అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్ నామినేషన్
వాషింగ్టన్: నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రాటిక్ పార్టీ జో బిడెన్ను తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఇది జో బిడెన్ రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. బిడెన్ గతంలో రెండు సార్లు అధ్యక్ష పదవికి తలపడ్డారు. డెమోక్రాటిక్ తరఫున తనను అధ్యక్ష పదివికి నామినేట్ చేసినందుకు బిడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ‘డెమోక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి నన్ను నామినేట్ చేయడం నా జీవితానికి లభించిన అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నాను’ అంటూ బిడెన్ ట్వీట్ చేశారు. ‘మీ అందరికి ధన్యవాదాలు. ఈ ప్రపంచం నాకు, నా కుటుంబానికి మద్దతుగా ఉందని విశ్వసిస్తున్నాను’ అని తెలిపారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్సీ) రెండవ రోజు ఈ కార్యక్రమం జరిగింది. (డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్కు మేలు)
It is the honor of my life to accept the Democratic Party's nomination for President of the United States of America. #DemConvention
— Joe Biden (@JoeBiden) August 19, 2020
ఇక బిడెన్ అభ్యర్థిత్వాన్ని సమర్థించిన వారిలో గత, ప్రస్తుత డెమోక్రాటిక్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు. ‘లీడర్షిప్ మ్యాటర్స్’ థీమ్తో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ రిపబ్లికన్ స్టేట్ సెక్రటరీ కోలిన్ పావెల్, మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(95)లు హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికలకు కేవలం 77 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ రెండున్నర నెలల కాలం బిడెన్ భవిష్యత్తుని నిర్ణయించనుంది. స్వదేశం, విదేశాలలో ట్రంప్ సృష్టించిన గందరగోళాన్ని సరిచేయగల శక్తి, అనుభవం బిడెన్ సొంతమంటున్నారు డెమోక్రాట్లు.