యాదగిరిగుట్ట ఈవో కృష్ణవేణి బదిలీ
సాక్షి, హైదరాబాద్: తిరుమల తరహాలో యాదగిరిగుట్ట క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్న తరుణంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఎం.ఎం.డి.కృష్ణవేణిని మార్చి మహబూబ్నగర్ జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరక్టర్గా పనిచేస్తున్న రెవెన్యూ విభాగం డిప్యూటీ కలెక్టర్ ఎన్.గీతను ఆ స్థానంలో నియమించింది.
ఈ మేరకు గురువారం ఉత్తర్వు జారీ చేసింది. కృష్ణవేణి యాదగిరి గుట్ట దేవాలయ ఈవోగా ఉంటూ జాయింట్ కమిషనర్ హోదాలో దేవాదాయశాఖ విజిలెన్స్ అధికారిగా కమిషనరేట్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమెను పూర్తిస్థాయిలో విజిలెన్స్ అధికారిగా నియమించింది.