ప్రసిద్ధ కథల్ని మళ్లీ చదవగలిగాను
ఇంతకు ముందు ఆలిస్ మన్రో కథల్నీ, కాఫ్కా కథల్నీ, ఆల్బర్ట్ కామూ ‘ద స్ట్రేంజర్’నూ అనువదించిన జి.లక్ష్మి ‘నవ్య’ కోసం అనువదించిన నోబెల్ గ్రహీతల కథల్ని ‘నోబెల్ కథలు’గా తెచ్చింది విశాలాంధ్ర. ఇందులో 20 కథలున్నాయి. వీటిల్లో ఏముందో జి.లక్ష్మి ఇలా చెబుతున్నారు:
అత్యవసర పరిస్థితిలో డైనింగ్ టేబుల్‌నే ఆపరేషన్ టేబుల్‌గా శస్త్రచికిత్స చేసి ఒక చిన్నపిల్ల ప్రాణాన్ని కాపాడిన డాక్టర్‌కి కృతజ్ఞతా సూచకంగా ముద్దుని బహుమానంగా ఇచ్చిన యువతిలోని మానవీయ కోణాన్ని ‘‘ఆపరేషన్’’(రోజర్ మార్టిన్ డుగార్డ్–ఫ్రెంచ్) చూపిస్తే, జీతాలు పెంచమని అడిగితే నిరాకరించి ఫ్యాక్టరీని మూసేసిన యజమానిపై కార్మికులు ప్రదర్శించిన ధర్మాగ్రహానికి ‘‘మౌనం’’(కామూ) అద్దం పడుతుంది. ఏకైక కుమారుడిని కళ్లముందే పోగొట్టుకున్న తండ్రి దుఃఖాన్ని ‘‘నాన్న’’(బ్యోర్న్సెన్–నార్వే), ఏకైక కుమారుడిని యుద్ధరంగానికి పంపించవలసి వచ్చిన తల్లిదండ్రుల విషాదాన్ని ‘‘యుద్ధం’’(పిరాండెల్లో– ఇటలీ) దృశ్యమానం చేస్తాయి.
ఆస్తి ఇవ్వని తండ్రిని సొంత కుమార్తె సైతం ఎంత నిర్దాక్షిణ్యంగా చూడగలదో ‘‘మరణం’’(రేమాంట్– పోలండ్) కళ్ళముందు ఉంచితే, ఊహ తెలియని వయసులో తనపై లైంగిక అత్యాచారానికి పాల్పడిన అధ్యాపకుడు వివాహం చేసుకుంటానని ఉదారత ప్రదర్శించినప్పుడు అతన్ని సున్నితంగా తిరస్కరించిన యువతి స్థిరచిత్తం నగీబ్ మహాఫౌజ్ ‘‘నిరాకరణ’’(ఈజిప్టు)లో అచ్చెరువు కలిగిస్తుంది.
వివాహ వ్యవస్థలోని బోలుతనానికి ‘‘జ్ఞానం’’(గోర్డిమర్–దక్షిణాఫ్రికా), ‘‘అలాన్ సెడార్– విర్గావే’’(సింక్లెయిర్ లూయిస్– అమెరికా), ‘‘నరకానికి వెళ్లే లిఫ్టు’’(క్విస్ట్–స్వీడన్), ‘‘గౌరి’’(టాగూర్) దర్పణం పడతాయి. ‘‘గొప్ప ఆనందాన్ని సొంతం చేసుకోవాలనే ఆశతో చాలామంది చిన్న చిన్న సంతోషాల్ని కోల్పోతుంటారు’’ అనే పెరల్ ఎస్.బక్నూ, ‘‘చెడు విషయంలో చూపించే సహనం నేరం అవుతుంది’’ అనే థామస్ మాన్నూ, ‘‘నేను అంటే నా రచనలన్నిటి మొత్తం’’ అనే వి.ఎస్.నైపాల్ లాంటి ప్రసిద్ధ రచయితల కథల్ని ఈ రూపంలో మళ్లీ చదవగలిగాను.