Nikesh Arora
-
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ, భారత సంతతికి చెందిన నికేశ్ అరోరా 2023లో అమెరికాలో అత్యధిక వేతనం పొందిన సీఈవోగా రెండో స్థానంలో నిలిచారు.బ్రాడ్‌కామ్ సీఈవో హాక్ టాన్ 162 మిలియన్ డాలర్ల వేతనంతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న నికేశ్ అరోరా వేతనం 151.43 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,260 కోట్లు). వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. అత్యధిక వేతనం పొందిన టాప్ 500 సీఈవోలలో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.అడోబ్‌కు చెందిన శంతను నారాయణ్ అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోగా రెండవ స్థానంలో ఉన్నారు. మొత్తం మీద 11వ ర్యాంక్‌ను పొందారు. నారాయణ్ వేతనం 44.93 మిలియన్ డాలర్లు. ఇక మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 24.40 మిలియన్ డాలర్ల వేతనం పొందగా ఆల్ఫాబెట్ సీఈవో భారత్‌లో జన్మించిన సుందర్ పిచాయ్ 8.80 మిలియన్ డాలర్లు వార్షిక వేతనం అందుకున్నారు.ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నికేశ్ అరోరా మొట్టమొదటిసారిగా గూగుల్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు నాయకత్వం వహించారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్వర్క్స్కు 2018 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వేతనం ముఖ్యంగా షేర్లు, ఈక్విటీ అవార్డులతో కూడి ఉంటుంది. -
అప్పట్లో గూగుల్‌లో అత్యధిక జీతం.. ఇప్పుడు ఏకంగా బిలియనీర్
నేటి రోజుల్లో బిలియనీర్ అవడం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు.. పాలో ఆల్టో నెటవర్క్స్ సీఈవో నికేష్ అరోరా (Nikesh Arora)నే అందుకు ఉదాహరణ. ఒకప్పుడు గూగుల్‌లో అత్యధిక జీతం అందుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా బిలియనీర్ అయ్యారు. గూగుల్‌లో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పనిచేసిన నికేష్ అరోరా అత్యధిక వేతనం అందుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఆయన్ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ చెల్లించి నియమించుకుంది. ప్రస్తుతం పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో చేరిన ఆయన బిలియనీర్ల జాబితాలోకి అడుగుపెట్టాడు. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ పరిశ్రమ బూమ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. నికేష్ అరోరా నెట్‌వర్త్ ఇప్పుడు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12 వేల కోట్లు)గా ఉంది. అరుదైన టెక్ సీఈవో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. వ్యవస్థాపకుడు కాకుండా బిలియనీర్ అయిన అరుదైన టెక్ సీఈవోగా నికేష్ అరోరా నిలిచారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ 2018లో నికేష్ అరోరాను నియమించుకున్నప్పుడు 125 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్లను ఆయనకు అందించింది. హై-ప్రొఫైల్ హ్యాకింగ్లు ఎక్కువవుతన్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఆవశ్యకత పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర నాలుగు రెట్లు పెరిగింది. దీంతో అరోరా వాటా 830 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకంతకూ పెరిగిన సంపద ఈ స్టాక్‌లు, వేతనం, సంస్థలో చేరినప్పుడు లభించిన 3.4 మిలియన్ డాలర్లు ఇలా అన్ని కలుపుకొని నికేష్ అరోరా నెట్‌వర్త్ ఇప్పుడు సుమారు 1.5 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా అరోరా 2023లో దాదాపు 300 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో అరోరా గతేడాది అందుకున్న పరిహారంలో అత్యధికంగా 7.5 లక్షల స్టాక్‌లు ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతం 220 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
సాఫ్ట్‌బ్యాంక్ నూతన అధ్యక్షుడు ఈయనే!
టోక్యో: సాఫ్ట్ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా నియామకాన్ని చేపట్టినట్టు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ (ఎస్బీజీ) ప్రకటించింది. గ్రూప్ దేశీయ టెలీకమ్యూనికేషన్స్ హెడ్ గా పనిచేస్తున్న కెన్ మియోషిని నియమించినట్టు తెలిపింది. కంపెనీ సీఓఓ మరియు అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్టు బుధవారం సాఫ్ట్ బ్యాంక్ ప్రకటించింది. సాఫ్ట్‌బ్యాంక్ కీలక పదవుల నుంచి నికేశ్ అరోరా వైదొలగడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీవోవో, రిప్రజింటేటివ్ డై రెక్టర్ పదవులకు నికేష్ అరోరా రాజీనామా చేశారు. ఇది జూన్ 22 (నేటి) నుంచి అమల్లోకి వచ్చింది. అరోరా రాజీనామానను అంగీకరించిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ నూతన అధ్యక్షుడిని ఎన్నికను ప్రకటించింది. కాగా 1981లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ విడిభాగాల రంగంలోకి అడుగుపెట్టిన సాఫ్ట్‌బ్యాంక్ అనతికాలంలోనే జపాన్‌లో అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్, ఇన్వెస్ట్మెంట్, కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. అటు గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల వేతన ప్యాకేజ్ తో ప్రపంచంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా ఆవిర్భవించిన అరోరా రాజీనామా పలువురిని ఆశ్యర్యపరిచింది. భారీ వేతనం, భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్లు వంటి తదితర అంశాల్లో అరోరాపై బ్యాంక్ ఇన్వెస్టర్లు విమర్శలు నేపథ్యంలో సాఫ్ట్‌బ్యాంక్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సోమవారం అరోరాకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా, ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన తప్పుకున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సాఫ్ట్ బ్యాంకు నుంచి అరోరా ఔట్
ఇక అడ్వైజర్‌గా ఏడాదిపాటు సేవలు న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్ కీలక పదవుల నుంచి నికేశ్ అరోరా వైదొలిగారు. ఈయన సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీవోవో, రిప్రజింటేటివ్ ైడె రెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. ఇది జూన్ 22 (నేటి) నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈయన సాఫ్ట్‌బ్యాంక్ అడ్వైజర్‌గా కొత్తగా ఏడాదిపాటు సేవలు అందించనున్నారు. అరోరా జూలై 1 నుంచి ఈ బాధ్యతలను స్వీకరించే అవకాశముంది. ఈ విషయాలను సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ (ఎస్బీజీ) ధ్రువీకరించింది. ఇక సాఫ్ట్‌బ్యాంక్‌లో అరోరా ప్రస్థానం 2014లో ప్రారంభమైంది. గతేడాది మే నెలలో ఈయన సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్ , సీవోవోగా బాధ్యతలు చేపట్టారు. సాఫ్ట్బ్యాంక్లోకి రాక ముందు ఈయన గూగుల్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. కాగా అరోరా గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల వేతన ప్యాకేజ్‌ను స్వీకరించారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా ఆవిర్భవించారు. ఈయన ఆధ్వర్యంలోనే సాఫ్ట్‌బ్యాంక్ భారత్‌లోని స్నాప్‌డీల్, ఓలా క్యాబ్స్, రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్, హోటల్ బుకింగ్ యాప్ ఓయో రూమ్స్, గ్రోఫర్స్ వంటి స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్లు 1 బిలియన్ మార్క్‌ను అధిగమించాయి. భారీ వేతనం, భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్లు వంటి తదితర అంశాల్లో అరోరాపై బ్యాంక్ ఇన్వెస్టర్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై సాఫ్ట్‌బ్యాంక్ ఇటీవల ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సోమవారం అరోరాకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా, ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన తప్పుకోవడం గమనార్హం. -
సాఫ్ట్‌బ్యాంక్ అధినేతతో కేటీఆర్ భేటీ
