మరో వివాదాన్ని వెంటతీసుకెళ్లిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళితే వివాదాలు వెంట తీసుకెళతారేమో అనిపిస్తోంది. గతంలో అమెరికా పర్యటనలో లక్షల విలువైన కోటు ధరించి 'సూట్ బూట్' వివాదానికి తెర తీసిన మోదీ ప్రస్తుత పర్యటనలో మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈసారి మోదీ జాతీయ పతాకాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నారట. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆ పతాకంపై మోదీ సంతకం చేశారట. సంతకంతో కూడిన పతాకాన్ని మిషెలిన్ మాస్టర్ చెఫ్ వికాస్ వర్మకు అందచేసి బరాక్ ఒబామాకి చేర్చాల్సిన బాధ్యతను అప్పగించారు. అమెరికాలోని 40 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లకు మోదీ ఏర్పాటు చేసిన విందులో భారత వంటకాలను వడ్డించే బాధ్యత వికాస్ వర్మ చేపట్టారు.
మోదీ సంతకంతో కూడిన జాతీయ పతాకం ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ట్విట్టర్లో వివాదం మొదలైంది. భారత జాతీయ పతాకం ఐదవ నియమాన్ని మోదీ ఉల్లంఘించారని విమర్శలు వెల్లువెత్తాయి. అదే స్థాయిలో తప్పేముందని ప్రశ్నించిన వారూ ఉన్నారు. జాతీయ పతాకం నియమాలని మార్చాలని, సరళతరం చేయాలని కూడా సూచనలు వచ్చాయి. ఈ వివాదం ముదురుతోందని గమనించిన అధికారులు వికాస్ వర్మ నుండి జాతీయ పతాకాన్ని వెనక్కి తీసుకున్నారని సమాచారం. ఏదేమైనా మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక వివాదం మాత్రం ఖాయమన్నమాట.