New World Wealth
-
ధనిక నగరం... ముంబై
820 బిలియన్ డాలర్ల సంపద ⇒ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు ⇒ నాలుగోస్థానంలో హైదరాబాద్ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై ధనిక నగరంగానూ తన హవా కొనసాగిస్తోంది. 46,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లకు ముంబై నివాస స్థలం కాగా, మొత్తం సంపద 820 బిలియన్ డాలర్లుగా ఉందని ‘న్యూ వరల్డ్ వెల్త్’ నివేదిక తెలిపింది. ముంబై తర్వాత ఢిల్లీ, బెంగళూరు నగరాలు సంపద పరంగా ముందున్నాయి. ఢిల్లీలో 23,000 మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉండగా మొత్తం సంపద 450 బిలియన్ డాలర్లు. బెంగళూరు 7,700 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లకు నివాస స్థలంగా భాసిల్లుతోంది. వీరి మొత్తం సంపద 320 బిలియన్ డాలర్లు. దేశంలో మొత్తం సంపద 6.2 లక్షల కోట్ల డాలర్లు కాగా, 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు. సంపన్న నగరంగా అవతరిస్తున్న విశాఖ.... సంపద పరంగా నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరంలో 9,000 మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద 310 బిలియన్ల డాలర్లని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది. కోల్‌కతా నగరంలో 9,600 మంది మిలియనీర్లు ఉండగా, నలుగురు బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద 290 బిలియన్ డాలర్లు. పుణే నగరంలో 4,500 మంది మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లు నివాసం ఉంటున్నారు. వీరి సంపద 180 బిలియన్ డాలర్లు. చెన్నై నగరంలో 6,600 మంది మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లు ఉండగా, వీరి సంపద 150 బిలియన్ డాలర్లు. విశాఖపట్నం, సూరత్, అహ్మదాబాద్, గోవా, చండీగఢ్, జైపూర్, వదోదరా సైతం సంపన్న నగరాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ‘‘వచ్చే పదేళ్లలో ఆర్థిక సేవలు, ఐటీ, రియల్ ఎస్టేట్, ఆరోగ్యం, మీడియా రంగాల్లో బలమైన వృద్ధి కారణంగా దేశానికి ప్రయోజనం కలుగుతుంది. హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాలు సంపద వృద్ధి పరంగా ముందుంటాయి’’ అని నివేదిక స్పష్టం చేసింది. మిలియన్ డాలర్లు (రూ.6.7 కోట్లు సుమారు) ఉన్నవారిని మిలియనీర్‌గా, బిలియన్ డాలర్లు (రూ.6,700 కోట్లు సుమారు) ఉన్న వారిని బిలియనీర్‌గా నివేదిక పరిగణనలోకి తీసుకుంది. సంపన్న ప్రాంతాలు...: ముంబైలో బాంద్రా, జుహు, గొరెగావ్, పారెల్, వోర్లి, పామ్‌బీచ్ రోడ్ ఖరీదైన ప్రాంతాలని ఈ నివేదిక తెలిపింది. ఢిల్లీలో వెస్టెండ్ గ్రీన్స్, దేరా మండి, గ్రేటర్ కైలాష్, లూటెన్స్ ప్రాంతాలు, చెన్నైలో బోట్ క్లబ్ రోడ్, పోయెస్ గార్డెన్ సంపన్నుల కేంద్రాలుగా ఉన్నాయి. -
సగం సంపద మిలియనీర్ల చేతుల్లోనే
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో రష్యా తర్వాత అసమానత్వం ఎక్కువగా ఉన్న దేశం భారతేనట. 54 శాతం సంపద మిలియనీర్ల (10 లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ ఆస్తిపరులు) దగ్గరే ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. 5,600 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచంలోని మొదటి పది సంపన్న దేశాల్లో భారత్ చోటు దక్కించుకుంది. అయినా, సగటు భారతీయుడు మాత్రం పేదవాడేనని ఈ అధ్యయనం నిర్వహించిన ‘న్యూ వరల్డ్ వెల్త్’ అనే పరిశోధన సంస్థ పేర్కొంది. ఇక ప్రపంచంలో అత్యధికంగా అసమానతలు కలిగిన దేశం రష్యా అని ఈ నివేదిక తెలిపింది. ఇక్కడ 62 శాతం సంపద మిలియనీర్ల చేతుల్లోనే ఉందట. దేశ సంపదలో 50 శాతం మొత్తం మిలియనీర్ల చేతుల్లోనే ఉంటే ఇక అక్కడ అర్థవంతమైన మధ్య తరగతికి అవకాశాలు తక్కువేనని నివేదిక పేర్కొంది. -
సంపన్నుల భారత్
* దేశంలోని ధనికుల సంఖ్య 2.36 లక్షలు * ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నాలుగవ స్థానం * అగ్రస్థానాల్లో జపాన్, చైనా, అస్ట్రేలియా * 2025 నాటికి 4.83 లక్షలకు దేశీ సంపన్నుల సంఖ్య! న్యూఢిల్లీ: భారత్‌లో సంపన్నులు పెరుగుతున్నారు. సంపన్నుల సంఖ్య ప్రామాణికంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్‌లో సంపన్నులు 2.36 లక్షల మంది ఉన్నారు. ఇక 12.60 లక్షల మంది సంపన్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా (6.54 లక్షల మంది), ఆస్ట్రేలియా (2.90 లక్షల మంది) కొనసాగుతున్నాయి. ‘న్యూ వరల్డ్ వెల్త్’కు సంబంధించిన ‘ఆసియా పసిఫిక్-2016’ వెల్త్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 1 మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ నికర ఆస్తులను కలిగిన వ్యక్తులను సంపన్నులుగా పరిగణలోకి తీసుకుంటారు. కాగా టాప్ 10లో సింగపూర్ (2.24 లక్షల మంది, ఐదవ స్థానం), హాంకాంగ్ (2.15 లక్షల మంది, ఆరవ స్థానం), దక్షిణ కొరియా (1.25 లక్షల మంది, 7వ స్థానం), తైవాన్ (98,200 మంది, 8వ స్థానం), న్యూజిలాండ్ (89,000 మంది, 9వ స్థానం), ఇండోనేసియా (48,500, 10వ స్థానం) ఉన్నాయి. ఇక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 35 లక్షల మంది సంపన్నులు ఉన్నారు. వీరందరి సంపద విలువ 17.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 15 ఏళ్లలో 115 శాతం వృద్ధి ఆసియా పసిఫిక్ ప్రాంతలో సంపన్నుల సంఖ్య గత 15 ఏళ్లలో 115 శాతం వృద్ధి చెందింది. ఈ వృద్ధి అంతర్జాతీయంగా 82 శాతంగా ఉంది. ఇక వచ్చే పదేళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతపు సంపన్నుల సంఖ్య 50 శాతం వృద్ధితో 52 లక్షలకు చేరుతుందని అంచనా. ఇదే సమయంలో భారత్‌లో సంపన్నుల సంఖ్య 105 శాతం వృద్ధితో 2.36 లక్షల నుంచి 4.83 లక్షలకు చేరుతుందని పేర్కొంది. తలసరి ఆదాయంలో దిగువన తలసరి ఆదాయం ఆధారంగా చూస్తే.. భారత్‌లోని ఒక వ్యక్తి సగటు సంపద 3,500 డాలర్లుగా ఉంది. ఈ సంపద ఆస్ట్రేలియాలో అత్యధికంగా 2,04,000 డాలర్లుగా, పాకిస్తాన్లో అత్యల్పంగా 1,600 డాలర్లుగా ఉంది. భారత్‌లోని వ్యక్తిగత మొత్తం సంపద 4,365 బిలియన్ డాలర్లుగా ఉంటే, చైనాలోని వ్యక్తిగత మొత్తం సంపద అత్యధికంగా 17,254 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలోని అందరి ప్రజల వద్ద ఉన్న సంపదను మొత్తం వ్యక్తుల సంపదగా పరిగణిస్తాం. -
మాతృదేశం వీడి వెళుతున్న మిలియనర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మాతృదేశాన్ని విడిచి పొరుగుదేశాలకు వెళ్లే ధనిక వలసదారుల స్థానంలో భారత్ రెండో స్థానంలో ఉంది. గడిచిన పద్నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు 61 వేలమంది భారత మిలియనర్లు విదేశాలపై మోజుతో మాతృదేశాన్ని విడిచి వెళ్లి ఏదో ఒకరకంగా అక్కడే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నరంట. న్యూ వరల్డ్ వెల్త్, లియో గ్లోబల్ అనే రెండు సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆ వివరాలను ప్రచురించాయి. దాని ప్రకారం మిలియనీర్లుగా మారిన భారతీయులంతా వెంటనే భారత దేశంలో విధిస్తున్న పన్నులు, రక్షణ, పిల్లల చదువు అనే సాకులతో విదేశాలకు వెళ్లిపోతున్నారని, ఇప్పటికే 61 వేలమంది మిలియనీర్లను భారత్ కోల్పోయిందని సర్వే చెప్పింది. కాగా, 91 వేలమంది మిలియనర్లు విదేశాలకు తరలిపోవడం ద్వారా చైనా తొలిస్థానంలో నిలిచింది. భారతీయులంతా ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాకు తరలి వెళుతుండగా.. చైనా వాళ్లు మాత్రం అమెరికా, హాంగ్ కాంగ్, సింగపూర్, బ్రిటన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారంట. కాగా, ప్రపంచ దేశాల నుంచి అత్యధికంగా బ్రిటన్‌కే 1.25 లక్షలమంది వెళ్లినట్లు సర్వే వెళ్లడించింది.