సాఫ్ట్‌బ్యాంక్ అధినేతతో కేటీఆర్ భేటీ
సాప్ట్ బ్యాంకు అధినేత నికేష్ అరోరాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు భేటీ అయ్యారు. శాన్ ప్రాన్సిస్కోలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు స్థాపన, పెట్టుబడుల అకర్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సిఓఓ అయిన నిఖేష్ అరోరాతో మంత్రి సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశవేట్టిన పారిశ్రామిక విధానం ఉద్దేశాలను, కీలకాంశాలను వివరించారు. 15 రోజుల్లో అనుమతులు, సెల్ఫ్ సర్టిఫికేషన్ వంటి అంశాలను వివరించారు. పారిశ్రామిక అనుమతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని అభినందించిన అరోరా, ప్రభుత్వం ఈ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు కావాల్సిన పలు సలహాలను ఇచ్చారు. టెలికమ్యూనికేషన్లు మెదలు మీడియా, పైనాన్స్ వంటి రంగాల దాక పెట్టుబడులు పెట్టే జపాన్ బహుళజాతి సంస్థ సాప్ట్ బ్యాంకు. బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ వంటి రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను సివోవో నిఖేష్ అరోరాకి మంత్రి కేటీఆర్ వివరించారు.
ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను వివరించారు. టి-హబ్ గురించి వివరించి, ఇప్పటిదాకా దానికి వస్తున్న స్పందన, ఇన్నోవేషన్ రంగంలో స్టార్టప్ లకి అందించాల్సిన సాయంపైన మంత్రి చర్చించారు. అరోరాతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని మంత్రి కేటీ రామారావు తెలిపారు. సాప్ట్ బ్యాంకు పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించినట్టు మంత్రి తెలిపారు. గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్నట్టు, ఇండియానా పోలీస్, మిన్నియా పోలిస్ నగరాల్లో జరిగిన సమావేశంలో అమెరికన్ పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రాల్లోనూ తెలంగాణ పారిశ్రామిక విధానంలోని పలు అంశాలను ప్రవేశపెట్టాలన్న అభిలాషను వ్యక్తం చేసినట్టు మంత్రి సమావేశంలో నికేష్ అరోరాతో తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.