టెన్త్ టైంటేబుల్ మార్పుపై అప్రమత్తం చేయండి
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మారిన పదోతరగతి పరీక్షల తేదీలు, వేళలకు సంబంధించిన సమాచారం జిల్లాలో పరీక్షలకు రాస్తున్న ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా చేరేలా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ జారీచేసిన కొత్త టైంటేబుల్పై అన్ని పరీక్షాకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్ట్మెంటల్ అధికారులకు గురువారం రవీంద్రభారతిలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఈవో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తాజా సమాచారం మేరకు ఈనెల 7 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతాయన్నారు. ఈ సమాచారాన్ని అన్ని పరీక్షాకేంద్రాల్లోని ఇన్విజిలేటర్ల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు.
ఉల్లంఘనులపై చర్యలు..
పరీక్షాకేంద్రాలకు ఇన్విజిలేటర్లు ఆలస్యంగా వస్తున్నారని, కొన్నిచోట్ల సెల్ఫోన్లు వాడుతున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని డీఈవో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పాఠశాలల వేళలు మార్పు ..
టెన్త్ పరీక్షల వేళలు మారిన నేపథ్యంలో.. పరీక్షాకేంద్రాలున్న పాఠశాలల (6-9తరగతుల) వేళలను మార్చినట్లు డీఈవో తెలిపారు. ఆయా పాఠశాలలను ఈనెల 7 నుంచి ఉదయం 7.30-10.30 గంటల వరకు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. 6-9 తరగతులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నందున ఈనెల 15న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటలకు వరకు, ఆతర్వాత రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11.30 గంటలవరకు పరీక్షలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
16 నుంచి టెన్త్ స్పాట్..
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 16 నుంచి 28 తేదీ వరకు జరగనుందని డీఈవో తెలిపారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల్లో మేజర్ మీడియం, సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో మైనర్ మీడియం సబ్జెక్టుల మూల్యాంకనం నిర ్వహిస్తామన్నారు. నిర్ధేశిత గడువులోగా స్పాట్ వాల్యుయేషన్ ను ముగించేలా అధికారులు, ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈవో సుబ్బారెడ్డి కోరారు. ఎన్నికల విధులకు సంబంధించి ఉత్తర్వులు అందుకున్న ప్రధానోపాధ్యాయులు శుక్రవారం సికింద్రాబాద్లోని హరిహర కళాభ వన్లో జరగనున్న ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపవిద్యాశాఖాధికారులు సుశీంద్రరావు, వెంకటేశ్వర్లు, ఉప పర్యవేక్షణాధికారులు పాల్గొన్నారు.