అలసత్వంపై ఆగ్రహం
Published Mon, Mar 10 2014 1:47 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
లాలాచెరువు (రాజానగరం), న్యూస్‌లైన్ :ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సంబంధిత సిబ్బందిని హెచ్చరించారు. రాజానగరం, రాజమం డ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌లలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆమె పరిశీలించారు. లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, హుకుంపేట, బొప్పన సావిత్రమ్మ హైస్కూల్, దానవాయిపేటలోని నివేదిత కిశోర్ తెలుగు మీడియం స్కూళ్లలోని పోలింగ్ బూత్‌ల వద్ద జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.
లాలాచెరువులో ఓటర్ల నమోదు ప్రక్రియ పోలింగ్ బూత్‌ల వద్ద కాక పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించడంపై అక్కడి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజానగరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ఉదయం 11.30 గంటల వరకు బూత్ లెవెల్ అధికారితోపాటు ఇతర సిబ్బంది ఎవ్వరు లేకపోవడాన్ని గమనించారు. ఇదే విధంగా చాలా చోట్ల బూత్ స్థాయి అధికారులు సకాలంలో విధులకు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. లాలాచెరువు బూత్ లెవెల్ అధికారిని, ఆర్‌ఐని సస్పెండ్ చేయాలని అక్కడే ఉన్న రాజమం డ్రి ఆర్డీఓ నాన్‌రాజును ఆదేశించారు. విధులకు రాని వారికి కూడా వెంటనే మెమోలు జారీ చేయమని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించే సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజానగరం ఆర్వోపై కమిషన్‌కు ఫిర్యాదు..
రాజానగరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. అలాగే అనపర్తి, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ను ధిక్కరించవద్దని, యంత్రాంగం నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. రోడ్లపై ప్రకటన బోర్డులు, ఫ్లెక్సీలు లేకుండా తొలగించాలన్నారు. ఈ విషయమై మరింత శ్రద్ధ వహించాలని రాజానగరం తహశీల్దారుకు సూచించారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్.మార్కండేయులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
కోటగుమ్మం(రాజమండ్రి) : ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో ఆదివారం ఓటరు నమోదును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దానవాయిపేలోని నివేదిత కిశోర్ విహార్ తెలుగు మీడియం స్కూల్‌లో నిర్వహిస్తున్న ఓటరు నమోదును తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజానగరం ఓటరు నమోదు కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాజానగరం రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనపర్తి, రాజమండ్రి అర్బన్ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులకూ షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని అన్నారు. రోడ్లపై ఫ్లెక్సీలు, బ్యానర్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ పి. మార్కెండేయులు, రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి వర్దనపు నాన్‌రాజ్, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement