గుంతల్లో తమ్ముళ్లు
అధికార పక్ష నేతలకు కురుస్తున్న కాసులు
కానరాని కొలతలు.. మెటీరియల్ వినియోగం
టెండర్లకు బదులు నామినేటెడ్ కాంట్రాక్టర్లు
ఇందుగలరందు లేరని సందేహము వలదు సోదరా! ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క పనిలోనూ తెలుగు తమ్ముళ్ల ప్రమేయం లేకుండా పోదు., కారణమేంటంటే ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలోనూ కాసులు మిగులుతుండడమే. నిన్న మొన్నటి వరకు వ్యక్తిగత మరుగు
దొడ్లలో వెనకేసుకున్న తమ్ముళ్లు ఇప్పుడు ఇంకుడుగుంతల్లో పడ్డారు. ప్రమాణాలకు పాతరేసి ఇంకుడు గుంతల తవ్వకాలు,
కప్పడాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పార్వతీపురం: విజయనగరంజిల్లాలోని పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి మున్సిపాల్టీలలో ఇంకుడు గుంతల ఏర్పాటులో టెండర్ల ద్వారా పనులు అప్పగించాల్సి ఉన్నప్పటికీ, ఆయా మున్సిపాల్టీలలో నిబంధనలకు వ్యతిరేకంగా అభిమాన కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించడంతో అధికార పార్టీ కౌన్సిలర్లు ఆ కాంట్రాక్టులు చేస్తున్నారు. నీటి వనరులు, బోరుబావుల వద్ద ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతను 20,40 ఎం.ఎం.పిక్కరాయితోపాటు ఇసుక వేసి, పైన ఇటుకలతో కట్టాల్సి ఉంది. అయితే పిక్కరాయి ధర అధికంగా ఉండడం, ఇసుక ఉచితంగా గుంతల్లో తమ్లుళ్లు రావడంతో, ఇలా గుంత తీసి, అలా కప్పేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా మున్సిపాల్టీలలో ఇంకుడు గుంతల దుస్థితి ఇలా ఉంది.
పార్వతీపురంలో నిబంధనలకు పాతర...
పార్వతీపురం మున్సిపాల్టీలో తొలి విడతగా 300 ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 86 ఇంకుడు గుంతలకు జియో ట్యాగింగ్ చేశారు. అయితే వీటి ఏర్పాటుకు ఉన్నతాధికారులు టెండర్ ద్వారా ఖరారు చేయాలని చెప్పినప్పటికీ, వాటిని తోసిరాజని నామినేషన్ పద్ధతిలో నచ్చిన ఇద్దరు కాంట్రాక్టర్లకు వీటి ఏర్పాటుకు కట్టబెట్టారు. కొన్ని ప్రాంతాలలో ఆయా ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ కౌన్సిలర్లే చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకుడు గుం తలకు సంబంధించి రెండున్నర, రెండున్నర, నాలుగు అడుగుల కొలతలతో... 40 ఎం.ఎం.పిక్క రాయి రెండు అడుగులు, 20 ఎం.ఎం.పిక్క రాయి ఒక అడుగుతో పాటు ఇసుక వేసి, ఇంకుడు గుంతపై ఇటుకలతో కట్టడాలు చేపట్టాలి.
అయితే ఆయా ప్రమాణాలతో...మున్సిపాల్టీలో ఇంకుడు గుంతల ఏర్పాటు జరగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక ఉచితంగా రావడంతో ఆయా గోతుల్లో అధికంగా పోస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 300 ఇంకుడు గుంతలకు రూ.7లక్షలు మంజూరు కాగా, వీటిలో ఒక్కింటికి రూ.2,300వరకు పడుతోంది. ఇంకుడు గుంతల ఏర్పాటులో భారీగా మిగులుతుండడంతో స్థానిక నేతలు వీటి ఏర్పాటుకు పరుగులు తీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్ని మెజర్మెంట్లు తీసుకున్నారు. ఏదేది ఎంత వేశారో... కూడా అధికారుల వద్ద లెక్కలు లేని దుస్థితి నెలకొంది.
విజయనగరంలో... : జిల్లా కేంద్రం విజయనగరంలో 3, 640 ఇంకుడుగుంతలు టార్గెట్ కాగా, వాటి నిర్మాణాలను ఓ అభిమాన సంస్థకు అప్పగించారు. ఇక్కడ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఇంకుడు గుంతల ఏర్పాటు జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాలూరులో... : సాలూరు మున్సిపాల్టీలో 58 ఇంకుడు గుంతలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 18 ఇంకుడు గుంతలు పూర్తి చేశారు. ఇవి కూడా ఓ అభిమాన కాంట్రాక్టర్కు అప్పగించారు. వీటి పనుల్లో కూడా ఇష్టానుసారం చేసుకుపోతూ నిబంధనలకు పాతర వేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బొబ్బిలిలో... : బొబ్బిలిలో ఇంకుడు గుంతల తవ్వకాలు దాదాపు పూర్తయ్యాక, టెండర్లు పిలిచారు. 100 ఇంకుడు గుంతల నిర్మాణం టార్గెట్ కాగా, 40 వరకు పూర్తయ్యాయి. టెండరు ద్వారా ఇచ్చిన వాటికి రూ.5,500 లోపు చెల్లింపులు చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఇంకుడు గుంతల్లో జరుగుతున్న అవకతవకలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారిస్తే..అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులంటున్నారు.