ఎల్లలు దాటుతున్న ఎర్రచం‘ధనం’
గిద్దలూరు, న్యూస్‌లైన్: ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే ఎర్రచందనం గిద్దలూరు అటవీ డివిజన్ నుంచి యథేచ్ఛగా తరలిపోతోంది. ఎర్రచందనం దుంగలను తమిళనాడులోని చెన్నైకి చేర్చి..అక్కడి నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. గిద్దలూరు సబ్‌డివిజన్ పరిధిలో గిద్దలూరు మండలంలోని ఉయ్యాలవాడ, బోధి, కొమరోలు మండలంలోని అల్లీనగరం, నల్లగుంట్ల, చింతలపల్లె బీట్లలో ఎర్రచందనం అధికంగా ఉంటుంది.
వీటితో పాటు గిద్దలూరు అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దుల్లో ఎర్రచందనం అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి ఎర్రచందనం నిరంతరం తరలుతున్నట్లు సమాచారం.దుంగలను అటవీ ప్రాంతంలో నరుక్కుని గిద్దలూరు, కొమరోలు మండలాల్లోని గ్రామాల మీదుగా అటు ఒంగోలు, ఇటు నంద్యాల వైపు నుంచి తరలిస్తుంటారు. ప్రతిరోజూ నాలుగైదు వాహనాల్లో తీసుకెళ్తున్నట్లు సమాచారం.
దుంగలను తరలించేందుకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించారు. అడవిలో చెట్లు నరికిన ప్రదేశం నుంచి వాహనం నిలుచున్న ప్రదేశానికి ఒక రేటు, వాహనం ప్రధాన రోడ్డు ఎక్కిస్తే ఒక రేటు, గిద్దలూరు దాటిస్తే మరో రేటు,నెల్లూరు, చెన్నై..ఇలా ఒక్కో ప్రదేశానికి ఒక్కో రేటు ఇచ్చి యువకులతో ఎర్రచందనం దుంగలను తరలిస్తుంటారు. ఎర్రచందనం అత్యంత ఖరీదైంది కావడంతో స్మగ్లర్లు అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించి తమ పనికి అడ్డు లేకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అడవిపై కొరవడిన నిఘా
అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లు ఉన్న నల్లమలపై అటవీ శాఖాధికారులు నిఘా తగ్గించడంతో ఎర్రచందనం దుంగ లు యథేచ్ఛగా ఎల్లలు దాటుతున్నాయి. అక్రమార్కులు తమ ఇష్టానుసారంగా దుంగలను నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. స్మగ్లర్లకు కొందరు అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుండటం వల్లే ఎర్రచందనం తరలించేందుకు అవకాశం ఉంటో ందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉయ్యాలవాడ, జమ్ముల్లపల్లె గ్రామా ల్లో కూలీల మధ్య నగదు పంపకాల్లో వివాదాలు చోటుచేసుకుని గొడవలు అయినట్లు సమాచారం.
ఇంత జరుగుతు న్నా సంబంధిత అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. తామూ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడుతున్నామన్నట్లు పనిచేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో స్మగ్లర్లను అడ్డుకోలేకపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గిద్దలూరు రేంజి, టాస్క్‌ఫోర్స్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 2011-12లో 37 కేసులు నమోదుచేసి 21 వాహనాలను సీజ్ చేయగా 24 మంది నిందితులపై కేసులు పెట్టారు. 2012-13లో 19 కేసులు నమోదు చేయగా 11 వాహనాలను సీజ్‌చేసి 13మంది నిందితులపై కేసులు నమోదు చేశారు.
ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గింది - నీలకంఠేశ్వరరెడ్డి, రేంజి అధికారి, గిద్దలూరు
ఎర్రచందన అక్రమ రవాణా తగ్గింది. నేను గత ఏడాది నవంబరులో విధుల్లో చేరినప్పటి నుంచి 3 లేదా నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి.