Nil Battey Sannata
-
మోడర్న్ మదర్‌స్టార్స్
తెల్ల చీర.. ఓ కంట్లో కుండల కొద్దీ కన్నీళ్లు.. మొహంలో దయనీయత... కంపిస్తున్న జీవితం..టాలీవుడ్, బాలీవుడ్ అమ్మకు ప్రతిరూపం పదేళ్ల కిందటిదాకా! ఎప్పుడూ ఎవరో ఒకరు ఆదుకోవాలని చూసే సెల్ఫ్ పిటీతో కుంగిపోతూ ఉంటుంది ఆ అమ్మ. ఇప్పుడు పరిస్థితులు మారాయి కనీసం బాలీవుడ్లో. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో ఆధునిక అమ్మ తెర మీద ధైర్యంగా అడుగులేస్తోంది. అంతకుముందు అమ్మంటే సినిమా కథ ఫార్ములాలో ఓ పాత్ర మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదు.. కథను నడిపించే ప్రధాన నాయిక. ఉదాహరణ.. నిల్ బత్తే సన్నాట! నిజానికి ఈ మార్పు ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా నుంచి మొదలైందని చెప్పొచ్చు. అందులో కథానాయిక కాజోల్‌కి తల్లిగా నటించిన ఫరిదా జలాల్ కొంచెం రివల్యూషనరీ మదర్‌గా కనిపించారు. ఆ తర్వాత నుంచి వచ్చిన చాలా సినిమాల్లో అమ్మ రూపురేఖలు.. వ్యక్తిత్వమూ మారిపోయాయి కొత్తగా... తల్లుల్లో ఉత్సాహాన్ని పెంచేలా! ఆ సినిమాలు కొన్ని.. పైన నిల్ బత్తే సన్నాట ఊసెత్తాం కాబట్టి దాన్నే మొదట ఉదహరించుకుందాం. అందులో తల్లే ప్రధాన పాత్ర. స్వర భాస్కర్ పోషించింది. ఆమె ఓ పనిమనిషి. కూతురిని పెద్ద చదువులు చదివించాలని కలలు కంటూంటుంది. కానీ పనిమనిషి కూతురు ఇంకో పనిమనిషి కాక ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందా అనే నిస్పృహతో బతుకుతుంది. అంతే నిస్సత్తువగా బడికి వెళ్తూంటుంది. బిడ్డ ఆలోచనలు మార్చడానికి ఆ తల్లీ స్కూల్లో చేరుతుంది. కూతురితో కలిసి పదవ తరగతి పరీక్ష రాసి ఆమెలో పోటీని రగిలిస్తుంది. జీవితం పట్ల ఆశను రేపుతుంది. ఉత్తేజాన్ని నింపుతుంది. అచ్చంగా ఓ అమ్మను హీరోయిన్గా చూపించిన ఈ సినిమా.. తీరు మారిన బాలీవుడ్ తలపుకు మచ్చు తునక. జానే తూ.. యా జానే నా.. ఫ్రెండ్లీ మదర్ కాన్సెప్ట్‌ను ప్రమోట్ చేసిన సినిమా జానే తూ.. యా జానే నా! ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్ సెల్యూలాయిడ్ ఫస్ట్ ఎంట్రీ ఈ మూవీ. అందులో అతనికి అమ్మగా రత్నా పాటక్ షా నటించింది. సర్కాస్టిక్ మదర్. విడో. భర్త పట్ల మిస్సింగ్ ఫీలింగ్‌నూ ఆ వ్యంగ్యంతోనే భర్తీ చేసుకుంటుంది. కొడుకుకు ఆప్తమిత్రురాలిలా మసలుకుంటుంది. బోలెడు ధైర్యాన్నిస్తుంది. అలా ‘జానే తూ యా జానే నా’ లో అమ్మను డేరింగ్ అండ్ డైనమిక్‌గా చిత్రీకరించారు. ఈ మధ్య వచ్చిన మంచి సినిమా కపూర్ అండ్ సన్స్‌లో కూడా రత్నా పాటక్ షా ఇన్స్పైరింగ్ మదర్‌లా నటించారు. భర్త వివాహేతర సంబంధం... కొడుకు గే అని తేలడం.. ఇలాంటి షాకింగ్ సందర్భాల్లో గట్టిగా అరుస్తూ కూలిపోకుండా.. సంయమనంగా డీల్ చేయగల స్త్రీగా అద్భుతంగా చిత్రీకరించిన పాత్ర అది. రత్నా పాటక్ షా ఒదిగిపోయి మహిళకు మరో నిర్వచనంగా నిలిచారు. ఇంగ్లిష్ వింగ్లిష్.. ‘‘నాకు కావాల్సింది ప్రేమ కాదు.. గౌరవం’’ అంటుంది ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలోని అమ్మ ‘శశి’. నిజమే.. వంటింటికే పరిమితమైన ఇల్లాలిని.. వంట తప్ప ఏమీ రాదని హేళన చేస్తే భర్త, ఇంగ్లిష్ రాకపోతే ఆ అమ్మకు ఏమీ తెలియదని.. ఒట్ట జడ్డని.. టీచర్, పేరెంట్ మీటింగ్‌కు ఆమెను అవాయిడ్ చేయాలని చూసే కూతురుంటే .. ఏ తల్లైనా ఆశ పడేది కాసింత గౌరవం పొందాలనే కదా! ఇంగ్లిష్ నేర్చుకొని అనర్గళంగా ఆ భాషలో స్పీచ్ కూడా ఇచ్చి ఆ గౌరవాన్ని దక్కించుకుంటుంది శశి. అమ్మ ఆత్మగౌరవం అనే ఓ సున్నితమైన అంశాన్నే ప్రధానం చేసుకొని మధ్య వయసు మహిళనే ముఖ్య భూమికగా పెట్టుకొని తీసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ఎంత సూపర్ హిట్టో తెలియంది కాదు! అంటే అమ్మకు ప్రేమతో పాటు గౌరవాన్నీ ఇవ్వాలని మనమందరం కోరుకుంటున్నట్టేగా. మరెందుకు జాలి పాత్రలు? ఈ సినిమా శ్రీదేవికి రీ ఎంట్రీ. శశిగా ఆమె సింప్లీ సూపర్బ్. పా.. ప్రిజేరియా ఉన్న కుర్రాడి సింగిల్ పేరెంట్ స్ట్రగులే ‘పా’. ఆ సింగిల్ పేరెంటే విద్యా బాలన్. అసాధారణ జబ్బున్న పిల్లాడికి తల్లిగా ఏ మాత్రం నిరాశకు లోనవకుండా.. ఆ కొడుకుని సాధారణ పిల్లల్లాగే పెంచగలిగే ఆత్మబలం ఉన్న అమ్మ ఆమె. అసలా కథను ఎంచుకున్నందుకు బాల్కీకి, నటించి మెప్పించిన విద్యాబాలన్‌కు హ్యాట్సాఫ్. లిజన్ అమాయా.. భర్త మరణం భార్య కలలు, కలర్‌ఫుల్ లైఫ్‌కి ఫుల్స్టాప్ కానక్కర్లేదు. ఆయన జ్ఞాపకాలతో బతికే మొండితనమన్నా ఉండాలి.. లేదా కొత్త భాగస్వామిని ఎంచుకొని జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టే ధైర్యమన్నా కావాలి. రెండో కోవకు చెందినదే అమాయా తల్లి. తండ్రిని తప్ప ఇంకో వ్యక్తిని ఆ స్థానంలో ఊహిచంలేని కూతురికి ఇంకో భాగస్వామిని ఎంచుకున్నానని ఎలా చెప్పాలి? అని మథన పడుతుందే తప్ప బలహీనపడదు. తనకూ కొత్తగా జీవించే హక్కుందని బిడ్డకు చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇలాంటి సంఘర్షణను కన్నీళ్లు.. దిగులు భావాలతో కాకుండా స్థిరమైన ఆలోచనలు, అభిప్రాయాలతో అధిగమిస్తుంది. ఆ పాత్రలో దీప్తి నావల్ జీవించింది. ఇవి ట్రైలర్స్ మాత్రమే. గే కొడుకును యాక్సెప్ట్ చేసే అమ్మగా ‘దోస్తానా’లో కిరణ్ ఖేర్, ప్రత్యర్థి మూఠాను వణికించే తల్లిగా ‘రామ్‌లీలా’ లో సుప్రియా పాఠక్, సెరిబ్రల్ పాల్సీ ఉన్న కూతురిని సంబాళించే తల్లిగా ‘మార్గరిటా విత్ స్ట్రా’లో రేవతి, ‘మిత్ర్’లో శోభనా, పంజాబీ బ్యూటీషియన్ అండ్ చిల్ మదర్‌గా ‘విక్కీ డోనర్’లో డాలీ అహ్లువాలియా వీళ్లంతా ఆధునిక అమ్మ బలం చూపించారు.ఆమె గౌరవం పెంచారు. అనవసరమైన త్యాగాలు, ఔన్నత్యాలకు జీవితాన్ని అంకితం చేసుకునే బేలతనం లేదు వాళ్లకు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ.. పిల్లల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే అమ్మతనం వాళ్లది. సెల్యులాయిడ్ను మోడర్న్ యాంగిల్లో సెట్ చేస్తున్న మదర్ స్టార్స్‌కి వందనాలు! నిల్ బత్తే సన్నాటలో.. ‘పా’లో విద్యా, అభిషేక్ -
నిల్ బటే సన్నాటా
ఓడిపోవడం తప్పుకాదు. కాని ప్రయత్నించకుండా ఓటమిని అంగీకరించడం తప్పు. కలలు ఉండాలి.. సాకారం చేసుకోవడానికి సాహసమూ కావాలి.. అని చెప్పే సినిమా నిల్ బటే సన్నాటా! నిల్ ఇంగ్లిష్ పదం.. బటే ఉత్తరప్రదేశ్ హిందీ పదం. సన్నాటా.. హిందీ! బటే అంటే డివైడెడ్ బై, సన్నాటా అంటే నిశ్శబ్దం.. శూన్యం! సున్నాను దేనితో భాగించినా సున్నానే వస్తుంది. అదే సినిమా పేరు. అంటే నథింగ్ అని! ఈ సినిమా కూడా ఇక్కడే మొదలవుతుంది. ఆర్థికంగా ఏమీ లేనితనంతో.. లెక్కలు రానితనంతో.. భవిష్యత్ పట్ల ఆశలేని తనంతో! చందా.. కూతురి జీవితం పట్ల ఎన్నో కలలున్న తల్లి. సింగిల్ మదర్. ఓ పనిమనిషి. కూతురు అపేక్ష.. చాలా నిరాసక్తంగా, ఎలాంటి ఆశలు, కలలు లేక మొండిగా ఉంటుంది. టెన్త్‌క్లాస్ చదువుతుంటుంది. లెక్కల్లో వెనకబడుతుంది. చదవడం పట్ల పెద్దగా ఆసక్తి కూడా చూపదు. చందాకేమో తన బిడ్డ మంచి చదువులు చదివి గొప్ప ఉద్యోగం సంపాదించాలనే ఆశయం. అందుకోసం తనెంతైనా కష్టపడ్డానికి సిద్ధమవుతుంది. ఆ ఉత్సాహం బిడ్డలో నింపాలని తాపత్రయపడుతుంటుంది. మార్కులు తక్కువ వచ్చినప్పుడల్లా బాధపడి.. ‘‘బాగా చదువు, ట్యూషన్ కూడా పెట్టిస్తా’ అనడమే కాదు పెట్టిస్తుంది కూడా. అయినా చదువులో రాణించదు. ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావ్ అని తల్లి అడిగితే ‘‘పనిమనిషిగా సెటిల్ కావడానికి అంత చదువు అవసరం లేదు’’ అని సమాధానమిస్తుంది నిర్లక్ష్యంగా. ‘‘పనిమనిషి అవడమేంటి?’’ అన్న అమ్మ ప్రశ్నకు ‘‘మరి? డ్రైవర్ కొడుకు డ్రైవర్ అయినప్పుడు పనిమనిషి కూతురు పనిమనిషి కాక ఐఏఎస్ అవుతుందా?’’ అని వెటకారం చేస్తుంది తల్లిని అపేక్ష. కూతురి ప్రవర్తనతో బాధపడుతుంది చందా. ఆ పిల్ల పెడసరం మాటలకు తల్లడిల్లుతుంది. ఆమె ఆలోచనాధోరణిని మార్చాలనుకుంటుంది. కూతురు చదివే స్కూల్లో.. అపేక్ష తీరు గురించి ఒకసారి తన యజమానురాలి (రత్న పాఠక్ షా)తో చెప్తుంది చందా. ఆమెను దీదీ అని పిలుస్తూ తనకో పెద్దదిక్కుగా భావిస్తుంటుంది చందా. కూతురి తరహాతో తాను పడుతున్న బాధను పంచుకుంటుంది. వింటున్న రత్నాపాఠక్ తనదైన శైలిలో చాలా తెలివిగా చందాలో చదువుకునే ఆలోచనను రేకెత్తిస్తుంది. కూతురికి చదువు మీద ఉత్సాహం, భవిష్యత్ పట్ల ఆశ కలగాలంటే ఆమెకు పోటీగా నువ్వుండాలన్నట్టుగా చెప్తుంది. ఆలోచనల్లో పడ్తుంది చందా. తను చదువుకోవాలి.. పిల్లకు చదువు విలువ తెలియజెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. చేరాలని కూతురు చదివే స్కూల్‌కి వెళ్తుంది. చందా ఆలోచన విని విస్తుపోతాడు ప్రిన్సిపల్. అవును అంటూ నిశ్చయంగా తలూపుతుంది. జాయిన్ అయిపోతుంది... కూతురి క్లాస్‌లోనే. బిడ్డకు పోటీగా.. అపేక్షకు తల్లిగా కాకుండా ఓ స్టూడెంట్‌గానే అందరికీ పరిచయం అవుతుంది చందా. తరగతిలో తల్లీబిడ్డలు ఎవరికి ఎవరో అన్నట్టుగానే ఉంటారు. లెక్కల పట్ల చాలా శ్రద్ధ పెడ్తుంది. క్లాస్మేట్ అబ్బాయితో స్కూల్లోనే లెక్కలు చెప్పించుకుంటుంది. జీవితానికి, లెక్కలకు లంకె పెట్టి.. లాజిక్ చూపించి ఆ సబ్జెక్ట్‌ను ఈజీగా అర్థమయ్యేలా చేస్తాడు ఆ అబ్బాయి. ఆసక్తి పెరుగుతుంది చందాకు. ఉదయమే లేచి వంట చేసి, ఇళ్లల్లో పని చేసుకొని స్కూల్‌కి వెళ్తుంది. మళ్లీ సాయంకాలం ఇళ్లల్లో పని చేసుకొని ఇంటికెళ్లి చదువుకుంటుంది. తల్లి కష్టాన్ని చూసి ఈ వయసులో ఇవి అవసరమా అన్నట్టుగా నవ్వుకుంటుంది అపేక్ష. యూనిట్ టెస్ట్స్లో కూతురికన్నా తల్లికే ఎక్కువ మార్కులు వస్తాయి. ముఖ్యంగా మ్యాథ్స్‌లో. కూతురు ఫెయిలవుతుంది. చందాను చూసి బుద్ధి తెచ్చుకొమ్మని కోప్పడ్తాడు మాస్టర్. కూతురిని అలా తిట్టేసరికి తల్లి మనసు చివుక్కుమంటుంది. ఇంటికొచ్చాక బిడ్డను సముదాయిస్తుంటే అపేక్ష వినదు. క్లాస్‌లో ఆమె ప్రగతి కూతురికి మింగుడు పడదు. నెమ్మదిగా అపేక్షలోనూ పోటీతత్వం మేలుకొంటుంటుంది. తల్లికి లెక్కలు చెప్తున్న అబ్బాయితోనే తనూ లెక్కలు చెప్పించుకుంటుంది. తర్వాత జరిగిన పరీక్షలో అపేక్షకూ మంచి మార్కులు వస్తాయి. తల్లిని లెక్కచేయదు. నీకు చదువు అవసరమా అన్నట్టు ఇన్సల్ట్ చేస్తుంది. బాధపడ్డ చందా స్కూల్‌కి వెళ్లడం మానేస్తుంది. హోటల్లో, ఇళ్లల్లో పనిచేస్తూ డబ్బులు పోగేస్తుంటుంది. ఓసారి బిడ్డ మాటలకు చింత చెందుతూ రోడ్డు మీద అనాలోచితంగా కలెక్టర్ (సంజయ్ సూరి) కారుకు అడ్డం వస్తుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను తిడుతుంటే అతను కారు దిగి ‘‘ఆడవాళ్లతో మర్యాదగా మాట్లాడండి’’ అని కానిస్టేబుల్‌ను మందలిస్తాడు. ఆ ఐఏఎస్ అంటే గౌరవం పెరుగుతుంది చందాకు. ఒకసారి కలెక్టర్ బంగ్లాకు వెళ్లి అతనిని కలిసి తన గురించి, కూతురి పట్ల ఉన్న తన ఆశయం గురించీ చెప్తుంది. చదువుకు ఆకాశమే హద్దు. పనిమనిషి కూతురు పనిమనిషే కావాలని లేదు. ఐఏఎస్కూడా కావచ్చు అని చెప్తాడు. ఎలా అని అడుగుతుంది. ఆప్షన్స్ చెప్తాడు. ఆ లక్ష్యం ఆమె మనసులో నాటుకుంటుంది. అందరికీ తెలుస్తుంది... ఓసారి హోటల్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం కావడంతో తనతో పాటు పనిచేసే ఓ వ్యక్తి చందాను ఇంటి దగ్గర దింపుతాడు. అది చూసిన అపేక్ష అమ్మను అపార్థం చేసుకొని అనకూడని మాట అంటుంది. చెంప చెళ్లుమనిపిస్తుంది చందా. స్కూల్లో అందరికీ తెలిసిపోతుంది అపేక్ష వాళ్లమ్మే చందా అని. చందా పట్ల అపేక్ష విసురు ప్రవర్తన గురించి కూడా తెలుస్తుంది. క్లాస్మేట్స్ అపేక్షకు చీవాట్లు పెడ్తారు. అప్పుడర్థం అవుతుంది తల్లి విలువ కూతురికి. తెల్లవారి నుంచి స్కూల్‌కి రమ్మని అమ్మను బతిమాలుతుంది. వస్తుంది. టెన్త్ మెయిన్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఇద్దరూ కష్టపడి చదువుతారు. చందాకు కూతురి ఫలితాల మీదే ఆందోళన ఉంటుంది. ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయి తన మీద తల్లికి నమ్మకాన్ని పెంచుతుంది. అప్పుడు చెప్తుంది చందా కూతురితో.. ‘ప్రతి మనిషికి కల ఉండాలి. ఆ కల సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి... సాహసం ఉండాలి’’ అని. ఆ పాఠం ఆ పిల్ల జీవననేస్తం అవుతుంది. కట్‌చేస్తే.. చందా కూతురు అపేక్ష.. సివిల్స్ పాసయి ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంటర్వ్యూలో అడుగుతారు.. ‘ఐఏఎస్ ఎందుకు కావాలనుకుంటున్నావ్?’’ అని. ‘‘ఎందుకంటే నేను పనిమనిషిని కాదల్చుకోలేదు కాబట్టి’’ అని సమాధానమిస్తుంది. అపేక్ష ఐఏఎస్ అవుతుంది. సున్నాను దేనితో భాగించినా శూన్యమే. కాని సున్నాకు ఎడమవైపున ఎన్ని అంకెలు చేరిస్తే అంత విలువ పెరుగుతుంది. జీవితమూ అంతే. ఏమీ లేదనుకుని సాగితే ఏమీ కనపడదు. ఏదో కావాలని నడిస్తేనే ఏదో ఒకటి దొరుకుతుంది. ఈ పాఠమే ‘నిల్ బటే సన్నాటా’. ఇది ఓ ఒంటరి స్త్రీ జీవన పోరాటం. కూతుర్ని ఆశలపల్లకీలో ఎక్కించడానికి ఆమె పడిన ప్రయాస. కలల ప్రపంచంలో తిప్పడానికి ఆమె చేసిన ప్రయాణం. ప్రతి అమ్మాయికి చదువు ఎంత అవసరమో అని కూడా చూపిన సినిమా. తల్లిదండ్రుల పరిమితులు పిల్లలను ఆపకూడదు అని చాటే సినిమా! చిన్న లైన్‌ను అద్భుతంగా తెరకెక్కించారు సినిమా దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి. ఇది ఆమె మొదటి సినిమా. చందాగా స్వరా భాస్కర్ నటనకు మాటల్లేవ్. అపేక్షగా రియా శుక్లా సింప్లీసూపర్బ్. ‘నిల్ బటే సన్నాటా’ చూడాలనుకునేవాళ్లు యూట్యూబ్‌లో చూడొచ్చు. ఒకసారి కలెక్టర్ బంగ్లాకు వెళ్లి అతనిని కలిసి తన గురించి, కూతురి పట్ల ఉన్న తన ఆశయం గురించీ చెప్తుంది చందా. చదువుకు ఆకాశమే హద్దు. పనిమనిషి కూతురు పనిమనిషే కావాలని లేదు. ఐఏఎస్కూడా కావచ్చు అని చెప్తాడు. ఎలా అని అడుగుతుంది. ఆప్షన్స్ చెప్తాడు. ఆ లక్ష్యం ఆమె మనసులో నాటుకుంటుంది. నిల్ బటే సన్నాటా’లో ఓ దృశ్యం -
సీఎం మనసు గెలిచిన సినిమా...
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓ హిందీ మూవీకి భారీ ఆఫర్ ప్రకటించారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ మూవీ 'నిల్ బట్టి సన్నాట' పై తమ రాష్ట్రంలో పన్ను విధించడంలేదని ప్రకటించారు. ఈ మూవీని ఆగ్రాలో చిత్రీకరించారు. స్వర భాస్కర్, రత్న పథక్, పంకజ్ త్రిపాఠి ముఖ్యపాత్రధారులుగా ఈ మూవీలో కనిపించనున్నారు. ఈ మూవీ శుక్రవారం విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం అఖిలేష్ మూవీపై పన్నును సడలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వివరాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తనకు చాలా నచ్చిందని సీఎం అఖిలేష్ రాసుకొచ్చారు. తల్లీకూతుళ్లకు సంబంధించిన ఈ కథ అందరిని ఆకర్షిస్తుందని, మన కలల్ని సాకారం చేసుకోవడానకి వయసు అనేది అడ్డంకి కాదని పేర్కొన్నారు. చాలా అరుదుగా ఇలాంటి స్టోరీతో మూవీలు వస్తాయంటూ ఆయన మెచ్చుకున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, రాంజానా ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. Touched by the story of Nil Battey Sannata, which was filmed in Agra. We have made the film tax free in UP. pic.twitter.com/O658rXIuqx — Akhilesh Yadav (@yadavakhilesh) April 21, 2016