ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాం: నితీశ్‌కుమార్
పట్నా: బిహార్ ఎన్నికల్లో మహాకూటమికి అధికారం అప్పగించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అభినందనలు తెలిపారు. మహాకూటమికి గట్టి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి భారీ మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌తో నితీశ్‌కుమార్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పటిష్టమైన ప్రతిపక్షం ఉంటేనే పరిపాలన సజావుగా ఉంటుందని, రాష్ట్రంలో తాము ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. బిహార్ అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇది ప్రజల విజయం, మహాకూటమి విజయం అని పేర్కొన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..
ముందుగా అందరికీ స్వాగతం
బిహార్ ప్రజలకు అభినందనలు
బిహార్ స్వాభిమానం విజయం ఇది
మహాకూటమికి బిహార్ ప్రజలు మంచి సమర్ధన ఇవ్వడం వల్లే మీముందు మళ్లీ నిలబడ్డాం
మీకు చాలా అనుమానాలు రేకెత్తించారు.
ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టే ఈ రకం ఫలితాలు వచ్చాయి
ఓటర్లకు, బీహార్ ప్రజలకు అభినందనలు
మాకు అన్ని వర్గాలు.. మహిళలు, యువత, ముస్లింలు, దళితులు, మహాదళితులు, గిరిజనులు.. ఎవరైనా అన్ని వర్గాల నుంచి మద్దతు అందింది
ఇందులో ఎవరూ అస్పృశ్యులు లేరు
మహాకూటమికి గట్టి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు
ఎన్నికల సమయంలో చాలా దారుణమైన ప్రచారం జరిగింది
బిహార్ ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోకుండా తమ విజ్ఞత నిరూపించుకున్నారు
ఇది చాలా పెద్ద విజయం. దీన్ని మేం వినమ్రంగా స్వీకరిస్తున్నాం
ప్రజల మనసులో కొన్ని ఆశలు ఉన్నట్లు తెలుస్తోంది
బిహార్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వేగంగా వెళ్లాలని అనుకున్నారు
మేమంతా దాన్ని అర్థం చేసుకుంటున్నాం. ప్రజల ఆశలకు అనుగుణంగానే పనిచేస్తాం
మేం ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో కూడా మహాకూటమిలో మూడు పార్టీలు గట్టిగా నిర్ణయించుకున్నాం
మా కూటమిని ప్రజలు ఆమోదించారు. ఈ మాండేట్ ప్రకారమే మేం పనిచేస్తాం
మా మనసులో బిహార్‌లో ఎవరిపట్లా ఎలాంటి విభేదాలు ఉండవు
ఎన్నికల సమయంలో ఎవరు ఏమన్నా కూడా ఆ ప్రభావం ఆ తర్వాత ఉండదు
పాజిటివ్ భావనతోనే మేం పనిచేస్తాం
దేశం మొత్తం ఈ ఎన్నికల వైపు చూసింది
ఈరోజు పొద్దున్నే చాలా రకాల కథనాలు వచ్చాయి..
వాటిని చూసి దేశ ప్రజలు రకరకాలుగా భావించారు
ఫోన్లు కూడా చేసి ఆందోళన వ్యక్తం చేశారు
కానీ తర్వాత మా విజయం ఖాయమైన తర్వాత దేశ ప్రజల మనసు ఊరట పొందింది
పటిష్ఠమైన ప్రతిపక్షం ఉంటేనే పాలన కూడా బాగా సాగుతుంది
బిహార్‌లో ఫలితాలు బాగా వస్తే, దీని ప్రభావం దేశం మొత్తమ్మీద ఉంటుంది
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అధికారం ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం బలహీనంగా ఉండాలని ఎవరూ అనుకోరు
మేం ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాం, ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాం
ప్రతిపక్షాన్ని మేం గేలి చేస్తామని ఎవరూ అనుకోవక్కర్లేదు
ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీరేలా పాలన సాగిస్తాం
ప్రధానమంత్రి కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు
కేంద్రం కూడా బిహార్ అభివృద్ధికి సహకరిస్తుందని ఆశిస్తున్నాం
సోనియా, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ, చంద్రబాబు, కేజ్రీవాల్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ములాయం సింగ్ యాదవ్, సుశీల్ కుమార్ మోదీ అందరూ అభినందించారు.. వాళ్లకు కృతజ్ఞతలు.
ట్విట్టర్ ద్వారా కూడా అభినందనలు తెలిపినవాళ్లకు సైతం కృతజ్ఞతలు.
మొదటి నుంచి మేమంతా ఒకే మాటమీద ఉన్నాం, ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు
ఏ సీట్లో ఏ పార్టీ పోటీ చేయాలో కూడా ముందే నిర్ణయించుకున్నాం. మూడు పార్టీల అభ్యర్థులందరి పేర్లు కలిపి ఒకేసారి ప్రకటించాం
సమాజంలో విభేదాలు తేవాలన్న ప్రయత్నాలు కొంతవరకు జరిగినా, అవన్నీ విఫలమయ్యాయి