దళితజాతి చరిత్ర సమస్తం.. | Dalit History | Sakshi
Sakshi News home page

దళితజాతి చరిత్ర సమస్తం..

Published Thu, Apr 16 2015 1:20 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

మల్లెపల్లి లక్ష్మయ్య - Sakshi

మల్లెపల్లి లక్ష్మయ్య

కొత్త కోణం
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు ఒక సారూప్యత ఉంది. ఇక్కడ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఆయా దిగువస్థాయి సామాజిక వర్గాల వారు సంఘటితం కాగలిగారు. కానీ ఆధిపత్యంలోకి వచ్చిన కులాలు.. నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఇంకా దిగువన ఉన్న అంటరాని కులాలను మరింత అమానుషంగా అణచివేయడానికి సిద్ధపడ్డాయి. ఎదురు తిరిగితే తలలు తెగనరికారు. ఇప్పటికీ ఆ నరమేధాన్ని కొనసాగిస్తున్నారు.
 
 బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మాంఝీ అంటరాని కులాలలోనే అంటరానిదిగా చెప్పే ముషాహార్ కులానికి చెందినవారు. అంటే ఎలుకలను ఆహారంగా తీసుకునే కులమని అర్థం. బిహార్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా వారు అధిక సంఖ్యలో ఉన్నారు. పొరుగున ఉన్న నేపాల్‌లోనూ ఉన్నారు. దాదాపు 900 అంటరాని కులాలలో ముషాహార్‌ను అత్యంత వెనుకబడిన కులంగా పరిగణిస్తారు. వీరు కూడా గ్రామాలకు సుదూరంగా, అంటరాని కులాల నివాసాల కంటే దూరంగా నివసిస్తున్నారు. దేవాలయాలతో పాటు, ఇతర బహిరంగ స్థలాలలోకి కూడా వీరి ప్రవేశం నిషిద్ధం.

 స్వతంత్ర భారతదేశం రూపొందించుకున్న రాజ్యాంగంలో అంటరాని కులాలకు రక్షణ కల్పించారు. 1955లో పౌరహక్కుల రక్షణ చట్టంతో పాటు, 1989లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని కూడా రూపొందించారు. ఎవరైనా అంటరాని కులాల వారిని అవమాన పరిస్తే అలాంటివాళ్లని శిక్షించే అవకాశం ఈ చట్టం ఇస్తున్నది. దేశవ్యాప్తంగా ఎన్నో వేల కేసులు నమోదవుతు న్నాయి. ఏటా వందల సంఖ్యలో వీరు హత్యలకు గురి అవుతుండగా, వేల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలు అత్యాచారాలకు బలౌతున్నారు. ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జీతన్‌రామ్ మాంఝీ కూడా అంట రానితనం కారణంగా వివక్షకు గురికావడమే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ అంశం మీడియాలో అంత ప్రచారానికి నోచుకోలేదు. రాజ్యాంగం పరిధిలో పనిచేసే రాజకీయ పార్టీలలో ఏ ఒక్కటీ కూడా ఈ దుర్ఘటనను ఖండించక పోవడం తీవ్రమైన విషయం.

 ముఖ్యమంత్రి అయినా వివక్షేనా?
 జీతన్‌రామ్‌ను జనతాదళ్ (యు) ఇటీవల ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించింది. నితీశ్‌కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత జీతన్‌రామ్ ‘హిందుస్తానీ ఆవామ్ మోర్చా’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ రాజకీయ అంశాలను వేరే చర్చించవచ్చు. తన పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఈ నెల 6న సహార్స పట్టణానికి వెళుతూ మార్గమధ్యలో సుపాల్ పట్టణంలో ఆయన ఆగారు. సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధుడు రామ్‌మనోహర్ లోహియా విగ్రహానికి అక్కడ పూలమాల వేశారు. ఆ వెంటనే రాష్ట్రీయ జనతాదళ్ విద్యార్థి విభాగం, లోహియా విచార్‌మంచ్ కార్యకర్తలు లోహియా విగ్రహాన్ని నీటితో కడిగి మరో మాల వేశారు. నిజానికి జీతన్‌రామ్ అధికారంలో ఉండగా కూడా ఒక సంఘటన జరిగింది. మధుబని జిల్లాలోని ఒక దేవాలయంలో పూజలు నిర్వహించి వెళ్లిన వెంటనే ఆ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి అవమానం జరగడం భారతీయ సమాజానికే సిగ్గుచేటు. జనవరి 26, 1950న భారతీయులందరి పక్షాన రాజ్యాంగ రచనా సభ ఆమోదించిన లిఖిత పూర్వక రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని నిషేధించుకున్నాం. దీని ప్రకారం పౌరులంతా సమానులేననీ, ఎవరిని హీనంగా చూడరాదనీ, కులం పేరుతో అంటరానితనాన్ని పాటించడం నేరమనీ రాజ్యాంగంలో పేర్కొన్నారు. అయినా రాజ్యాంగం అమలులోకి వచ్చిన 65 ఏళ్ల తరువాత కూడా అలాంటి దుర్ఘటనలు పునరావృతం కావడం సమాజంలో కొనసాగుతున్న కులతత్వ క్రూరత్వానికి అద్దం పడుతున్నది.

 ఏమైంది లోహియా స్ఫూర్తి?
 మరొక అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. రామ్‌మనోహర్ లోహియా వంటి వారు కులం మీద ధ్వజమెత్తినవారే. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తరువాత కులాన్ని నిరసించిన వారిలో లోహియా ముఖ్యులు. కుల వ్యవస్థ మీద ఆయన వివరమైన పుస్తకం రాశారు. వనరులలో, నైపుణ్యంలో, జ్ఞానంలో సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పిం చాలనీ, అప్పుడే కుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందనీ సూచించారు. సామాజిక రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా కులతత్వ వ్యతిరేక శక్తులతో ఒక వేదికను ఏర్పాటు చేయాలని కూడా ఆశించారు. అందుకోసం అంబేడ్కర్‌తో లోహియా చర్చలు జరిపారు. ఉమ్మడిగా, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రాజకీయ కార్యక్రమం తీసుకోవాలని కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఈరోజు లోహియా పేరుతో సంఘాలు నడుపుతున్నవారు ఆయన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడం బాధ కలిగిస్తుంది.

 ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలను శత్రువులుగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా లోహియా శిష్యుడినని చెప్పుకుంటారు. యూపీఏ ప్రభుత్వం చివరికాలంలో పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీ పదోన్నతులలో రిజర్వేషన్‌ను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందకుండా, బిల్లు ప్రతులను చించివేసి అడ్డుకోవడం మనం చూశాం. అప్పటి నుంచి ఆ బిల్లు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ పరిణామం ఉపయోగపడుతుంది. ఆ రాష్ట్రంలోని ఎస్సీలు పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో ఉండడం, గ్రామాలలో ఎస్సీలకూ ఓబీసీ వర్గాలకూ; ముఖ్యంగా యాదవ్‌లకు మధ్య సాగుతున్న ఘర్షణలను పెంచడం కోసమే ఇటువంటి అప్రజాస్వామిక అరాచక చర్యకు సమాజ్‌వాదీ పార్టీ పాల్పడింది.

 తమిళనాట దళితుల ఊచకోత
 తమిళనాడు పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. గత యాభై ఏళ్లలో ఆ రాష్ట్రంలో ఎస్సీలపై జరిగిన మారణకాండ అంతా ఇంతా కాదు. 1968లో దాదాపు 44 మంది దళితులను సజీవంగా తగులబెట్టిన దుర్ఘటన దేశాన్ని నివ్వెరపరిచింది. 1977లో మెలవలవు అనే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సహా ఏడుగురిని పట్టపగలు గొడ్డళ్లతో నరికి చంపిన ఘటన ప్రపంచ వేదికల మీద చర్చకు వచ్చింది. 1977 ప్రాంతంలోనే జరిగిన కెలకణ్మని ఘటన కూడా ఇదే రకమైన క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రముఖ సామాజికోద్యమ నాయకుడు ఈవీ రామస్వామి నాయకర్ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు. అప్పటి వరకు ఉన్న బ్రాహ్మణ చాందసవాదాన్నీ, కులాధిపత్యాన్నీ చీల్చిచెండాడారు. అయితే ఆయన మరణానంతరం, ఆయన ఉద్యమంతోనే ఉత్తేజితమైన ద్రావిడ సంఘాలూ, సంస్థలూ ఈ రోజు దళితుల ఊచకోతకు కారకులవుతున్నారు. పైగా, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగమవుతున్నది కాబట్టి రద్దు చేయాలని అడుగుతున్నారు.

