హోంశాఖ కార్యదర్శి బదిలీ
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన సీఎం జయలలిత ఇప్పటి వరకు 13 సార్లు తన కేబినెట్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. మంత్రుల శాఖల్లో మార్పులు జరిగినప్పుడ ల్లా ఐఏఎస్‌ల బదీలీలు పరిపాటే. అయితే, జిల్లాల కలెక్టర్లు, ప్రధాన శాఖల్లోని ఐఏఎస్‌లను మార్చేవారు. ఎప్పుడో ఒక సారి మాత్రం ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులపై బదిలీ వేటు పడుతోంది. గత వారం ఐఏఎస్‌ల మహానాడును దిగ్విజయవంతంగా నిర్వహించారు. ఇందులో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా శాఖల వారీగా చర్చల్లో వెలుగు చూసిన అంశాల మేరకో లేదా, ఏ కారణమో తెలియదు గానీ మంగళవారం ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారుల శాఖల్లో బదిలీ చిట్టాను రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ ప్రకటించారు.
హోం కార్యద ర్శిగా అపూర్వ: రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి నిరంజన్ మార్డిని తప్పించి ఆయన స్థానంలో ఉన్నత విద్యా శాఖ ప్రధాన అపూర్వ వర్మను నియమించారు. నిరంజన్ మార్డిని ఆర్థిక గణాంకాల విభాగం ప్రధాన కార్యదర్శి గా బదిలీ చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు మేనేజింగ్ డెరైక్టర్ రాజారామన్‌ను తప్పించి, ఆయన స్థానంలో ఆరోగ్య పథకాల ప్రాజెక్టు డెరైక్టర్‌గా ఉన్న పంకజ్ కుమార్ బన్సల్‌ను నియమించారు. రాజారామన్‌కు వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని అప్పగించారు. ఆ శాఖలో ఉన్న మణి వాసన్‌ను వికలాంగుల సంక్షేమ విభాగం కమిషనర్‌గా మార్చారు. ఆర్థిక గణాంకాల విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న వి ఇరై అన్భును అన్నా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ డెరైక్టర్‌గా నియమించారు. వికలాంగుల సంక్షేమ విభాగంలో ఉన్న వికే జయకొడిని క్రీడల శాఖకు మార్చారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్ఎస్ పళని మాణిక్యంకు ఉన్నత విద్యాశాఖను పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతగా అప్పగించారు.