నిట్‌లో కౌన్సెలింగ్ సందడి
నేటితో ముగియనున్న మొదటి విడత
ఒక్క రోజే 399 మంది రిపోర్టింగ్
నిట్‌క్యాంపస్ : దేశంలోని వివిధ నిట్లు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీ, వరంగల్ నిట్‌లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కోసం సీట్ అలాట్మెంట్ రిపోర్టింగ్‌కు వచ్చిన విద్యార్థులతో సందడి మొదలైంది. వేరే రాష్ట్రాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, వారు తల్లిదండ్రులతో హాజరయ్యారు. దీంతో సందడి నెలకొంది. వీరంతా నిట్‌లోని ఆడిటోరియంలో రిపోర్టు చేశారు.
ఆడిటోరియంలో విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. బుధవారం ఒక్కరోజే సుమారు 399 మంది రిపోర్టింగ్‌కు హాజరయ్యారు. మొదటి విడుత రిపోర్టింగ్ గురువారంతో ముగియనుందని నిట్ అకడమిక్ డీన్ డీవీఎల్‌ఎన్ సోమయాజులు తెలిపారు. డీన్ సోమయాజులు, నిట్ ఎంబీఏ విభాగం అధిపతి రవీందర్‌రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆనందకిషోర్‌లు రిపోర్టింగ్ సెంటర్లో సర్టిఫికెట్లను పరిశీలించారు.
ఇంప్రూవ్మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలి
జేఈఈలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జేఈఈ ర్యాంకులను ప్రకటించింది. జేఈఈలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కుల నిష్పత్తి ఆధారంగా ర్యాంకులను నిర్ధారించారు. ఆ ర్యాంకుల ఆధారంగా ఐఐటీ, ఐఐఐటీ, నిట్, ఇతర ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు సెంట్రల్ సీట్ అలాట్మెంట్ బోర్డు (సీఎస్ఏబీ) ద్వారా సీటు అలాట్మెంట్ చేస్తారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇంటర్మీడియెట్ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇందులో కొంతమందికి గతంలో కన్న ఎక్కువ మార్కులు వచ్చాయి. ఈ మార్కులను పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిట్ అకడమిక్ అధికారులను కోరారు.