సాప్ట్ బ్యాంకు అధినేత నికేష్ అరోరాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు భేటీ అయ్యారు. శాన్ ప్రాన్సిస్కోలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు స్థాపన, పెట్టుబడుల అకర్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సిఓఓ అయిన నిఖేష్ అరోరాతో మంత్రి సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశవేట్టిన పారిశ్రామిక విధానం ఉద్దేశాలను, కీలకాంశాలను వివరించారు. 15 రోజుల్లో అనుమతులు, సెల్ఫ్ సర్టిఫికేషన్ వంటి అంశాలను వివరించారు. పారిశ్రామిక అనుమతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని అభినందించిన అరోరా, ప్రభుత్వం ఈ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు కావాల్సిన పలు సలహాలను ఇచ్చారు. టెలికమ్యూనికేషన్లు మెదలు మీడియా, పైనాన్స్ వంటి రంగాల దాక పెట్టుబడులు పెట్టే జపాన్ బహుళజాతి సంస్థ సాప్ట్ బ్యాంకు. బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ వంటి రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను సివోవో నిఖేష్ అరోరాకి మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను వివరించారు. టి-హబ్ గురించి వివరించి, ఇప్పటిదాకా దానికి వస్తున్న స్పందన, ఇన్నోవేషన్ రంగంలో స్టార్టప్ లకి అందించాల్సిన సాయంపైన మంత్రి చర్చించారు. అరోరాతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని మంత్రి కేటీ రామారావు తెలిపారు. సాప్ట్ బ్యాంకు పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించినట్టు మంత్రి తెలిపారు. గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్నట్టు, ఇండియానా పోలీస్, మిన్నియా పోలిస్ నగరాల్లో జరిగిన సమావేశంలో అమెరికన్ పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రాల్లోనూ తెలంగాణ పారిశ్రామిక విధానంలోని పలు అంశాలను ప్రవేశపెట్టాలన్న అభిలాషను వ్యక్తం చేసినట్టు మంత్రి సమావేశంలో నికేష్ అరోరాతో తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు. -
సాఫ్ట్ బ్యాంక్ సీవోవో జీతం ఎంతో తెలుసా?
టోక్యో: ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయుల హవా కొనసాగుతోంది. జపాన్‌కు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ అధ్యక్షుడు, సీవోవో నికేష్ అరోరా (48) ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 5వందలకోట్ల భారీ వేతనంతో మరోసారి తన సత్తాను చాటుకున్నారు. మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 73 మిలియన్ డాలర్ల పే ప్యాకేజీ తో వరుసగా రెండవసంవత్సరం కూడా వరల్డ్ టాప్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్ గా అవతరించారు. ఇప్పటికే జపాన్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న అరోరా ఈ స్పెషల్ ప్యాకేజ్ తో అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న టెక్ దిగ్జజాలు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ , వాల్ట్ డిస్నీ యొక్క బాబ్ ఇగెర్ సరసన చేరారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి సాఫ్ట్వేర్ సంస్థలు అధిపతులుగా భారతీయులు ఉన్నత స్థానాల్లో అత్యధిక వేతనాలు పొందుతూ రికార్డు సృష్టించారు. కాగా 2014 ఆర్థిక సంవత్సరానికి 13.5 కోట్ల డాలర్ల వేతనాన్నిఅందుకున్నఅరోరా గతంలో గూగుల్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. నికేష్ అరోరా ఆధ్వర్యంలోనే సాఫ్ట్ బ్యాంక్ భారత్ లో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
సాఫ్ట్‌బ్యాంక్‌లో భారతీయుడి భారీ పెట్టుబడులు..
- రూ.3,148 కోట్లు ఇన్వెస్ట్ చేసిన నికేశ్ అరోరా - సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీఓఓగా విధులు టోక్యో: నికేశ్ అరోరా...గూగుల్ సంస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసి గత ఏడాది బయటకు వచ్చిన ఈయన 48 కోట్ల డాలర్ల(రూ.3,148 కోట్ల) విలువైన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేశారు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌కు ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భారత్‌లో జన్మించిన అరోరా కొనుగోలును డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్కు బుధవారం వెల్లడించింది. ఐఐటీ-వారణాసిలో పట్టభద్రుడైన అరోరా అమెరికా యూనివర్శిటీలో ఎంబీఏ చదివారు. పదేళ్లపాటు గూగుల్‌లో పనిచేసిన ఆయన గత ఏడాది జూలైలో సాఫ్ట్‌బ్యాంక్‌లో చేరారు. అరోరాకు సాఫ్ట్‌బ్యాంక్ 13.5 కోట్ల డాలర్ల వార్షిక వేతనాన్ని ఇస్తోందని సమచారం. దీంతో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న మూడో ఉన్నతస్థాయి వ్యక్తిగా ఆయన నిలిచారు. నికేశ్ అరోరా గొప్ప బిజినెస్ లీడర్ అని, సహృదయుడని సాఫ్ట్‌బ్యాంక్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోచి సన్ వ్యాఖ్యానించారు. కాగా, మసయోచి స్థానంలో నికేశ్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.