No waiting list
-
ఈ రూట్లలో నో వెయిటింగ్ లిస్టు
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్‌కతా మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు ఉండదని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ చెప్పారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సరుకు రావాణా కారిడార్లు (డీఎఫ్సీ) 2021 కల్లా పూర్తి కానున్న నేపథ్యంలో రైళ్ల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. రూ.2.6 లక్షల కోట్లతో నిర్మించనున్న డీఎఫ్‌సీల నిర్మాణం పూర్తయితే సరుకు రవాణా రైళ్లు ఈ మార్గాల్లో వెళ్తాయి. దీంతో రైళ్ల వేగం పెంచడంతోపాటు ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రైళ్లను నడపవచ్చాన్నారు. ఫలితంగా ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు ఉండదని పేర్కొన్నారు. రైళ్లలో నేరాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వినోద్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2022 మార్చి నాటికల్లా అన్ని రైల్వే స్టేషన్లు, బోగీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆందోళనల్లో రైల్వేకు వాటిల్లిన రూ.80 కోట్ల ఆస్తి నష్టాన్ని బాధ్యులైన వారి నుంచే వసూలు చేస్తామని వినోద్ యాదవ్ సోమవారం ప్రకటించారు. ఇందులో తూర్పు రైల్వేకు రూ.70 కోట్లు, ఈశాన్య రైల్వేకు రూ.10 కోట్ల నష్టం జరిగింది. -
నో వెయిటింగ్..కన్ఫర్మేషనేనా!
న్యూఢిల్లీ: బుక్ చేసుకున్న రైల్వే టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు రెట్టింపయ్యాయని రైల్ యాత్రి అనే ఓ ట్రావెల్ వెబ్సైట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2015 దీపావళి పండుగ రోజు 25.5 శాతం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు రద్దు కాగా, ఇది 2016 నాటికి 18 శాతానికి తగ్గిపోయింది. ఈ ఏడాది దీపావళి నాటికి ఇదే పరిస్థితి కొనసాగిందని దీనిబట్టి చూస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అయినట్లేనని పోర్టల్ తెలిపింది. డెహ్రడూన్–హౌరా డూన్ ఎక్స్‌ప్రెస్‌కు కన్ఫర్మేషన్ రేటు 20 శాతం మేర పెరిగింది. పుణె–జమ్మూ తావి జీలం ఎక్స్‌ప్రెస్ కు 12 శాతం, గయా మీదుగా వెళ్లే ముంబై సీఎస్టీ –హౌరా సూపర్ ఫాస్ట్ మెయిల్‌కు 11 శాతం కన్ఫర్మేషన్ రేటు పెరిగినట్లు వివరించింది. ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టడమే కారణమని తెలిపింది. -
ఆ రైళ్లలో నో వెయిటింగ్ లిస్ట్
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఇక వెయిటింగ్ లిస్టు కష్టాలు తప్పనున్నాయి. సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీకి రైల్వేశాఖ ఉద్వాసన పలికింది. ఇప్పటివరకూ... చాంతాడంత వెయిటింగ్ లిస్టు... చార్ట్ సన్నద్ధమయ్యే వరకూ ఉత్కంఠగా ఎదురుచూపు... చివరకు బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే చేసేది లేక ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే 'వికల్ప్' పథకాన్ని తొలిసారిగా అందుబాటులోకి తెస్తోంది. సువిధ రైళ్లలో కేవలం ఆర్ఏసీ టికెట్లను మాత్రమే ఇవ్వనుంది. ఈ విధానం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతోపాటు, తత్కాల్ టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులకు రీఫండ్ విషయంలో కూడా నిబంధనలను మార్పు చేసింది. అలాగే తత్కాల్ టికెట్లను రద్దు చేసుకునే ప్రయాణికులు కొత్త విధానం ద్వారా టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు. ఇంతకుముందు తత్కాల్ టికెట్లు రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి వచ్చేది కాదు. తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కొంతమేరకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక తత్కాల్ టికెట్ల జారీ సమయంలో కూడా రైల్వేశాఖ మార్పులు చేసింది. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కేవలం ఏసీ కోచ్ తత్కాల్ టికెట్లకు, స్లీపర్ కోచ్ అయితే 11 నుంచి 12 గంటల సమయంలో టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే వచ్చే నెల నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేయనుంది. ఈ రైళ్లలో పేపర్ లెస్ టికెట్ విధానం అమల్లోకి రానుంది. మొబైల్ టికెట్లను అనుమతించనుంది. అలాగే రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది.