ఎరానీకి పెన్నెటా షాక్
న్యూయార్క్: ఇటలీ అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఫ్లావియా పెన్నెటా... యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో పెన్నెటా 6-3, 6-1తో సహచరిణి, నాలుగోసీడ్ సారా ఎరానీపై విజయం సాధించింది. 71 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఎరానీ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఏస్‌లు సంధించడంలో విఫలమైన ఆమె అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్ మొత్తంలో పెన్నెటా ఏడు ఏస్‌లు సంధించగా... ఎరానీ ఒక్కటి కూడా సాధించలేకపోయింది.
తొమ్మిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరో మ్యాచ్‌లో టాప్‌సీడ్ సెరెనా (అమెరికా) 6-3, 6-0తో వోస్కోబోయోవా (కజకిస్థాన్)పై నెగ్గింది. మరోవైపు బుధవారం అర్ధరాత్రి జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా స్టార్ ప్లేయర్ వీనస్ విలియమ్స్‌కు చుక్కెదురైంది. జి జెంగ్ (చైనా) 6-3, 2-6, 7-6 (7/5)తో వీనస్‌పై నెగ్గింది. ఈ మ్యాచ్ మూడు గంటల రెండు నిమిషాల పాటు జరిగింది. దీంతో యుఎస్ ఓపెన్ చరిత్రలో సుదీర్ఘంగా జరిగిన ఐదో మహిళల మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ఇతర మ్యాచ్‌ల్లో 9వ సీడ్ జలెనా జంకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2తో అలిసా క్లెబనోవా (రష్యా)పై; పదోసీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 4-6, 6-1, 6-2తో లూసి సఫరోవా (చెక్)పై; 15వసీడ్ సొలెనీ స్టెఫానెజ్ (అమెరికా) 6-1, 6-1తో ఉర్జులా రద్వాన్‌స్కా (పొలెండ్)పై; 16వ సీడ్ సబీనా లిసికి (జర్మనీ) 6-2, 6-3తో ఫౌలా ఆర్మెచియా (అర్జెంటీనా)పై; 18వసీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) 6-3, 6-4తో కోకో వెండ్వాగే (అమెరికా) పై గెలిచి మూడో రౌండ్‌కి చేరారు.
ముర్రే జోరు : పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడోసీడ్ అండీ ముర్రే (బ్రిటన్) 6-2, 6-4, 6-3తో మైకేల్ లోద్రా (ఫ్రాన్స్)పై ఎలాంటి తడబాటు లేకుండా గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆరోసీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6-3, 6-7 (5/7), 6-4, 7-6 (9/7)తో గులెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్)పై; తొమ్మిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (6/2), 6-3, 6-2తో రాడెక్ స్టెఫానెక్ (చెక్) పై; 17వ సీడ్ కెవిన్ అండర్సన్ (రష్యా)7-5, 4-6, 6-2, 6-3తో డానియెల్ బ్రాండ్స్ (జర్మనీ)పై; లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) 6-3, 4-6, 6-3, 6-4తో బేకర్ (అమెరికా)పై గెలిచి రెండో రౌండ్‌కి చేరారు.
రెండో రౌండ్లో సోమ్‌దేవ్
భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్.. యూఎస్ ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 114వ ర్యాంకర్ సోమ్‌దేవ్ 4-6, 6-1, 6-2, 4-6, 6-4తో ప్రపంచ 84వ ర్యాంకర్ లుకాస్ ల్యాకో (స్లొవేకియా)పై విజయం సాధించాడు.
మూడు గంటలా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు 5 ఏస్‌లు సంధించాడు. రెండో రౌండ్లో సోమ్‌దేవ్... ఆండ్రియా సెప్పి (ఇటలీ)తో తలపడతాడు. గట్టి పోటీ ఎదురైనా తన ఆట తీరు చాలా సంతృప్తినిచ్చిందని మ్యాచ్ అనంతరం సోమ్‌దేవ్ వ్యాఖ్యానించాడు.