చేతకాకపోతే ప్రత్యామ్నాయం చూపండి
తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై సర్కార్ కొత్త నాటకం
కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్
సాక్షి, బళ్లారి : తుంగభద్ర డ్యాం(టీబీ డ్యాం)లో పూడిక తీత చేతకాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. స్థానిక పత్రికా భవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీబీ డ్యాంలో పూడికతీతపై కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.
అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ సమస్యను కాంగ్రెస్, బీజేపీలు పక్కదారి పట్టిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల 33 టీఎంసీ నీటి నిల్వ సామార్థ్యం తగ్గిపోయిందని వివరించారు. డ్యాంలో పూడిక తీస్తామంటూ అధికారంలో ఉన్నప్పుడు బీజీపీ హడావుడి చేసిందని గుర్తు చేశారు.
పూడిక తీత సాధ్యం కాదని, ఇందుకు ప్రత్యేక టెక్నాలజీ అవసరమని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త నాటకానికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూడిక తీత ప్రభుత్వానికి చేతకాకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో పది వేల ట్రాక్టర్లను ఉపయోగించి డ్యాంలోని మట్టిని తరలిస్తామని అన్నారు. అంతేకాక పూడిక తీతపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
ఆనయకట్టు దారులపై చర్యలు తీసుకోండి
డ్యాం పరిధిలో 1.50 లక్షల ఎకరాల ఆనయకట్టు పెరిగిందని, అక్రమంగా నీటిని వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. డ్యాంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల రైతులు పంటలు పండించలేకపోతున్న తరుణంలో ఫ్యాక్టరీలకు నీటి సరఫరా నిలిపివేసి నీటి చౌర్యాన్ని అరికట్టాలన్నారు.
ఉత్తర కర్ణాటకలో చెరుకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, టన్ను చెరుకుకు రూ.2650ల ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో భాగంగా ఈనెల 21న హొస్పేట సమీపంలోని హిట్నాల్ క్రాస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకోలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ, జిల్లా రైతు సంఘం నాయకులు సాగర్‌గౌడ, పంపాపతి, సంతోష్‌కుమార్, ఉమేష్‌గౌడ, మల్లారెడ్డి పాల్గొన్నారు.