జడేజా.. ఆండర్సన్.. ఇద్దరిదీ తప్పులేదు
ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఇద్దరిలో ఎవరిదీ తప్పులేదని ఐసీసీ తేల్చింది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇద్దరి మధ్య గొడవ జరగడం, దాంతో రవీంద్ర జడేజాకు తొలుత జరిమానా విధించడం తెలిసిందే. అయితే దీనిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత శుక్రవారం జరిగిన క్రమశిక్షణా విచారణలో భారత, ఇంగ్లండ్ క్రికెటర్లిద్దరిలో ఎవరిదీ తప్పులేదని ఐసీసీ తేల్చింది.
ఈ విచారణ సుదీర్ఘంగా ఆరు గంటల పాటు సాగింది. ఆ తర్వాత ఇద్దరిలో ఎవరిదీ తప్పులేదని తేల్చడంతో తర్వాత సిరీస్‌లో జరగబోయే టెస్టు మ్యాచ్‌లలో వీళ్లిద్దరూ పాల్గొనడానికి అడ్డు లేకుండా పోయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణతో ప్రస్తుతానికి ఆండర్సన్ - జడేజాల మధ్య వివాదానికి తెరపడినట్లయింది. రెండు జట్లకు చెందిన కొంతమంది ఆటగాళ్లతో సహా పలువురి సాక్ష్యాలు తీసుకున్నామని, వాళ్ల న్యాయవాదులను కూడా సంప్రదించామని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.