no danger
-
ఎర్రకాలువలో తిరగబడిన ఫెడల్ బోట్
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో ప్రారంభమైన బోటింగ్ షికారు పర్యటనలో భాగంగా ఆదివారం జలాశయంలోకి షికారుకు వెళ్లిన ఫెడల్ బోట్ బోల్తాపడింది. ఇద్దరు పర్యాటకులు ఫెడలింగ్ చేసుకుంటూ జలాశయంలోకి వెళ్లారు. జలాశయంలో నీరు ఉద్ధృతంగా అలలు వేయడంతో వీరు ప్రయాణిస్తున్న ఫెడల్ బోట్ బోల్తా కొట్టింది. అయితే వీరు భద్రతా జాకెట్లు ధరించి ఉండటంతో ప్రమాదం తప్పింది. సిబ్బంది వీరిని వేరొక రెడ్చిల్లి బోటింగ్లోకి ఎక్కించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అలలు ఎక్కువ ఉన్న సమయంలో ఫెడల్బోట్ పై షికారుకు అనుమతి ఇవ్వడం సరికాదని పర్యాటకులు పేర్కొంటున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
ఆలమూరు (పెనుమంట్ర): ఆలమూరు శివారు కోమటిచెరువులో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు దగ్ధమైంది. గ్రామ శివారు కోమటి చెరువు ప్రాంతంలో ఉదయం 10 గంటలకు కొండేటి సూర్యారావు ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించి సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. రూ. 1.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు అత్తిలి అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. గ్రామ కార్యదర్శి, వీఆర్వోలు ప్రమాద నష్ట వివరాలను నమోదు చేశారు. -
మండల పరిషత్‌లో అగ్నిప్రమాదం
జంగారెడ్డిగూడెం రూరల్ : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఒక గదిలో భద్రపరిచిన రికార్డులు, బీరువా, చెక్క పెట్టెలు పాత కంప్యూటర్ కాలిబూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన గదిలోనే గ్యాస్‌బండ కూడా ఉంది. అదృష్టవశాత్తూ అది పేలలేదు. పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు. మంటలు చెలరేగుతున్న సమయంలో గుర్తించిన నైట్‌వాచ్‌మన్ మంగరాజు అధికారులకు సమాచారం ఇచ్చారు. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక వాహనం అందుబాటులో లేకపోవడంతో చింతలపూడి అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. త్రుటిలో ప్రమాదం తప్పింది. కార్యాలయం ఎదుట వేసవిలో చలివేంద్రం కోసం ఏర్పాటు చేసిన తాటాకు పాక నుంచి మంటలు చెలరేగి అనంతరం కార్యాలయంలో లోపలకు విస్తరించి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రాత్రి ఒంటి గంటసమయంలో ప్రమాదం జరిగిందని, పాత రికార్డులు కాలిబూడిదయ్యాయని ఎంపీడీవో శ్రీదేవి తెలిపారు. కార్యాలయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తే తప్ప కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాలు తెలుస్తాయని, అప్పుడే నష్టం ఎంత వాటిల్లిందనేది స్పష్టత వస్తుందని సమాచారం. ఈ ప్రమాదం విద్యుత్ షార్టుసర్కూ్కట్ వల్లగానీ, లేక కేర్లెస్స్మోకింగ్ వల్ల చలివేంద్ర షెడ్డుకు నిప్పంటుకుండడం వల్లగానీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయమంతా నల్లగా పొగబారిపోయింది.