ఓడిపోవడం తప్పుకాదు. కాని ప్రయత్నించకుండా ఓటమిని అంగీకరించడం తప్పు. కలలు ఉండాలి.. సాకారం చేసుకోవడానికి సాహసమూ కావాలి.. అని చెప్పే సినిమా నిల్ బటే సన్నాటా! నిల్ ఇంగ్లిష్ పదం.. బటే ఉత్తరప్రదేశ్ హిందీ పదం. సన్నాటా.. హిందీ! బటే అంటే డివైడెడ్ బై, సన్నాటా అంటే నిశ్శబ్దం.. శూన్యం! సున్నాను దేనితో భాగించినా సున్నానే వస్తుంది. అదే సినిమా పేరు. అంటే నథింగ్ అని! ఈ సినిమా కూడా ఇక్కడే మొదలవుతుంది. ఆర్థికంగా ఏమీ లేనితనంతో.. లెక్కలు రానితనంతో.. భవిష్యత్ పట్ల ఆశలేని తనంతో!
చందా.. కూతురి జీవితం పట్ల ఎన్నో కలలున్న తల్లి. సింగిల్ మదర్. ఓ పనిమనిషి. కూతురు అపేక్ష.. చాలా నిరాసక్తంగా, ఎలాంటి ఆశలు, కలలు లేక మొండిగా ఉంటుంది. టెన్త్‌క్లాస్ చదువుతుంటుంది. లెక్కల్లో వెనకబడుతుంది. చదవడం పట్ల పెద్దగా ఆసక్తి కూడా చూపదు. చందాకేమో తన బిడ్డ మంచి చదువులు చదివి గొప్ప ఉద్యోగం సంపాదించాలనే ఆశయం. అందుకోసం తనెంతైనా కష్టపడ్డానికి సిద్ధమవుతుంది. ఆ ఉత్సాహం బిడ్డలో నింపాలని తాపత్రయపడుతుంటుంది. మార్కులు తక్కువ వచ్చినప్పుడల్లా బాధపడి..
‘‘బాగా చదువు, ట్యూషన్ కూడా పెట్టిస్తా’ అనడమే కాదు పెట్టిస్తుంది కూడా. అయినా చదువులో రాణించదు. ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావ్ అని తల్లి అడిగితే ‘‘పనిమనిషిగా సెటిల్ కావడానికి అంత చదువు అవసరం లేదు’’ అని సమాధానమిస్తుంది నిర్లక్ష్యంగా. ‘‘పనిమనిషి అవడమేంటి?’’ అన్న అమ్మ ప్రశ్నకు ‘‘మరి? డ్రైవర్ కొడుకు డ్రైవర్ అయినప్పుడు పనిమనిషి కూతురు పనిమనిషి కాక ఐఏఎస్ అవుతుందా?’’ అని వెటకారం చేస్తుంది తల్లిని అపేక్ష. కూతురి ప్రవర్తనతో బాధపడుతుంది చందా. ఆ పిల్ల పెడసరం మాటలకు తల్లడిల్లుతుంది. ఆమె ఆలోచనాధోరణిని మార్చాలనుకుంటుంది.
కూతురు చదివే స్కూల్లో..
అపేక్ష తీరు గురించి ఒకసారి తన యజమానురాలి (రత్న పాఠక్ షా)తో చెప్తుంది చందా. ఆమెను దీదీ అని పిలుస్తూ తనకో పెద్దదిక్కుగా భావిస్తుంటుంది చందా. కూతురి తరహాతో తాను పడుతున్న బాధను పంచుకుంటుంది. వింటున్న రత్నాపాఠక్ తనదైన శైలిలో చాలా తెలివిగా చందాలో చదువుకునే ఆలోచనను రేకెత్తిస్తుంది. కూతురికి చదువు మీద ఉత్సాహం, భవిష్యత్ పట్ల ఆశ కలగాలంటే ఆమెకు పోటీగా నువ్వుండాలన్నట్టుగా చెప్తుంది. ఆలోచనల్లో పడ్తుంది చందా. తను చదువుకోవాలి.. పిల్లకు చదువు విలువ తెలియజెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. చేరాలని కూతురు చదివే స్కూల్‌కి వెళ్తుంది. చందా ఆలోచన విని విస్తుపోతాడు ప్రిన్సిపల్. అవును అంటూ నిశ్చయంగా తలూపుతుంది. జాయిన్ అయిపోతుంది... కూతురి క్లాస్‌లోనే.
బిడ్డకు పోటీగా..
అపేక్షకు తల్లిగా కాకుండా ఓ స్టూడెంట్‌గానే అందరికీ పరిచయం అవుతుంది చందా. తరగతిలో తల్లీబిడ్డలు ఎవరికి ఎవరో అన్నట్టుగానే ఉంటారు. లెక్కల పట్ల చాలా శ్రద్ధ పెడ్తుంది. క్లాస్‌మేట్ అబ్బాయితో స్కూల్లోనే లెక్కలు చెప్పించుకుంటుంది. జీవితానికి, లెక్కలకు లంకె పెట్టి.. లాజిక్ చూపించి ఆ సబ్జెక్ట్‌ను ఈజీగా అర్థమయ్యేలా చేస్తాడు ఆ అబ్బాయి. ఆసక్తి పెరుగుతుంది చందాకు. ఉదయమే లేచి వంట చేసి, ఇళ్లల్లో పని చేసుకొని స్కూల్‌కి వెళ్తుంది. మళ్లీ సాయంకాలం ఇళ్లల్లో పని చేసుకొని ఇంటికెళ్లి చదువుకుంటుంది.
తల్లి కష్టాన్ని చూసి ఈ వయసులో ఇవి అవసరమా అన్నట్టుగా నవ్వుకుంటుంది అపేక్ష. యూనిట్ టెస్ట్స్‌లో కూతురికన్నా తల్లికే ఎక్కువ మార్కులు వస్తాయి. ముఖ్యంగా మ్యాథ్స్‌లో. కూతురు ఫెయిలవుతుంది. చందాను చూసి బుద్ధి తెచ్చుకొమ్మని కోప్పడ్తాడు మాస్టర్. కూతురిని అలా తిట్టేసరికి తల్లి మనసు చివుక్కుమంటుంది. ఇంటికొచ్చాక బిడ్డను సముదాయిస్తుంటే అపేక్ష వినదు. క్లాస్‌లో ఆమె ప్రగతి కూతురికి మింగుడు పడదు. నెమ్మదిగా అపేక్షలోనూ పోటీతత్వం మేలుకొంటుంటుంది. తల్లికి లెక్కలు చెప్తున్న అబ్బాయితోనే తనూ లెక్కలు చెప్పించుకుంటుంది. తర్వాత జరిగిన పరీక్షలో అపేక్షకూ మంచి మార్కులు వస్తాయి. తల్లిని లెక్కచేయదు. నీకు చదువు అవసరమా అన్నట్టు ఇన్‌సల్ట్ చేస్తుంది.
బాధపడ్డ చందా స్కూల్‌కి వెళ్లడం మానేస్తుంది. హోటల్‌లో, ఇళ్లల్లో పనిచేస్తూ డబ్బులు పోగేస్తుంటుంది. ఓసారి బిడ్డ మాటలకు చింత చెందుతూ రోడ్డు మీద అనాలోచితంగా కలెక్టర్ (సంజయ్ సూరి) కారుకు అడ్డం వస్తుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను తిడుతుంటే అతను కారు దిగి ‘‘ఆడవాళ్లతో మర్యాదగా మాట్లాడండి’’ అని కానిస్టేబుల్‌ను మందలిస్తాడు. ఆ ఐఏఎస్ అంటే గౌరవం పెరుగుతుంది చందాకు. ఒకసారి కలెక్టర్ బంగ్లాకు వెళ్లి అతనిని కలిసి తన గురించి, కూతురి పట్ల ఉన్న తన ఆశయం గురించీ చెప్తుంది. చదువుకు ఆకాశమే హద్దు. పనిమనిషి కూతురు పనిమనిషే కావాలని లేదు. ఐఏఎస్‌కూడా కావచ్చు అని చెప్తాడు. ఎలా అని అడుగుతుంది. ఆప్షన్స్ చెప్తాడు. ఆ లక్ష్యం ఆమె మనసులో నాటుకుంటుంది.
అందరికీ తెలుస్తుంది...
ఓసారి హోటల్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం కావడంతో తనతో పాటు పనిచేసే ఓ వ్యక్తి చందాను ఇంటి దగ్గర దింపుతాడు. అది చూసిన అపేక్ష అమ్మను అపార్థం చేసుకొని అనకూడని మాట అంటుంది. చెంప చెళ్లుమనిపిస్తుంది చందా. స్కూల్లో అందరికీ తెలిసిపోతుంది అపేక్ష వాళ్లమ్మే చందా అని. చందా పట్ల అపేక్ష విసురు ప్రవర్తన గురించి కూడా తెలుస్తుంది. క్లాస్‌మేట్స్ అపేక్షకు చీవాట్లు పెడ్తారు. అప్పుడర్థం అవుతుంది తల్లి విలువ కూతురికి. తెల్లవారి నుంచి స్కూల్‌కి రమ్మని అమ్మను బతిమాలుతుంది. వస్తుంది. టెన్త్ మెయిన్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఇద్దరూ కష్టపడి చదువుతారు. చందాకు కూతురి ఫలితాల మీదే ఆందోళన ఉంటుంది. ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయి తన మీద తల్లికి నమ్మకాన్ని పెంచుతుంది. అప్పుడు చెప్తుంది చందా కూతురితో.. ‘ప్రతి మనిషికి కల ఉండాలి. ఆ కల సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి... సాహసం ఉండాలి’’ అని. ఆ పాఠం ఆ పిల్ల జీవననేస్తం అవుతుంది.
కట్‌చేస్తే..
చందా కూతురు అపేక్ష.. సివిల్స్ పాసయి ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంటర్వ్యూలో అడుగుతారు.. ‘ఐఏఎస్ ఎందుకు కావాలనుకుంటున్నావ్?’’ అని. ‘‘ఎందుకంటే నేను పనిమనిషిని కాదల్చుకోలేదు కాబట్టి’’ అని సమాధానమిస్తుంది. అపేక్ష ఐఏఎస్ అవుతుంది. సున్నాను దేనితో భాగించినా శూన్యమే. కాని సున్నాకు ఎడమవైపున ఎన్ని అంకెలు చేరిస్తే అంత విలువ పెరుగుతుంది. జీవితమూ అంతే. ఏమీ లేదనుకుని సాగితే ఏమీ కనపడదు. ఏదో కావాలని నడిస్తేనే ఏదో ఒకటి దొరుకుతుంది. ఈ పాఠమే ‘నిల్ బటే సన్నాటా’. ఇది ఓ ఒంటరి స్త్రీ జీవన పోరాటం. కూతుర్ని ఆశలపల్లకీలో ఎక్కించడానికి ఆమె పడిన ప్రయాస. కలల ప్రపంచంలో తిప్పడానికి ఆమె చేసిన ప్రయాణం.
ప్రతి అమ్మాయికి చదువు ఎంత అవసరమో అని కూడా చూపిన సినిమా. తల్లిదండ్రుల పరిమితులు పిల్లలను ఆపకూడదు అని చాటే సినిమా! చిన్న లైన్‌ను అద్భుతంగా తెరకెక్కించారు సినిమా దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి. ఇది ఆమె మొదటి సినిమా. చందాగా స్వరా భాస్కర్ నటనకు మాటల్లేవ్. అపేక్షగా రియా శుక్లా సింప్లీసూపర్బ్. ‘నిల్ బటే సన్నాటా’ చూడాలనుకునేవాళ్లు యూట్యూబ్‌లో చూడొచ్చు. ఒకసారి కలెక్టర్ బంగ్లాకు వెళ్లి అతనిని కలిసి తన గురించి, కూతురి పట్ల ఉన్న తన ఆశయం గురించీ చెప్తుంది చందా. చదువుకు ఆకాశమే హద్దు. పనిమనిషి కూతురు పనిమనిషే కావాలని లేదు. ఐఏఎస్‌కూడా కావచ్చు అని చెప్తాడు. ఎలా అని అడుగుతుంది. ఆప్షన్స్ చెప్తాడు. ఆ లక్ష్యం ఆమె మనసులో నాటుకుంటుంది.
నిల్ బటే సన్నాటా’లో ఓ దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment