం అవు తుంది. నిజానికి పన్నులు కడుతున్నదెవరు? ప్రయోజనం పొందుతు న్నదెవరు? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మధ్యతరగతి, ధనికులు ప్రత్యే కించి చెల్లించే ఆదాయం పన్ను కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే. మిగిలిన 85 నుంచి 90 శాతం రాబడి ప్రజలందరూ కొనుగోలు చేసే వస్తువుల మీద వేసే కమర్షియల్ ట్యాక్సెస్ ద్వారా చేకూరుతోంది. అం దులో ఎక్కువ శాతం పేద, దిగువ మధ్య తరగతుల నుండే వస్తోంది. నిజా నికి పన్నుల్లో అధిక భాగాన్ని చెల్లిస్తున్న 80 శాతం జనాభా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు బాగా తక్కువగా ఉంటోంది. కానీ ఎక్కువ భాగం కార్పొరేట్, ధనిక, ఉన్నత మధ్యతరగతి వర్గాల సౌకర్యాల కోసమే ఖర్చవుతోంది. అందుకే మధ్యతరగతి ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించకుండా మౌనం వహిస్తోంది. రంగుల కలల నుంచి బయటపడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం కోసం మూడు కాలాలు పచ్చగా ఉండే పంట పొలాలను ధ్వంసం చేసి వేలాది మంది పల్లె ప్రజలను వీధుల్లోకి గెంటేస్తుంటే పల్లెల నుండి ఎదిగి వచ్చిన మధ్యతరగతి ధనిక వర్గాలు సైతం మౌనం వహిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ పట్ల కూడా ఈ వర్గాల్లో కదలిక లేకపోవడం విచారకరం. ఇది భవిష్యత్తులో చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వాలు తప్పులు చేయడం సహజం. అయితే నోరున్న మధ్యతరగతి మేధావి వర్గం స్పందిస్తేనే ప్రభుత్వాలు పునరాలోచనలో పడతాయి. లేదంటే మౌనాన్ని పూర్తి అంగీకారంగా భావించి తప్పుడు విధానాలనే కొనసాగిస్తాయి. ఇది మొత్తం సమాజ పురోభివృద్ధినే దెబ్బతీస్తుంది. అందుకే మధ్యతరగతి పై అంతస్తులకు ఎదిగిన వర్గం పాలకులను ప్రశ్నించడం అవసరం. దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై ఆధిపత్యాన్ని నెరపుతున్న కార్పొరేట్ రంగం మధ్యతరగతి వర్గానికి కొన్ని తాయిలాలు ఇస్తూ వారిలోని ప్రశ్నించే తత్వాన్ని చంపేయాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రభావం తాత్కాలికమే. ఇదే మధ్యతరగతి వర్గం సమాజంలో సాగుతున్న అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా ముందు వరుసలో నిలబడి పోరాడిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇటీవల సాగిన తెలంగాణ ఉద్యమంలో మధ్యతరగతి వర్గం నిర్వహించిన పాత్ర కీలకమైనది. అయితే భవిష్యత్తులో, తెలంగాణ నిర్మాణంలో కూడా వారు అదే పాత్రను పోషిస్తారో, లేదో చూడాల్సిందే. గ్రామాల్లోని రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలను కార్పొరేట్ రంగం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. గ్రామాలను, వ్యవసాయాన్ని, కుల వృత్తులను ధ్వంసం చేసే పనిని కార్పొరేట్ రంగం అతివేగంగా సాగిస్తోంది. అదే సమయంలో తరతరాలుగా అంటరానితనానికి గురైన దళితులు, సమాజానికి దూరంగా బతుకుతున్న గిరిపుత్రులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఈ పరిస్థితి మారాలంటే కార్పొరేట్ రంగం అల్లిన రంగుల కలల ప్రపంచం నుంచి మధ్యతరగతి వర్గం బయటపడాలి. జన్మనిచ్చిన పల్లెకు, బతుకునేర్పిన సమాజానికి అండగా నిలవాలి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్ నం: 9705566213