ఏడాదైనా మానని గాయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సరిగ్గా ఏడాది క్రితం (అక్టోబర్ 12న) హుద్‌హుద్ పెను తుపాను ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించింది. 61 మంది మృత్యువాత పడ్డారు. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2.30 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. విద్యుత్, సమాచార వ్యవస్థ కకావికలమైంది. 87,228 కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విశాఖ నగరం సహా మూడు జిల్లాల్లోని దాదాపు అన్ని గ్రామాలను అంధకారం ఆవరించింది. ఒక్క విశాఖ నగరంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకే 10 రోజుల వరకు సమయం పట్టింది.
ఇక గ్రామాలకైతే కొన్ని వారాలు, వ్యవసాయ విద్యుత్ పునరుద్ధరణకు ఆరేడు నెలలు సమయం పట్టింది. 4 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.23,000 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. మరుసటి రోజు విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి సమీక్షలు మీద సమీక్షలు నిర్వహించారు. అందరినీ ఆదుకుంటామన్నారు. ఇంతకంటే పెద్ద తుపానులు సంభవించినా తట్టుకునేలా వ్యవస్థలను తీర్చిదిద్దుతామన్నారు.
విశాఖ నగరంలో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పక్కా ఇళ్లు, మత్స్యకారులకు మోడల్ కాలనీలు నిర్మిస్తామన్నారు. వారం రోజుల తర్వాత ‘హుద్‌హుద్ తుపానును జయించాం..’ అని చంద్రబాబు ప్రకటించారు. కానీ కంటితుడుపు చర్యలు తప్ప ఏడాది గడిచినా ఏ ఒక్క హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. దాతలు విరాళాలుగా అందించిన రూ.200 కోట్లలో ఒక్క రూపాయికి కూడా ప్రభుత్వం లెక్క చెప్పలేదు.
అన్నదాత ఆక్రందన పట్టని ప్రభుత్వం
తుపానుతో 2,39,781మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ.2,300 కోట్ల పంట నష్టం వాటిల్లింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ.209 కోట్లు అవసరమని ప్రభుత్వమే లెక్కగట్టింది. కానీ ఇంతవరకు కేవలం రూ. 5.20 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకొంది. చెరువులు, కాలువలు వంటి 1,020 సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు రూ.59.81 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిధులు మాత్రం విడుదల చేయలేదు. కాంట్రాక్టర్లతో రూ. 7.76 కోట్ల మేర పనులు మొదలుపెట్టినా.. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆ పనులు నిలిపివేశారు.
కొత్త ఇళ్లు హుళక్కే
ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైనవారికి ప్రభుత్వం ఇంతవరకు పూర్తి పరిహారం చెల్లించలేదు. 4 లక్షలకుపైగా ఇళ్లు దెబ్బతినగా 49,366 గుడిసెలు కూలిపోయాయి. మొత్తం రూ 3,236.32 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. పూర్తిగా కూలిపోయిన ఇంటికి రూ.50 వేలు, తీవ్రంగా దెబ్బతిన్నవాటికి రూ.15 వేలు, పాక్షికంగా దెబ్బతిన్నవాటికి రూ.5 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించింది. రూ.100 కోట్లు మాత్రమే పరిహారంగా అందించి చేతులు దులుపుకుంది.
తక్షణ సాయంగా ఇస్తామన్న రూ.10 వేలు కూడా కొందరికే ఇచ్చి సరిపెట్టింది. మత్స్యకార కుటుంబానికి రూ.15 వేలు ఇస్తామన్నా ఒక్కరికీ సాయం అందలేదు. ఐఏవై పథకం కింద 12 వేల ఇళ్లు, కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహకారంతో 10 వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేసినా ఒక్క ఐఏవై ఇంటి నిర్మాణం కూడా చేపట్ట లేదు. కార్పొరేట్ సంస్థల నిధులతో కేవలం 2,326 ఇళ్ల నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు.
ఇంకా కష్టాల కడలిలోనే...
కకావికలైన మత్స్యకార కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. అప్పట్లో 4,441 పడవలకు నష్టం వాటిల్లింది. దాదాపు 10 వేల తెప్పలు కొట్టుకుపోయాయి. మొత్తం రూ.98.29కోట్లు నష్టం వాటిల్లింది. పూర్తిగా దెబ్బతిన్న బోట్లకు రూ.5లక్షలు, తీవ్రంగా దెబ్బతిన్నవాటికి రూ.3 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్నవాటికి రూ.1.50 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. తెప్పలకు రూ.50 వేలు చొప్పున సహాయం అందిస్తామని తెలిపింది. కానీ పడవలకు పరిహారం కోసం కేవలం రూ.14 కోట్లు మంజూరు చేసి అందులో కూడా రూ.6.95 కోట్లే పంపిణీ చేసింది.
విద్యుత్‌కు పైసా ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ నేపథ్యంలో.. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకు రూ. 10 వేల కోట్లు అవసరమని ఇంధనశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తుపాను తాకిడికి అనేక ట్రాన్స్మిషన్ టవర్లు దెబ్బతిన్నాయి. 7,567 కిలోమీటర్ల మేర హెటీ లైన్ దెబ్బతిన్నది. 8,303 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తం రూ.1,290 కోట్ల మేర నష్ట వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్కపైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ట్రాన్స్ఫార్మర్లు అవసరంకాగా ప్రస్తుతం 4 వేలకు మించి లేవు. విశాఖలో భూగర్భ కేబులింగ్ వ్యవస్థ, ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా మెరుగుకు ప్రపంచబ్యాంకు రూ. 720 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ఆదివారం చెప్పారు. వైపరీత్యాల సమయంలోనూ నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ.10 వేల కోట్లు అవసరమని ప్రతిపాదించినట్టు తెలిపారు.