nithin gadhare
-
ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించిన నాలుగు వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై మంత్రుల కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్ రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సహా మంత్రులతో ఏర్పాటుకానున్న కమిటీ ఈ నాలుగు రంగాలలో ఎన్ని పీఎస్‌యూలను కొనసాగించేదీ నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ నాలుగు వ్యూహాత్మక రంగాలుగా ఆటమిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ రంగాలలో సాధ్యమైనంత తక్కువగానే ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించనున్నట్లు ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ అంశంపై నీతి ఆయోగ్ ప్రాథమిక జాబితాను రూపొందిస్తోంది. తద్వారా ప్రభుత్వం వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టనుంది. ఇతర రంగాలను ప్రయివేటైజ్ చేయనుంది. తద్వారా ప్రయివేటైజ్ చేయనున్న కంపెనీలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఐఎన్ఎల్కు కేబినెట్ ఓకే..: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్ఐఎన్ఎల్)ను ప్రయివేటైజ్ చేసేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా అనుమతించినట్లు పాండే తాజాగా ట్వీట్ చేశారు. కంపెనీలో 100 శాతం వాటాను విక్రయించేందుకు గత నెల 27న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్‌లో భాగంగా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు వివరించారు. ప్రైవేటీకరణ లేదా విలీనం జాతీయ భద్రత, కీలక మౌలికసదుపాయాలు, ఇంధనం, మినరల్స్, ఫైనాన్షియల్ సర్వీసులను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా తాజా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఎంపిక చేశారు. వీటిలో అతి తక్కువగా పీఎస్‌యూలను కొనసాగించే వీలున్నట్లు పాండే తెలియజేశారు. మిగిలిన కంపెనీలను ప్రైవేటీకరించడం, విలీనం, ఇతర సీపీఎస్ఈలకు అనుబంధ సంస్థలుగా మార్చడం లేదా మూసివేయడం వంటివి చేపట్టనున్నట్లు వివరించారు. వెరసి ప్రభుత్వ రంగ కంపెనీలలో భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలియజేశారు. ప్రయివేట్ రంగం నుంచి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021–22)లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయిన్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హంస్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌లో డిజన్వెస్ట్మెంట్ను వేగవంతం చేయనున్నట్లు వివరించారు. -
రాజకీయ వాడీ వేడీ
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖపట్నం జిల్లా శంకుస్థాపనల సభలో రాజకీయ నినాదాలు హోరెత్తాయి. సీఎం చంద్రబాబు వస్తుండగా మోదీకి జైకొట్టిన బీజేపీ కార్యకర్తలు.. వారిపై టీడీపీ శ్రేణుల ఆగ్రహావేశాలు అధికారిక కార్యక్రమాన్ని అపహాస్యం చేశాయి. చివరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘మీరు మౌనం వహిస్తే నేనుంటాను, లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోతాను. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను’ అంటూ బీజేపీ, టీడీపీ శ్రేణులను వారించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా శుక్రవారం సాయంత్రం జరిగిన 7 ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమం బీజేపీ, టీడీపీ శ్రేణుల మధ్య రగులుతున్న అంతర్గత వైషమ్యాలకు వేదికగా నిలచింది. వారి మధ్య దూరాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది. బీజేపీ, టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తమ పార్టీ కండువాలతో సమావేశ మందిరంలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రి సమావేశ మందిరంలోనికి అడుగుపెడుతుండగా బీజేపీ కార్యకర్తలు మోది.. మోది అంటూ నినాదాలు చేశారు. దీనితో భిన్నుడైన ముఖ్యమంత్రి కొంత అసహనానికి గురయ్యారు. అయినప్పటికీ బీజేపీ శ్రేణులు భారత మాతాకీ జై, మోదీకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన గడ్కరీ స్వయంగా మైక్ అందుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇది తన శాఖ కార్యక్రమమని, తన ఆహ్వానంపై ముఖ్యమంత్రి సమావేశానికి వచ్చారని వివరించారు. సావధానంగా ఉంటే అందరి సమస్యలు తాను వింటానని, మీ ఆవేదన అర్ధం చేసుకోగలనంటూ మాట్లాడారు. దీనితో కొద్దిసేపు ఇద్దరూ శాంతించారు. నిర్వాహకులు తనకు అందించిన పుష్పగుచ్చాన్ని స్వయంగా నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రికి అందజేసి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి తనను నిర్వాహకులిచ్చిన పుష్పగుచ్ఛాన్ని గడ్కరీకి ఇచ్చి పరస్పరం అభినందనలు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రసంగాల సమయంలోనూ ఆగని నినాదాలు ప్రసంగాలు జరుగుతున్నంతసేపూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్యుగ్ధం జరిగింది. పోలవరం మోదీ వరం, మోదీ, మోదీ అంటూ బీజేపీ కార్యకర్తలు పెద్దెత్తున నినాలు చేశారు. వీరికి సమాధానం చెబుతూ చంద్రబాబు జిందాబాద్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినదించారు. హోమ్ మంత్రి చినరాజప్ప, మంత్రి అయ్యన్నపాత్రుడు మైక్ అందుకుని కార్యకర్తలకు సర్దిచెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఎంపీ హరిబాబు మాట్లాడుతున్న సమయంలో రైల్వేజోన్ విషయాన్ని కొంతమంది లేవనెత్తారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పి.రాధక్రిష్ణన్, మన్కుస్ ఎల్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్ మాధవ్, సోము వీర్రాజు, ఎం.వి.వి.ఎస్ మూర్తి, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూరి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్రాజు, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్ కుమార్, పీలా గోవింద్, పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థుల ఖర్చుపై నిఘా
సాక్షి, ముంబై: ఎన్నికల సమయంలో డబ్బులు, మద్యం పంపిణి చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారో తస్మాత్ జాగ్రత్త. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చులపై నిఘా వేసేందుకు ఈసారి ముంబైలో ప్రత్యేకంగా 78 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించనున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నితిన్ గధారే తెలిపారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించాయి. దీంతో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఏర్పాట్లపై షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా చేసిన ప్రచారాలు, సభలు, సమావేశాలన్నీ ఒక ఎత్తై, ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసే ప్రచారమే అంతే ప్రధానం కానుంది. ఓటర్లను అతి తక్కువ సమయంలో ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం, మహిళలకు చీరలు పంపిణీ చేయడం లాంటివి జోరుగా సాగుతాయి. ఇవి అన్ని పార్టీల అభ్యర్థులు చేపడుతున్నా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుంటారు. అందుకే వీటిపై నిఘా వేసేందుకు ప్రతి శాసనసభ నియోజక వర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఈసారి రంగంలోకి దింపాలని ఈసీ నిర్ణయించింది. ఒక్కో స్క్వాడ్‌లో ఒక కార్యనిర్వాహక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి, ముగ్గురు పోలీసు అధికారులు ఉంటారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టేం దుకు ప్రయత్నిస్తే 18000221952 టోల్ ఫ్రీ నంబ ర్కి ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని ఈసీ తెలిపింది. ఫిర్యాదు అందుకున్న 15 నిమిషాల్లోనే ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుంటుందని జిల్లాధికారి శేఖర్ చత్రే చెప్పారు. ప్రత్యేక నియమ, నిబంధనలు... మద్యం విక్రయించే షాపులపై కూడా ఈ స్క్వాడ్ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. మద్యం షాపు యజమానులు ప్రతీరోజు ఏ కంపెనీకి చెందిన మద్యం బాటిళ్లు ఎన్ని విక్రయించారో వాటి వివరా లు కచ్చితంగా నమోదు చేయాలనే ఆంక్షలు విధిం చనుంది. ఇదిలాఉండగా ఎన్నికల ప్రచారం సమయంలో అభ్యర్థి వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉంచుకోరాదు. ఈ సమయంలో భారీ లావాదేవీలు నిర్వహించాలంటే అందుకు చెక్కులు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతులను వినియోగించాల్సి ఉంటుంది. సరాసరి రోజుకు 10 లక్షలకుపైగా ఖర్చుచేస్తే ఇబ్బందుల్లో పడతారు. అభ్యర్థులు బ్యాంక్ నుంచి ఎన్ని డబ్బులు డ్రా చేశారు, ఎంత మేర జమ చేశారు? తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని ఆయా బ్యాంక్‌లకు కూడా ఈసీ ఆదేశాలు జారీ చేయనుంది. దీంతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎంతమేర లావాదేవీలు నిర్వహించారు, ఎంతమేర ఖర్చు చేశారో వివరాలు తెలిసే అవకాశముందని శేఖర్ చత్రే అభిప్రాయపడ్డారు.