అలా చెప్పుకోవడం విని నవ్వొచ్చేది!
లైఫ్‌బుక్ - నిమ్రత్, హీరోయిన్ (లంచ్‌బాక్స్ ఫేమ్)
నాన్న మిల్ట్రీ ఆఫీసర్. నేను ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కాశ్మీర్లో మిలిటెంట్ల కాల్పుల్లో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ తానై చూసుకుంది అమ్మ.
ఢిల్లీ కాలేజిలో చదువుతున్న రోజుల్లో ముంబాయికి వెళ్లి సినిమాల్లో నటించాలని కలలు కనేదాన్ని. ‘ముంబాయి వెళతాను’ అని అమ్మకు చెప్పడానికి ధైర్యం చాల్లేదు. ఒకరోజు ధైర్యం చేసి అడిగాను. ముందు కాదన్నా... ఆ తరువాత ఒప్పుకుంది. ప్రతి ఒక్కరు అమ్మను - ‘‘మీ అమ్మాయి ముంబాయికి ఎందుకు వెళ్లింది? అక్కడ ఏం చేస్తుంది?’’లాంటి అనుమానపు ప్రశ్నలు అడిగేవారు. ఈ ప్రశ్నలతో అమ్మకు కోపం నషాలానికి అంటేది. వెంటనే నాకు ఫోన్ చేసి - ‘‘ఉద్యోగం దొరికిందా? దొరకకపోతే వచ్చేయ్’’ అని ఆజ్ఞాపించేది. ఇక నటన విషయానికి వస్తే హాబీగా మాత్రమే దాన్ని తీసుకోవాలని, వృత్తిగా ఎంచుకోవద్దని గట్టిగా చెప్పేది.
‘‘మీ అమ్మాయి సినిమాల్లో నటిస్తుందా?’’ అని నోళ్లు నొక్కుకున్న వాళ్లే ‘లంచ్‌బాక్స్’ సినిమాకు దేశవిదేశాల్లో ప్రశంసలు లభించిన తరువాత ‘మాకు బాగా తెలిసిన అమ్మాయి’ అని నా గురించి చెప్పుకోవడం విని నవ్వొచ్చేది!