ఆర్డరు ఇచ్చిన మర్నాడే డెలివరీ..
- హైదరాబాద్‌లో సేవలు
- ప్రారంభించిన ఆస్క్‌మీబజార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఆస్క్‌మీబజార్.. నెక్స్ట్ డే డెలివరీ (ఎన్డీడీ) విధానాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. కస్టమర్లు ఆన్లైన్లో ఆర్డరు ఇచ్చిన తర్వాతి రోజు లేదా 24 గంటల్లో డెలివరీ ఇవ్వడం ఈ సేవల ప్రత్యేకత. వెబ్సైట్లో హైదరాబాద్ పేజీలో ఎలక్ట్రానిక్స్, కిచెన్ అప్లయాన్సెస్, బేబీకేర్ తదితర 13 విభాగాల్లో 5,000 పైచిలుకు ఉత్పత్తులను పొందుపరిచారు. ఎన్డీడీ కింద ఇచ్చే డెలివరీకి అదనంగా ఎటువంటి చార్జీ చేయరు. ఈ విధానాన్ని ప్రస్తుతం 22 నగరాల్లో కంపెనీ అమలు చేస్తోంది. అక్టోబరు చివరికల్లా 50 నగరాలకు విస్తరిస్తామని కంపెనీ ఎన్డీడీ హెడ్ మరీచి మాథుర్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లోనూ అడుగు పెడతామని చెప్పారు. బ్రాండెడ్ ఉత్పత్తులను తక్కువ ధరలో విక్రయించడం వెబ్సైట్ ప్రత్యేకత అని వివరించారు.
త్వరలో నిత్యావసరాల విక్రయాలు..
కూరగాయలు, పప్పుదినుసుల వంటి నిత్యావసరాల ఆన్లైన్ విక్రయాలను కంపెనీ ప్రస్తుతం దేశ రాజధాని ప్రాంతంలో పైలట్ కింద చేపట్టింది. 3-6 నెలల్లో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ సేవలు ప్రారంభం అవుతాయని మాథుర్ వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యాప్‌లకు భిన్నంగా ఈ సేవలను తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, ఆస్క్‌మీబజార్ ఒక నగరంలోని విక్రేతలు, వినియోగదారులను అనుసంధానిస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ, ఈఎంఐ, కార్డు ద్వారా చెల్లింపుల సౌకర్యం ఉంది.