కెమెరాల్లేకుండానే నిఘా వ్యవస్థ..
ఇప్పుడు ఇంట్లో నిఘా కెమెరాల్లేకుండానే ఇంటికి భద్రత కల్పించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. మీ ఇంట్లో ఎవరు సంచరిస్తున్నారు అన్న విషయాన్ని ఓ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 'గ్జాండెమ్ హోమ్' పేరిట రానున్న ఈ కొత్త ఉత్పత్తి... ఇంట్లోని ప్రతి కదలికలనూ హ్యారీ పాటర్ మాయా మరుడర్స్ మ్యాప్ వంటి ఓ చిన్న డిజిటల్ పరికరంద్వారా గుర్తిస్తుంది.
కెమెరాలకు బదులుగా ప్లగ్ ఇన్ నోడ్స్ ను ఉపయోగించి ఓ సాలెగూడులా ఇంల్లంతా రేడియో తరంగాలు వ్యాపింపచేయడం వల్ల ఇంట్లోని ప్రతి కదలికనూ ఈ వ్యవస్థ శులభంగా గుర్తించగల్గుతుంది. ట్రెడిషనల్ మోషన్ డిటెక్షన్ సిస్టమ్ తో వచ్చే తప్పుడు అలారాలు, పరిమిత కవరేజ్ వంటి సమస్యలు పరిష్కరిస్తూ, ఇల్లంతా నిఘా వ్యవస్థను అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఈ వ్యవస్థను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మరియు హోం ల్యాండ్ సెక్యూరిటీ సంయుక్త ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి నిర్వహించిన పరిశోధనల అనంతరం ఉత్సత్తి చేశారు. ఇది ఇన్ స్టాల్ చేయడానికి కేవలం 15 నిమిషాల సమయం పడుతుంది.
10 నుంచి 15 నోడ్స్ ఉండే ఈ కిట్ ను... వాల్ సాకెట్ కు ప్లగ్ అమర్చుకునేలా రూపొందించారు. గేట్ వే ను రూటర్ కు పెట్టి... ఇల్లంతా గుర్తించగలిగేట్లుగా ముందుగా వినియోగదారులు ఓ మ్యాప్ ను యాప్ లో డ్రా చేయాలి. ఇలా చేసిన తర్వాత వ్యవస్థ ప్రారంభమౌతుంది. గూడులా ఉన్న ఇన్విజిబుల్ సెన్సార్ల ద్వారా ఇంట్లో రేడియో తరంగాలు ప్రసరిస్తాయి. అయితే ఎవరైనా ఈ గూడువంటి వ్యవస్థను కదిపితే మాత్రం రేడియో తరంగాలకు భంగం కలిగే అవకాశం ఉంది. అయితే ఇంట్లో ఒక్కసారి కదలికలను యాప్ గుర్తించగలిగిందంటే అవి డైరెక్ట్ గా మ్యాప్ లోని ఏ స్థానంలో జరుగుతోందో వినియోగదాలుల స్మార్ట్ ఫోన్ కు హెచ్చరికలు పంపిస్తుంది. లైట్లు, అలారం వంటి హెచ్చరికలతో వినియోగదారులు అవసరాన్ని బట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇది పూర్తిగా కొత్త ఉత్పత్తి కాదని, కేవలం కొత్త సాంకేతికతలు కలిగిన పరికరం అని... దీని వ్యవస్థాపకుడు సాల్ట్ లేక్ సిటీలో నివసించే 35 ఏళ్ళ జో విల్సన్ అంటున్నాడు. 'గ్జాండెమ్ హోమ్' తో ఇంట్లోకి చొరబడిన అపరిచిత వ్యక్తులను ఎటువంటి అనుమానం రాకుండా... శులభంగా గుర్తించవచ్చని చెప్తున్నాడు. రెండు సైజుల్లో దొరికే ఈ గ్జాండెమ్ హోమ్ కిట్ ను కొనుగోలు చేయాలనుకున్నవారు ఆన్ లైన్ (Indiegogo) ద్వారా ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు. సుమారుగా ముఫై వేల రూపాయలతోపాటు షిప్పింగ్ ఛార్జీలను ఆన్ లైన్ లో చెల్లించి బుక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేవలం పదిహేడు రోజుల్లో అనుకున్న టార్గెట్ కు అమ్మకాలు చేరాయని.. తమ ప్రచారం లక్ష్యాన్ని చేరుకుంటే 2016 ఆగస్టు నాటికి ఈ నిఘా పరికరం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు.