నేటి రోజుల్లో బిలియనీర్ అవడం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు.. పాలో ఆల్టో నెటవర్క్స్ సీఈవో నికేష్ అరోరా (Nikesh Arora)నే అందుకు ఉదాహరణ. ఒకప్పుడు గూగుల్‌లో అత్యధిక జీతం అందుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా బిలియనీర్ అయ్యారు.
గూగుల్‌లో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పనిచేసిన నికేష్ అరోరా అత్యధిక వేతనం అందుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఆయన్ను
ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ చెల్లించి నియమించుకుంది. ప్రస్తుతం పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో చేరిన ఆయన బిలియనీర్ల జాబితాలోకి అడుగుపెట్టాడు. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ పరిశ్రమ బూమ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. నికేష్ అరోరా నెట్‌వర్త్ ఇప్పుడు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12 వేల కోట్లు)గా ఉంది.
అరుదైన టెక్ సీఈవో
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. వ్యవస్థాపకుడు కాకుండా బిలియనీర్ అయిన అరుదైన టెక్ సీఈవోగా నికేష్ అరోరా నిలిచారు. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ 2018లో నికేష్ అరోరాను నియమించుకున్నప్పుడు 125 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌లను ఆయనకు అందించింది. హై-ప్రొఫైల్ హ్యాకింగ్‌లు ఎక్కువవుతన్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఆవశ్యకత పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర నాలుగు రెట్లు పెరిగింది. దీంతో అరోరా వాటా 830 మిలియన్ డాలర్లకు చేరుకుంది.
అంతకంతకూ పెరిగిన సంపద
ఈ స్టాక్‌లు, వేతనం, సంస్థలో చేరినప్పుడు లభించిన 3.4 మిలియన్ డాలర్లు ఇలా అన్ని కలుపుకొని నికేష్ అరోరా నెట్‌వర్త్ ఇప్పుడు సుమారు 1.5 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా అరోరా 2023లో దాదాపు 300 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో అరోరా గతేడాది అందుకున్న పరిహారంలో అత్యధికంగా 7.5 లక్షల స్టాక్‌లు ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతం 220 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment