మల్లెపల్లి లక్ష్మయ్య
కొత్త కోణం
ఉన్నత, నీచ భేదం కానరాని ఆదర్శ సమాజాన్ని ఆవిష్కరించిన నేల అమరావతి. ఆ పేరుతో రాజధానిని నిర్మిస్తున్న ప్రభుత్వం ప్రజల పట్ల కరుణ, ప్రేమలను ప్రదర్శించలేకపోవడం, వివక్షతతో అణచివేయడం గ ర్హనీయం. ‘ధర్మహీనముగా పాలింపరాదు’ అంటూ ఆచార్య నాగార్జునుడు కూడదన్న పనినే... అదీ ‘అమరావతి’ కోసమే చేయడం భావ్యమేనా? అమరావతి పేరును స్వీకరిస్త్తున్న ప్రభుత్వం అలనాటి రాజధాని సాంస్కృతిక, ధార్మిక, పాలనా వారసత్వానికి భిన్నంగా ప్రవర్తించడమంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమే.
‘‘పంటలు నష్టమైన రైతులకు విత్తనాలిచ్చి, పన్నులు తొలగించాలి. పేదలపై పన్నులు వేయవద్దు. పన్నుల కోసం ప్రజలను బాధించవద్దు. ఎవరి నైనా విచారించేటప్పుడు నిన్ను ఆ స్థానంలో ఊహించుకొని అట్లే విచారణ జరపవలెను. పంచభూతాలు అందరికీ అందుబాటులో ఉన్నట్టే రాజు ప్రజ లకు అందుబాటులో ఉండవలెను.’’ ఇది బౌద్ధ గురువు బోధిసత్వ ఆచార్య నాగార్జునుని ప్రబోధం. ఆయన తన సమకాలికుడైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి చక్రవర్తికి బోధించిన రాజ్యధర్మ దర్శనం. అది రాజుల, చక్రవర్తుల వంటి పాలకులందరికీ చేసిన మార్గనిర్దేశన కూడా.
సహోదరత్వం, ప్రజాహితమే సద్ధర్మం
‘‘పరలోకమందుండి తేలేరు రాజ్యము
మరు జన్మకు తోడుగా రాబోదు రాజ్యము
ధర్మముచే సంప్రాప్తమైనది భాగ్యం
ధర్మహీనముగా దాని పాలింపరాదు.’’
రాజ్యపాలన ధర్మం కోసమే గానీ మరిదేని కోసం కాదని, పరహితమే సద్ధర్మమని నాగార్జునుడు ప్రవచించాడు. ధర్మనిలయాలను నెలకొల్పి పండి తులను, నిస్వార్థపరులను, విచక్షణ కలిగిన వారిని అధికారులుగా నియమిం చాలనీ, నీతిధర్మం తెలిసినంత మాత్రాన సరిపోదని శీలం, నిర్మలత్వం, మం చి మనసున్న వారిని మంత్రులుగా, అధికారులుగా నియమించాలనీ ఆయన చక్రవర్తులకు సూచించారు. నాగార్జునుడు శాతవాహనుల పాలనా కాలంలో కృష్ణా తీరంలో బౌద్ధ ధర్మాన్ని విల్లసిల్లజేశాడు. ధాన్యకటకం అంటే అమరా వతి రాజధానిగా శాతవాహనులు క్రీ.పూ.3వ శతాబ్ది నుంచి క్రీ.శ 3వ శతాబ్ది వరకు దాదాపు ఆరువందలేళ్లు సువిశాల సామ్రాజ్యాన్ని పాలించారు. అశో కుని కాలంలోనే అక్కడ ఒకమహా స్తూపం నిర్మాణం ప్రారంభమై, చాలా కాలం సాగింది. అన్ని మతాలపట్ల సమాదరాన్ని పాటించిన శాతవాహనులు బౌద్ధంతోపాటు, వైదిక మతాన్ని కూడా పోషించారు. సామాన్య ప్రజలలో నాడు బౌద్ధం ప్రబలంగా ఉండేది. స్తూపం నిర్మాణానికి అన్ని వర్గాల, వృత్తుల ప్రజలు సహకరించారు. స్తూపంలో ఉంచిన పలు వస్తువులు, పాత్రలు వారు బహూకరించినవేనని పరిశోధకులు తేల్చారు. స్తూపంలోని పూర్ణఘటం విధికుడు అనే చర్మకారుని కానుక. బౌద్ధం ప్రకారం పూర్ణఘటం సంపూర్ణ జ్ఞానానికి సంకేతం. బౌద్ధం ప్రభావం వలన నాడు సామాజిక అంతరాలు బలంగా లేవు. ప్రజల మధ్య సహోదరత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పూర్ణ ఘటాన్ని తర్వాత పూర్ణకుంభంగా మార్చి 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నంగా ప్రకటించారు.
నాటి అభివృద్ధికి పునాది మానవతావాదం
బౌద్ధ ధర్మంతోపాటే అమరావతి చుట్టూతా అల్లుకున్న మానవతావాదం ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు. దక్షిణాసియాదేశాల పాలకుల మీద, ప్రజల మీద విశేష ప్రభావాన్ని నెరపింది. ముఖ్యంగా విదేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాల్లో బౌద్ధం విప్లవాత్మకమైన మార్పులను తెచ్చింది. దీంతో ఎగుమ తుల కోసం వస్తువుల ఉత్పత్తి పెద్ద ఎత్తున విస్తరించింది. వ్యాపారులకు, వృత్తి పనివారికి లభించిన ప్రోత్సాహంతో వారు బౌద్ధాన్ని తమ సొంత మతంగా భావించారు. అంతవరకు వైదిక మతం సముద్రయానాన్ని నిషేధించడం వల్ల వస్తువుల ఎగుమతి నిలిచిపోయి, వృత్తులన్నీ మూలపడ్డాయి. నాటి ైవె దిక మతం విచ్చలవిడిగా చేస్తుండిన యజ్ఞయాగాల వల్ల పశుసంపద క్షీణించి పోయే పరిస్థితి ఏర్పడి, వ్యవసాయాభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. ఆ పరిస్థితుల్లో అనవసరంగా పశువులనే కాదు, ఏ జీవినీ చంపరాదని, హింసిం చరాదని బౌద్ధం జీవకారుణ్యాన్ని ప్రచారం చేసింది. వ్యవసాయానికి ప్రధాన చాలక శ క్తియైన పశు సంపద క్షీణతకు అడ్డుకట్ట వేసి బౌద్ధం రైతులకు భరోసా నిచ్చింది. బౌద్ధ ధర్మం చాటిన మానవతావాదం, జీవకారుణ్యాల ఫలితంగా అమరావతి ప్రాంతం వ్యవసాయ కేంద్రంగా మారి, ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందింది. అమరావతి ధాన్యకటకంగా మారింది.
బౌద్ధ చరిత్రలో గౌతమ బుద్ధుని తర్వాత ఆచార్య నాగార్జునునికే అంతటి ప్రాచుర్యం లభించింది. ఆయన మహాయాన బౌద్ధంలోని మాధ్యమికవాద ప్రవక్త. శాతవాహనుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవ తెలుగు రాజవంశంలో జన్మించిన బోధిధర్మ చైనాలో జెన్ బౌద్ధానికి ఆద్యుడు. ఆత్మ రక్షణ కోసం బౌద్ధ బిక్షువులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ఆదిగురువు బోధి దర్ముడే. ఆయన కూడా అమరావతి బౌద్ధం నుంచే ప్రేరణ పొందాడు. ఈ కృష్ణా తీరం నుంచే బౌద్ధులు పెద్ద సంఖ్యలో శ్రీలంకకు వెళ్లినట్టు ఆధారాలున్నాయి. శ్రీలంకలోని కొన్ని బౌద్ధ చైత్యాలలో తెలుగు తాళపత్ర గ్రంథాలున్నట్టు తెలుస్తున్నది. కొలంబోలోని నేషనల్ మ్యూజియం లైబ్రరీలో సైతం తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిని పరిశోధించి, క్రోడీకరిస్తే తెలుగునేలపై విలసిల్లిన బౌద్ధ చరిత్రలోని పలు కొత్త కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అలాగే దక్షిణాసియా దేశాల్లో కూడా తెలుగు బౌద్ధం ప్రభావం చాలా ఉన్నది. ఆ విషయాలపై సైతం సమగ్ర పరిశోధన అవసరం.
‘అమరావతి’ కోసం సమధ ర్మంపై యుద్ధం
ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు ప్రస్తావించడానికి కారణం నేడు అమరావతి పేరు మరోమారు మారుమోగుతుండటమే. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం పేరును ‘అమరావతి’గా నిర్ణయించారు. మానవత్వం, కారుణ్యం, సమభావాలను ఎలుగెత్తి చాటిన గొప్ప బౌద్ధ చారిత్రక స్థలి పేరుతో నిర్మి స్తున్న నవ్యాంధ్ర రాజధాని నాటి చరిత్రను గుర్తుకు తెస్తోంది, వర్తమానంతో బేరీజువేసి ఆలోచించేలా చేస్తోంది. ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత కొంత కాలంగా రాజధాని కోసం ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించింది. మూడు కాలాలు మూడు పంటలు పండే వేలాది ఎకరాలను రాజధాని కోసం సేకరిం చడం ఆ ప్రాంత ప్రజలందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. రైతులే స్వచ్ఛం దంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని ప్రభుత్వం అంటోం ది. అది నిజం కాదనీ, బెదిరించి, ప్రలోభపెట్టి ప్రభుత్వం భూములను స్వాధీ నం చేసుకుంటున్నదనీ రైతులు, ప్రజలు ప్రభుత్వ తీరును దుయ్యబడుతు న్నారు. సేకరణకు లేదా సమీకరణకు సహకరించని రైతులు నష్టపోతారని ముఖ్యమంత్రే హెచ్చరికలు చేసిన వైనాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ‘ధర్మహీ నముగా పాలింపరాదు’ అంటూ నాగార్జునుడు కూడదన్న పనినే... అదీ ‘అమరావతి’ కోసమే చేయడం భావ్యమేనా?
పైగా పట్టా భూములున్న రైతులకు కోట్ల రూపాయల ఆశలు చూపు తున్న ప్రభుత్వం అసైన్డ్ భూముల రైతాంగంపై చిన్నచూపు చూస్తూ అసమ ధర్మమే తమ మతమని చాటుతుండటం విచారకరం. రైతులతో అది సమావేశాలు నిర్వహిస్తోంది, వారిని బుజ్జగిస్తోంది. కానీ అసైన్డ్ భూముల రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా అసైన్డ్ భూములనే ఎక్కు వగా కలిగిన దళితులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిగతా రైతులకు కల్పి స్తున్న ప్రయోజనాలను వీరికి ఇవ్వడం లేదు. పట్టా రైతులకు 1,200 గజాల అభివృద్ధి చేసిన భూమిని ఇస్తే, దళిత ైరె తుల అసైన్డ్ భూమికి 800 గజాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇక భూమిలేని వ్యవ సాయ కూలీలు, కౌలు రైతులకు కలుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. వారి గురించి ప్రభుత్వం ఆలోచించినట్టే కనిపించడం లేదు. భూసేకరణ జరుపు తున్న ప్రాంతంలో దళితులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలా కొద్ది మందికే భూమి ఉంది. వ్యవసాయ కూలీలే ఎక్కువ. వారి గతి ఏమిటని పట్టించుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధం, అమరావతి ధర్మానికే విరుద్ధం.
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటారా?
నాడు నాగార్జునుడు బోధించిన రాజధర్మం గురించి ఏపీ ప్రభుత్వం, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించడం అవసరం. గౌతమీపుత్ర శాత కర్ణిది రాచరిక పాలన. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల క్షేమం కోసం పాలన జరగాలి. రాజ్యం భగవంతుడు ఇవ్వలేదు, పై లోకాల నుంచి ఊడిపడలేదన్న ఆచార్య నాగార్జునుని బోధనలు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత ఎక్కువగా వర్తిస్తాయి. అమరావతి అంటే మరణం లేని స్థలం. సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన ప్రజలు నివసించే స్థలం కింద లెక్క. అంటే మానవతావాదం, కరుణ, జ్ఞానం, ప్రజ్ఞగల మనుషులు సంచరించిన నేల. మనిషిని మనిషి ప్రేమించడం, ద్వేషాన్ని త్యజించడం బౌద్ధధర్మ స్థలం ప్రత్యేకత. ఉన్నత, నీచ భేదం కానరాని ఒక ఆదర్శ సమాజాన్ని ఆవిష్కరిం చిన నేల అమరావతి. ఆ పేరుతో రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం ప్రజల పట్ల కరుణ, ప్రేమలను ప్రదర్శించలేకపోవడం, వివక్షతతో అణచి వేయడం గర్హ్హనీయం. అమరావతి పేరును స్వీకరిస్తున్న ప్రభుత్వం అలనాటి రాజధాని సాంస్కృతిక, ధార్మిక, పాలనాపరమైన వారసత్వానికి భిన్నంగా ప్రవర్తించడమంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమే.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213