 సంఘటితం, ఆపై విధ్వంసం
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటువంటి అనుభవమే కనిపిస్తుంది. ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామిచౌదరి పురాణాల బూటకాన్ని ఎండకట్టారు. ఎన్నో ప్రగతిశీలమైన ఆలోచనలకు పునాదులు వేశారు. అయితే ఆయన బోధనలతో ఉత్తేజం పొందిన సమాజమే - ఒకవైపు బ్రాహ్మణ పురోహిత వర్గానికి వ్యతిరేకంగా సంఘటిత ఉద్యమాన్ని నిర్వహించింది. అయితే కాలక్రమంలో ఆ సంఘటిత తత్వమే కారంచేడులో హత్యాకాండకు పూనుకొనేటట్టు చేసింది. దీనిని చూసి, మరొక సామాజిక వర్గం చుండూరులో మరో దారుణానికి ఒడిగట్టింది.

 ఈ మూడు ప్రాంతాలలో ఒక సారూప్యత కనిపిస్తుంది. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. ఆర్థికంగా, రాజకీ యంగా, సామాజికంగా ఆయా దిగువస్థాయి సామాజిక వర్గాల వారు సంఘ టితం కాగలిగారు. అయితే నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఇంకా దిగువన ఉన్న అంటరాని కులాలను మాత్రం బ్రాహ్మణ వర్గం స్థానంలో ఆధిపత్యంలోకి వచ్చిన కులాలు, అంతకంటే అమానుషంగా అణచివేయడానికి సిద్ధపడ్డాయి. ఎదురు తిరిగితే తలలు తెగనరికారు. ఇప్పటికీ ఆ నరమేధాన్ని కొనసా గిస్తున్నారు.
 నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం దళితుల హత్యలూ, వారిపై సాగుతున్న అత్యాచారాలూ పైన చెప్పుకున్న రాష్ట్రాలలోనే ఎక్కువ. 2013 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 676 మంది దళితులు హత్యకు గురైతే, అందులో 222 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 53 మంది, బిహార్‌లో 50 మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 2,072 మంది దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగితే, వీరిలో 294 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. ఆంధ్రప్రదేశ్‌లో 114, బిహార్‌లో 68 మంది ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ పోలీస్‌స్టేషన్ల వరకు వచ్చిన ఉదంతాల వివరాలు. కానీ బిహార్ వంటి చోట పోలీస్ స్టేషన్ల వరకు రావడం సాధారణ విషయం కాదు.

 బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు జరిగిన చోట సమాజం పై పొరలో ఉన్న కొన్ని కులాలు ఆధిపత్యస్థానంలోకి వచ్చి మళ్లీ అదేదారిలో అణచివేత, దోపి డీలను సాగించడమే కాకుండా, ఎదురు తిరిగితే ఎంతటి అమానుషానికైనా తెగిస్తున్నారన్న వాస్తవం ఈ ఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. జీతన్‌రామ్ తమ చెప్పుచేతల్లో ఉన్నంతకాలం ఏమీ మాట్లాడలేదు. స్వతంత్రంగా నిలబడ దామనుకున్న వెంటనే సీటును లాగేసుకుని అడుగడుగునా అవమానిస్తు న్నారు. అందుకే కులం ఆధిపత్య వ్యతిరేక స్వభావం మాత్రమే సరిపోదు. సంపూర్ణంగా కుల నిర్మూలన జరగాలని డాక్టర్ అంబేడ్కర్ అన్న మాటలు అక్షరసత్యాలుగా నిలిచిపోతాయి.     

     (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement