ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఎన్ఎంఎంటీ బస్సు చార్జీల మోత?
సాక్షి, ముంబై: ఎన్నికల ఫలితాలు వెలువడగానే సామాన్యుడి వీపు విమానం మోత మోగనుంది. ప్రభుత్వ, ప్రభుత్వేర సంస్థలు కూడా సామాన్యుడిపై భారం మోపి, తమ బరువును తగ్గించుకునే దిశగా ఆలోచన చేస్తున్నాయి. నవీముంబై మున్సిపల్ ట్రాన్స్పోర్ట్(ఎన్ఎంఎంటీ) ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు చార్జీలు కూడా మరో మూడు రోజుల్లో పెరగనున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రోజునుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిసింది. నాన్ ఏసీ బస్సుల ప్రస్తుత కనిష్ట చార్జీ రూ.5 ఉండగా.. రూ.2 నుంచి రూ.4 పెంచేందుకు ప్రతిపాదించారు.
ఇక ఏసీ బస్సుల ప్రస్తుత కనీస చార్జీ రూ.15 ఉండగా రూ.5 నుంచి రూ.10 వరకు పెంచాలని ప్రతిపాదించారు. దీంతో ఏసీ బస్సుల కనీస చార్జీ రూ. 20, నాన్ ఏసీ బస్సుల చార్జీ దాదాపుగా రూ. 10 వరకు పెరగనుంది. మరో రెండు రోజుల్లో చార్జీల పెంపు విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్ఎంఎంటీ చెర్మైన్ ముఖేష్ గైక్వాడ్ వెల్లడించారు. దీంతో నాన్ ఏసీ బస్సుల కనిష్ట చార్జీ రూ.7గా, ఏసీ బస్సుల కనిష్ట చార్జీ రూ.20 కానుంది. అయితే ఎంతమేర పెంచాలనే విషయమై మరో రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్ఎంఎంటీ చైర్మన్ ముకేశ్ గైక్వాడ్ తెలిపారు. ఆదాయం తగ్గడంతో పరిపాలనా విభాగం చార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్ఎంఎంటీ నెలకు రూ.1.74 కోట్ల నష్టాలను చవిచూస్తోందన్నారు. సీఎన్జీ, ఇంధన ధరలు పెరగడంతో చార్జీలను పెంచక తప్పడంలేదన్నారు.
ముందు సేవలను మెరుగుపర్చండి...
చార్జీల పెంపు విషయం గురించి మాత్రమే ఆలోచిస్తున్న ఎన్ఎంఎంటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయమై ఆలోచన చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో తిరుగుతున్న ఎన్ఎంఎంటీ బస్సుల పరిస్థితి ఘోరంగా ఉంటోందని, కనీసం గమ్యానికి చేరతమాన్న నమ్మకం ఉండడంలేదని, ముందు బస్సుల కండిషన్ను మెరుగుపర్చాలని చెబుతున్నారు. చార్జీలను పెంచాలని నిర్ణయించిన ఎన్ఎంఎంటీ నాణ్యమైన సేవలు అందించేందుకేనని సాకులు చెబుతున్నా ప్రతిసారీ మోసం చేస్తూనే ఉందని, ఎన్నిసార్లు చార్జీలు పెంచిన సేవల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదంటున్నారు.
చార్జీలను పెంచాలంటూ బెస్ట్ చేసిన ప్రతిపాదననను ఎమ్మెమ్మార్డీఏ కూడా ఆమోదించిందని తెలిసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున చార్జీల పెంపుదల ప్రక్రియ ఆలస్యమవుతోందని, ఫలితాల వెలువడగానే పెంపుదల అమల్లోకి వచ్చే అవకాశముందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.