Nitu Kumari Prasad
-
దొడ్డి దారిన ఉద్యోగ భర్తీ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9,335 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేట ప్పుడు రిజర్వేషన్ల నిబంధనలను అమలు చేయలేదని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996లోని రూల్ 22కు వ్యతిరేకంగా ఆ పోస్టులను భర్తీ చేయడంపై కోర్టు ఆక్షేపించింది. 2018లో రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆ పోస్టులను భర్తీ చేసింది. అయితే అప్పటికే ఆ పోస్టులను రిజర్వేషన్ల నిబంధనలకు లోబడి భర్తీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. క్రీడలు ఇతర అన్ని కేటగిరీల రిజర్వేషన్లు 50 శాతం మించకుండా భర్తీ ఉండాలని, వంద పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని, ఏపీ సబా ర్డినేట్ రూల్స్ యాక్ట్–1996లోని 22వ నిబం ధనలను అమలు చేయాలన్న చట్ట నిబంధనలను ఉల్లంఘించి పోస్టులు భర్తీ చేశారని తప్పుపట్టింది. చట్టానికి వ్యతిరేకంగా పోస్టుల భర్తీ చేశారని దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యం విచారణకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు హాజరయ్యారు. పూర్తి వివరాలు సమర్పిం చేందుకు 8 వారాల సమయం కావాలని ఆయన కోరారు. అందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు అంగీకరించలేదు. అంతకు ముందు ఉన్న కమిషనర్ నీతూకుమారి ప్రసాద్‌కు హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఆమెకు తెలియజేయాలని రఘునందన్‌రావును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఐఏఎస్‌లకు ఆ మాత్రం తెలియదా? ‘దొడ్డి దారిన భర్తీ చేసిన పోస్టులపై ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. రిజర్వేషన్ల నిబంధన అమలు చేయకుండా పోస్టులను భర్తీ చేస్తే హైకోర్టు చూస్తూ కూర్చోదు. చట్ట వ్యతిరేకంగా భర్తీ చేసిన పోస్టుల్లో చేరిన వారిని ఏం చేస్తారో చెప్పండి. నియామకాలు చేసేటప్పుడు చట్ట ప్రకారం న్యాయపర అభిప్రాయాన్ని కూడా పొందిన తర్వాతే చేయాలన్నది పాలనలో అత్యంత కీలక విషయం అని ఐఏఎస్ అధికారులకు తెలియదా. చట్టాలను సరిగ్గా అమలు చేస్తే కోర్టు ధిక్కార కేసుల నమోదు అనూహ్యంగా ఉండదు. ఈ కేసులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకపోవడం చట్టవ్యతిరేకం. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరూ ఉద్యోగాలు పొందడానికి వీల్లేదు. చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుతారో చెప్పండి. భర్తీ చేసే ముందు అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకుని ఉంటే న్యాయపరమైన అవరోధాలు ఉండేవే కావు. తప్పులను సరిదిద్దే చర్యలు ఏం తీసుకున్నారో వచ్చే శుక్రవారం జరిగే విచారణ సమయంలో చెప్పండి’అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అలసత్వంపై ఆగ్రహం
లాలాచెరువు (రాజానగరం), న్యూస్‌లైన్ :ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సంబంధిత సిబ్బందిని హెచ్చరించారు. రాజానగరం, రాజమం డ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌లలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆమె పరిశీలించారు. లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, హుకుంపేట, బొప్పన సావిత్రమ్మ హైస్కూల్, దానవాయిపేటలోని నివేదిత కిశోర్ తెలుగు మీడియం స్కూళ్లలోని పోలింగ్ బూత్‌ల వద్ద జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. లాలాచెరువులో ఓటర్ల నమోదు ప్రక్రియ పోలింగ్ బూత్‌ల వద్ద కాక పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించడంపై అక్కడి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజానగరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ఉదయం 11.30 గంటల వరకు బూత్ లెవెల్ అధికారితోపాటు ఇతర సిబ్బంది ఎవ్వరు లేకపోవడాన్ని గమనించారు. ఇదే విధంగా చాలా చోట్ల బూత్ స్థాయి అధికారులు సకాలంలో విధులకు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. లాలాచెరువు బూత్ లెవెల్ అధికారిని, ఆర్ఐని సస్పెండ్ చేయాలని అక్కడే ఉన్న రాజమం డ్రి ఆర్డీఓ నాన్‌రాజును ఆదేశించారు. విధులకు రాని వారికి కూడా వెంటనే మెమోలు జారీ చేయమని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించే సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాజానగరం ఆర్వోపై కమిషన్‌కు ఫిర్యాదు.. రాజానగరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. అలాగే అనపర్తి, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ను ధిక్కరించవద్దని, యంత్రాంగం నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. రోడ్లపై ప్రకటన బోర్డులు, ఫ్లెక్సీలు లేకుండా తొలగించాలన్నారు. ఈ విషయమై మరింత శ్రద్ధ వహించాలని రాజానగరం తహశీల్దారుకు సూచించారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్.మార్కండేయులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కోటగుమ్మం(రాజమండ్రి) : ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో ఆదివారం ఓటరు నమోదును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దానవాయిపేలోని నివేదిత కిశోర్ విహార్ తెలుగు మీడియం స్కూల్లో నిర్వహిస్తున్న ఓటరు నమోదును తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజానగరం ఓటరు నమోదు కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాజానగరం రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనపర్తి, రాజమండ్రి అర్బన్ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులకూ షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని అన్నారు. రోడ్లపై ఫ్లెక్సీలు, బ్యానర్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ పి. మార్కెండేయులు, రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి వర్దనపు నాన్‌రాజ్, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
కలెక్టర్ బదిలీకి పట్టు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా కలెక్టర్ నీతూకుమారిప్రసాద్కు బదిలీ జరగనుందా? త్వరలో భారీ స్థాయిలో జరుగనున్నఐఏఎస్ల బదిలీల కోసం రూపొం దించిన జాబితాలో జిల్లా కలెక్టర్ పేరు చోటు చేసుకుందా? అంటే అవుననే పుకార్లు.. జిల్లాలో షికారు చేస్తున్నాయి. గడచిన నాలుగైదు రోజులుగా ఈ విషయం అటు అధికార వర్గాల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను హాట్‌టాపిక్‌గా మారింది. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఎన్నికల కమిషన్ ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తోన్న (ఎన్నికల విధులతో సంబంధం ఉన్న)అధికారులను, సొంత ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఆదేశించింది. ఇందుకు గడువు కూడా ఈ నెల 10 వరకు విధించింది. ఇప్పటికే పోలీసుశాఖలో ఎస్ఐలు, సీఐల బదిలీల ప్రక్రియ పూర్తి అయింది. ఇక రెవెన్యూ శాఖలో 57 మంది తహశీల్దార్ల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. ఇంతలో రెవెన్యూశాఖలో అధికారులు సమైక్యాంధ్ర సమ్మెలోకి వెళ్లడంతో ఈ బదిలీల ప్రక్రియపై సందిగ్థత కొనసాగుతోంది. ఈ తరుణంలో ఐఏఎస్‌ల బదిలీల్లో కలెక్టర్ బదిలీ కూడా ఉందనే సమాచారం చర్చనీయాంశమైంది. జిల్లా కలెక్టర్‌గా నీతూకుమారి బాధ్యతలు చేపట్టి ఈనెల 24 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారమైతే కలెక్టర్‌ను కదపాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ, ఇతర కారణాలతో కలెక్టర్ బదిలీకి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు గట్టిగా పట్టుబడుతున్నారని సమాచారం. కొనసాగించేందుకు సహకరిస్తామని నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ముఖ్యనేత భరోసా ఇచ్చారని కూడా చెబుతున్నారు. ఇటీవల పశుసంవర్థక శాఖ పోస్టుల భర్తీలో తన సిఫార్సులతో పోస్టింగ్‌లు ఇచ్చిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయడం, బదిలీ చేసిన చోట నుంచి మరోచోటకు మార్చేసిన వ్యవహారంపై ఒక మంత్రితో కలెక్టర్‌కు విభేదాలు వచ్చాయి. ఈ విషయంలో గుర్రుగా ఉన్న మంత్రి.. బదిలీ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. ఆధార్ నమోదు, అనుసంధానం మినహా పలు శాఖల ప్రగతిని పరుగులు పెట్టించలేకపోతున్నారని, యంత్రాంగంపై పట్టు బిగించలేకపోవడం వంటి కారణాలను చూపించి బదిలీకి పట్టుబడుతున్నారని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ కె.ఎస్. శ్రీనివాసరాజు జిల్లా కలెక్టర్‌గా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియవచ్చింది. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ఆయన రాకకు కొందరు జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలియవచ్చింది. కలెక్టర్ భర్త రాజేష్‌కుమార్ కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. నీతూకుమారి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఏడాది తరువాత రాజేష్‌కుమార్ కమాండెంట్‌గా వచ్చారు. అంటే ఆయన ఇక్కడకు వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది. ఈ నేపథ్యంలో భార్యను బదిలీ చేయాల్సి వస్తే అనివార్యంగా భర్తను కూడా (స్పౌస్కేసు) బదిలీ చేయాల్సి ఉంటుంది. భర్త వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది. ఈ కారణాలకు తోడు జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేత మంత్రి చేస్తున్న ప్రయత్నాలపై నీళ్లు చల్లుతున్నారని, కలెక్టర్ బదిలీ కాకుండా అడ్డుపడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బదిలీ ఉంటుందా లేదా, అనేది తేలాలంటే మరో ఐదు రోజులు వేచి చూడాల్సిందే.