నైపుణ్యమే అసలు సంపద | skills are The wealth | Sakshi
Sakshi News home page

నైపుణ్యమే అసలు సంపద

Published Thu, Jun 9 2016 12:45 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

నైపుణ్యమే అసలు సంపద - Sakshi

నైపుణ్యమే అసలు సంపద

కొత్త కోణం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మాత్రమే కాదు, భారతదేశమే తన దృక్పథాన్ని మార్చుకోవాలి. వ్యాపార వాణిజ్య వర్గాలు, పరిశ్రమల అధిపతులు ఇప్పుడు అమలులో ఉన్న విద్యా విధానాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించాలి. పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార రంగాల్లో దేశం అభివృద్ధి కావాలంటే నైపుణ్యం కలిగిన కార్మిక, ఉద్యోగ శక్తులు అవసరం. భారత ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రధానమైన అడ్డంకి ఈరోజు అమలులో ఉన్న విద్యావిధానం. చాలామంది పరిశ్రమాధిపతులు నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నారు.

 

‘ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగలను. ఇక్కడి పద్ధతి నాకు నచ్చింది. శిక్షణ నుంచి నేను బయటికొచ్చేసరికి ఒక మంచి ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌గా తయారుకాగలను. నాకు ఇది ఎంతో సంతృప్తినిస్తున్నది.’ జర్మనీకి చెందిన 18 సంవత్సరాల రాబిన్ దిత్తమర్ అన్న మాటలివి. రాబిన్‌కు చిన్నప్పటి నుంచి విమానాలంటే పిచ్చి. గాలిని చీల్చుకుంటూ వినువీధుల్లో దూసుకెళ్లే రెక్కల వాహనాన్ని నడపగ లిగితే... అని కలలుకంటూ ఊహల్లోకి ఎగిరిపోయేవాడు. కానీ పాఠ శాలలో రాబిన్‌కు వచ్చిన గ్రేడ్ ప్రకారం పైలట్ అర్హత లేదు. ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ కావడానికి అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు నచ్చచెప్పారు. జర్మనీ విమాన కంపెనీ లుఫ్తాన్సాలో రాబిన్ అప్రెంటిస్‌గా చేరారు. పైలట్ కాలేకపోతేనేం, విమానాన్ని మరమ్మతు చేసే మెకానిక్‌ని నేనౌతానంటూ అందులోనే ఆసక్తిని పెంచుకున్నాడు.


ద్విముఖ శిక్షణ
జర్మనీ విద్యావిధానంలో పాఠశాల చదువు సాగిస్తూనే, ఏదో ఒక సాంకేతిక, పారిశ్రామిక, లేదా ఇతరత్రా ఉత్పాదక రంగంలో పనిచేసే నైపుణ్యం సంపాదించుకోవడానికి విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఇది విద్యార్థులను అత్యంత చురుకుగా ఉంచుతూ, ప్రతిభావంతులుగా తయారుచేస్తుందని రాబిన్ లాంటి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. రాబిన్ తన రోజువారీ పనిలో మూడింట రెండు వంతులు లుఫ్తాన్సా వర్క్‌షాప్‌లోనే గడుపు తున్నారు. మూడున్నర సంవత్సరాల శిక్షణ తర్వాత రాబిన్‌కు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది. దాదాపు 60 శాతం మంది విద్యార్థులు రాబిన్ మార్గాన్నే ఎంచుకుంటారు. శిక్షణ సమయంలో స్టైపెండ్  ఇస్తారు. జర్మనీలో ప్రతి సంవత్సరం పదిహేను లక్షల మందికి ఈ పద్ధతిలో తర్ఫీదు ఇస్తారు. ద్విముఖ శిక్షణగా పేరుగాంచిన ఈ విధానం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది.
 

 ఇటీవల బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ జర్మనీలో సాగుతున్న విద్య-ఉద్యోగ విధానంపైన ఆసక్తి కన బరిచారు. జర్మనీలో అమలవుతున్న విద్య-ఉద్యోగ విధానంపైన దాదాపు 20 మంది బ్రిటన్ యువ పరిశోధకులు గత సంవత్సరం మార్చిలో ఒక సర్వేను నిర్వహించారు. వృత్తిపరమైన శిక్షణలో సాంకేతిక అంశాలను జోడించడం, అదేవిధంగా వ్యాపార, వాణిజ్య వర్గాలను విద్యావిధానంలో పాఠశాల, కళాశాలల నిర్వహణలో భాగస్వా ములను చేయడం వంటి విషయాలను ఆ బృందం పరిశీలించింది. ఆ వివరాల ప్రకారం, జర్మనీలో మూడు అంచెల విద్యావిధానం అమలులో ఉంది. ప్రాథమిక స్థాయిలో చదువు చెబుతారు. సెకండరీ స్థాయిలో ద్విముఖ వ్యూహం అమలులో ఉంది. అంటే పాఠశాలకు వెళుతూనే, వృత్తి నైపుణ్యం సంపాదించడానికి అప్రెంటిస్‌షిప్ చేస్తూ తాము ఆర్జించిన జ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా పరీక్షించి నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. మూడవది వివిధ రకాలైన శాస్త్ర, సాంకేతిక, చరిత్ర, సంగీతం, తత్వశాస్త్రం లాంటి అధ్యయ నాలు. ఏ విద్యార్థి ఏ కోర్సుకి వెళ్లాలో వారి వారి ఆసక్తిని బట్టి, వారి ప్రతిభను బట్టి నిపుణులు సలహాయిస్తుంటారు. అంటే జర్మన్ విద్యావిధానం ఒక రకంగా శాస్త్రీయ పద్ధతిలో సాగుతున్నట్టు భావించాలి.

ఈ విధానాన్ని అనుసరించడం వల్లనే ప్రపంచంలోనే నిరుద్యోగ రేటులో జర్మనీ అన్ని దేశాలకంటే చివరలో ఉన్నది. అంటే ఉద్యోగాల కల్పనలో జర్మనీ ప్రథమ స్థానంలో ఉందన్నమాట. ఇక్కడ విద్యను అభ్యసించిన వాళ్లలో నూటికి 98 శాతం మంది ఉద్యోగ, ఉపాధిని కలిగి ఉన్నారు. ఇది అమెరికా, యూరప్‌లోని అన్ని దేశాలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను అందిస్తున్నది. సహజంగానే పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ఎదురెదురుగా నిలబడి సంఘర్షణకు సిద్ధంగా ఉండే కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాయి. పైగా ప్రతి సంవత్సరం నిర్ణయించుకుంటున్న లక్ష్యాలలో కూడా కార్మిక, ఉద్యోగ సంఘాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. అనేక కంపెనీలు ప్రతి పాఠశాలతో సంబంధాలను కలిగి ఉంటాయి. ప్రాథమిక విద్య దశనుంచే విద్యార్థులకు తాము భవిష్యత్‌లో ఏయే రంగాల్లో నైపుణ్యం సంపాదించుకోవచ్చనే అవగాహనను కంపెనీలు నిరంతరం తెలియజేస్తుంటాయి. ఇందుకుగాను ప్రతి సెకండరీ పాఠశాలలో పారిశ్రామిక సంస్థల నుంచి ఒక సమన్వయకర్త ఉంటారు. విద్యార్థుల ఆసక్తి, ప్రవృత్తి, శక్తి సామర్థ్యాలను బట్టి విద్యార్థులకు మార్గదర్శకత్వం చేస్తారు. ఎవరికైనా పారిశ్రామిక, సాంకేతిక విద్యవైపు కాక ఇతర సామాజిక, సాహిత్య విష యాలపై ఆసక్తి ఉంటే వాటికి సంబంధించిన వివరాలను కూడా పాఠశాల స్థాయిలోనే అందిస్తారు. కంపెనీల యజమానులు, యజమానుల సంఘాలు, కళాశాల, విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ఉన్న సమన్వయ సంస్థలు ప్రశ్నలు, జవాబుల రూపంలో ఆడియో, వీడియో, పుస్తకాలను రూపొందిస్తాయి. సెకండరీ స్థాయి విద్యలోకి అడుగుపెట్టేటప్పటికేప్రతి విద్యార్థీ తన గమ్యాన్ని, అందుకు సంబంధించిన తన గమనాన్ని నిర్దేశించుకుంటాడు.

 నైపుణ్యం కొరవడిన విద్య

 భారతదేశంలోని పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. అందులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యావిధానం మరింత హేతువిరుద్ధం. ఉపాధి, ఉద్యోగ కల్పన విషయంలో మన ప్రభుత్వాలు తీవ్ర వైఫల్యం చెందాయి. ఇందుకు నాయకుల సంకుచితత్వమే ప్రధాన కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలను కేవలం కొద్దిమంది వ్యాపారులకు లాభాలు సంపాదించిపెట్టే కర్మాగారాలుగా మార్చారు. కేవలం ఇంటర్మీడియట్ విద్యను మాత్రమే కేంద్ర బిందువుగా మార్చారు. అటు ప్రాథమిక విద్య, ఇటు ఉన్నత విద్య కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. దానితో పాటు అమెరికా ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని, ఐటీ రంగమే ఆరాధ్య వృత్తిగా ప్రచారం చేసి ఎన్నో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలను ఉనికిలోకి తెచ్చారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని, తగిన బోధనా సిబ్బంది లేని వందల ప్రైవేట్ ఇంజ నీరింగ్ కళాశాలలు దాని ఫలితమే. ఇవి కూడా యాజమాన్యాలు కోట్లు గడించడానికి మాత్రమే పనికివస్తున్నాయి. వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఎటువంటి నైపుణ్యంలేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌గా రోడ్ల మీదికి వదులుతున్నాయి.

  స్వతంత్ర భారతదేశంలో విద్యావిధానం మీద చాలా చర్చ జరిగింది. 1963-64 ప్రాంతంలో నియమించిన కొఠారి కమిషన్ ఉన్నతమైన, ప్రయోజనకరమైన సిఫారసులు చేసింది. అందులోనే, సెకండరీ స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి నైపుణ్యాన్ని నేర్పించాలన్న ముఖ్యమైన సిఫారసు కూడా ఉంది. దానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనైనా పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటిఐ)ల ఏర్పాటు జరిగింది. 1970-80 ప్రాంతంలో ఐటిఐలలో శిక్షణ పొందిన ప్రతి విద్యార్థి ఉద్యోగం తెచ్చు కున్నాడు. అప్పుడు ఐటీఐలన్నింటినీ పరిశ్రమలతో అనుసంధానం చేశారు. దానితో ఐటిఐ చదివిన విద్యార్థి తనకు అవకాశం వచ్చిన కంపెనీలో అప్రెంటిస్‌షిప్ చేసి అక్కడే పర్మినెంట్ ఉద్యోగం పొందేవాడు. కాలక్రమంలో ఆ విధానం మూలపడింది. తర్వాత 1983 ప్రాంతంలో వృత్తివిద్యా కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు ఎన్ని వచ్చినప్పటికీ అవి కొద్దిమంది రాజకీయ నాయకులకు ఉపాధి కల్పించే సంస్థలుగానే ఉపయోగపడ్డాయి. విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనాన్ని అందించలేకపోయాయి. దాని ఫలితమే ఈరోజు లక్షలాది మంది డిగ్రీలు చేతబట్టుకొని అర్హతకు, ఆసక్తికి సంబంధంలేని పనులు చేస్తున్నారు. చాలా మందికి అవీ లభ్యం కావటం లేదు.

 

జర్మనీ విధానమే ఆదర్శం
గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఉపాధి కల్పన జపం చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయే తప్ప నిరుద్యోగుల్లో ఒక్క శాతం కూడా ఉద్యోగాలు పొందే పరిస్థితిలేదు. శిక్షణ పేరుతో ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం దగ్గర నిధులు రాబట్టి కేవలం అటెండెన్స్ రిజిస్టర్‌లో పేరు నమోదుచేసి ఎటువంటి శిక్షణా ఇవ్వకుండా సర్టిఫికెట్లు నిరుద్యోగుల ముఖాన కొట్టి కోట్లు గడించాయి. ఇందువల్ల స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణకు అర్థం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు. శిక్షణ పొందిన ప్రతి విద్యార్ధి ఉపాధి పొందేవిధంగా నిర్దిష్టమైన చర్యలపై ప్రభుత్వ దృష్టి లేదు. ఈ మొత్తం పరిస్థితి మారడానికి మన విద్యావ్యవస్థను ప్రాథమిక స్థాయి నుంచే సమూలంగా మార్చాలి. అందుకు ఏకైక ఆదర్శం జర్మనీ విధానం.

 తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మాత్రమే కాదు, భారతదేశమే తన దృక్పథాన్ని మార్చుకోవాలి. అదే విధంగా వ్యాపార వాణిజ్య వర్గాలు, పరిశ్రమల అధిపతులు ఇప్పుడు అమలు జరుగుతున్న విద్యావిధానాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించాలి. పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార రంగాల్లో దేశం అభివృద్ధి కావాలంటే నైపుణ్యం కలిగిన కార్మిక, ఉద్యోగ శక్తులు అవసరం. భారత ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రధానమైన అడ్డంకి ఈరోజు అమలులో ఉన్న విద్యావిధానం. చాలామంది పరిశ్రమాధిపతులు నైపుణ్యం కలిగిన కార్మికుల, ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నారు. నైపుణ్యంలేని కార్మికుల, ఉద్యోగుల కొరత వలన భారీ నిర్మాణాలలో ఇతర దేశాల నిపుణులను రప్పించాల్సి వస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెల్డింగ్ పనులకు చైనా కార్మికులను తెప్పించుకున్నారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తక్షణం మన విద్యా వ్యవస్థ, ఉద్యోగ కల్పనా రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టాల్సి ఉందన్న సంగతి అర్థమవుతుంది. దేశప్రజలూ, ముఖ్యంగా యువతరం చేతినిండా పనితో, కడుపు నిండా అన్నంతో బతికే మార్గాన్ని అన్వేషించాలి.

 

- మల్లెపల్లి లక్ష్మయ్య

 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు

 మొబైల్ : 97055 66213

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement