No students
-
విద్యార్థులు లేని బడికి 9 మంది టీచర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: 10 తరగతి గదులు, 9 మంది ఉపాధ్యాయులు.. పేరుకు పెద్దబడే. కానీ ఏం లాభం. ఒక్కడంటే ఒక్క విద్యార్థి కూడా లేడు. వరంగల్ రూరల్ జిల్లా నలబెల్లి మండలం ముచ్చింపుల జెడ్పీ హైస్కూల్ పరిస్థితి ఇది. ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న దీన్ని 2002లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. 2013 తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. గత ఏడాది 6 నుంచి 10వ తగరతి వరకు ఒక్కొక్క తరగతిలో ఒక్క విద్యార్థి చొప్పున ఐదుగురు విద్యార్థులున్నారు. ఈ ఏడాది నలుగురు విద్యార్ధులు టీసీలు తీసుకొని వేరే పాఠశాలలో చేరిపోయారు. 10వ తరగతి చదివే ఒకే ఒక బాలిక మాత్రమే జూలై వరకు స్కూల్‌కు వచ్చింది. తర్వాత ఆమె కూడా టీసీ తీసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేడు. కానీ.. హెడ్మాస్టర్ శ్రీనివాస్‌తోపాటు మరో 8 మంది ఉపాధ్యా యులు రోజూ పాఠశాలకు వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోతున్నారు. 900 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 18 మంది హై స్కూల్ విధ్యనభ్యసించే విద్యార్థులు ఉన్నారు. సమీప గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలకే వెళ్లడంతో ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. దీనిపై హెడ్మాస్టర్, జిల్లా సైన్స్ అధికారి కె.శ్రీనివాస్ వివరణ కోరగా తెలుగు మీడియం పాఠశాల కావడంతో గ్రామంలో ఉన్న కొద్దిమంది విద్యార్థులు ప్రైవేటు బడులకు వెళ్తున్నారన్నారు. -
ఆ స్కూల్లో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేడు
-
నాకు నీవు.. నీకు నేను.. ఒకరికొకరం
హిందూపురం : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే... హిందూపురంలో వింత పరిస్థితి నెలకొంది. స్థానిక కంసలపేటలో ఉన్న వివేకానంద మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది 1వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 2వ తరగతిలో ఒకరు, 3లో ఇద్దరు, 4లో ఒకరు, 5లో ఒకరు ఉన్నారు. గత విద్యాసంవత్సరంలో ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండగా..ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య ఐదుకు చేరింది. గతంలో ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గింది... ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. -
పారా మెడికల్ కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు కరువు
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: పారా మెడికల్ కోర్సుకు అభ్యర్థులు కరువైపోతున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు సగం సీట్లకు కూడా దరఖాస్తులు రాలేదు. మరికొన్ని కోర్సులకైతే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో కౌన్సెలింగ్ ఎలా చేయాలా అని అధికారులు, నర్సిం గ్ కళాశాల యజమానులు తల పట్టుకుంటున్నారు. జిల్లాలో 13 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో వివిధ పారా మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వ సీట్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సీట్ల భర్తీకి మంగళవారం కౌ న్సిలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రభు త్వ సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులు కరువయ్యారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులతో పాటు కళాశాలల యజమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. సీట్ల వివరాలు డీఎంఎల్టీ కోర్సుకు సంబంధించి 100 సీట్లకు గాను కేవలం 31 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఎనస్తీషియా టెక్నీషియన్‌కు 10 సీట్లకు గాను 8 మంది, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్స్ 36 సీట్లకుగాను 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. డార్క్ రూం అసిస్టెంట్ 12 సీట్లకు ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈసీజీ టెక్నీషియన్‌కు కూడా పది సీట్లకు ఒక్క దరఖాస్తు వచ్చింది. అఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ 14కుగాను 7, ఆడియోమెట్రిక్ 30 సీట్లకుగాను 3 మాత్రమే వచ్చాయి. అప్టోమెట్రిక్ విభాగంలో 6 సీట్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా దరఖాస్తులు వచ్చిన వాటికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.