ఆ రైళ్లలో నో వెయిటింగ్ లిస్ట్
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఇక వెయిటింగ్ లిస్టు కష్టాలు తప్పనున్నాయి. సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీకి రైల్వేశాఖ ఉద్వాసన పలికింది. ఇప్పటివరకూ... చాంతాడంత వెయిటింగ్ లిస్టు... చార్ట్ సన్నద్ధమయ్యే వరకూ ఉత్కంఠగా ఎదురుచూపు... చివరకు బెర్త్ కన్‌ఫర్మ్ కాకపోతే చేసేది లేక ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తోంది.
దీంతో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే 'వికల్ప్' పథకాన్ని తొలిసారిగా అందుబాటులోకి తెస్తోంది. సువిధ రైళ్లలో కేవలం ఆర్‌ఏసీ టికెట్లను మాత్రమే ఇవ్వనుంది. ఈ విధానం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతోపాటు, తత్కాల్ టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులకు రీఫండ్ విషయంలో కూడా నిబంధనలను మార్పు చేసింది.
అలాగే తత్కాల్ టికెట్లను రద్దు చేసుకునే ప్రయాణికులు కొత్త విధానం ద్వారా టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు. ఇంతకుముందు తత్కాల్ టికెట్లు రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి వచ్చేది కాదు. తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కొంతమేరకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక తత్కాల్ టికెట్ల జారీ సమయంలో కూడా రైల్వేశాఖ మార్పులు చేసింది.
ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కేవలం ఏసీ కోచ్ తత్కాల్ టికెట్లకు, స్లీపర్ కోచ్ అయితే 11 నుంచి 12 గంటల సమయంలో టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే వచ్చే నెల నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేయనుంది. ఈ రైళ్లలో పేపర్ లెస్ టికెట్ విధానం అమల్లోకి రానుంది. మొబైల్ టికెట్లను అనుమతించనుంది. అలాగే రైల్వే టికెట్ బుకింగ్ వెబ్సైట్ను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది.