north states
-
వర్షాల ఎఫెక్ట్.. సరుకు రవాణా బంద్.. తమిళనాడులో నిలిచిపోయిన 75వేల ట్రక్కులు
చెన్నై: ఉత్తరభారత దేశంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వానల ధాటికి కాలువలు, వాగులు వంకలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వీటితో పాటు సరుకు రవాణా కూడా బంద్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వేలాది ట్రక్కులు తమిళనాడులో నిలిచిపోయాయి. ఈ ట్రక్కులలో కొబ్బరికాయలు, సజ్జలు, స్టార్చ్, ఆరోగ్య సంరక్షణ మందులలో పదార్థాలుగా ఉపయోగించే ముడి పదార్థాలు, అగ్గిపెట్టెలు, క్రాకర్లు, వస్త్రాలు ఉక్కు మరియు ఇనుము పదార్థాలు వంటివి లోడ్లతో కూడిన 75 వేలకుపైగా ట్రక్కుల సరుకుని ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ట్రక్కులన్నీ తమిళనాడులోని వివిధ పట్టణాలు, నగరాల్లో ఆగిపోయాయి. ఇవి ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లకు చేరుకోవాల్సి ఉంది. మరోవైపు తమిళనాడుకు రావాల్సిన 25,000కు పైగా ట్రక్కులు ఉత్తరాది రాష్ట్రాల్లో నిలిచిపోయినట్లు లారీ ఓనర్స్ ఫెడరేషన్-తమిళనాడు అధ్యక్షుడు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత, ప్రయాణానికి అనుకూలంగా మారిన తర్వాతే తమిళనాడు నుంచి లారీలు బయలుదేరుతాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల వస్తువులను ఆర్డర్ పెట్టిన కంపెనీలు, ట్రక్ కంపెనీలతో పాటు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చదవండి: ఇకపై కేదార్నాథ్ ఆలయంలో పిచ్చి పనులు చేస్తే జైలుకే.. -
'ఉత్తరాదిలో జెండా పాతేస్తాం.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..'
చండీగఢ్: హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెప్పారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు దక్షిణాది కంటే హిందీ రాష్ట్రాల్లోనే విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. హరియాణాలో జోడో యాత్రలో భాగంగా ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈమేరకు మాట్లాడారు. 'కేరళలో భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు విశేష స్పందన వచ్చింది. కానీ బీజేపీ పాలిత కర్ణాటకలో ఆదరణ ఉండదని అన్నారు. కానీ కన్నడ నాట ఇంకా ఎక్కువ మంది యాత్రకు తరలివచ్చారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టినప్పుడు అక్కడ యాత్ర ఫెయిల్ అవుతుందని అన్నారు. కానీ జనం ఇంకా భారీగా తరలివచ్చారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో యాత్రను ఆదరించరని అన్నారు. కానీ దక్షిణాది కంటే ఎక్కువ ఆదరణ ఇక్కడే లభిస్తోంది. ఈసారి కచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. యూపీ, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు' అని రాహుల్ అన్నారు. అలాగే తన గురించి బీజేపీ పట్టించుకుంటుందని, తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. తాను మాత్రం అసలు బీజేపీని పట్టించుకోనని స్పష్టం చేశారు. మన పని మనం చేసుకుంటే పోతే ఫలితం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భగవత్గీత శ్లోకాన్ని గుర్తు చేశారు. అర్జునుడు చేప కంటికి గురిపెట్టిన తర్వాత ఏం చేయబోతున్నాడో చెప్పలేదని పేర్కొన్నారు. బీజేపీ దేశాన్ని విద్వేషం, మతం ప్రాదిపదికన విడదీస్తోందని, కాంగ్రెస్ చరిత్రలో ఎనాడూ ఇలా చేయలేదని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించి దేశాన్ని ఏకం చేయడానికే తాను భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ మరోమారు స్పష్టం చేశారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో ప్రత్యేక అతిథి.. ల్యూనా ఫొటోలు వైరల్.. -
ఉద్దానం స్కందఫలం.. ఉత్తరాదికి వరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానపు ప్రాంత ఉద్యాన పంటలకు అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ లభిస్తుంటుంది. అద్భుతమైన రుచితో పండే ఇక్కడి ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ ఎక్కువ. ముఖ్యంగా సీజనల్‌గా పండే పనస (స్కంద) పంట ఉత్తరాది ప్రాంతాలకు సైతం ఎగుమతి అవుతూ రైతుకు సిరులు కురిపిస్తోంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో పూతకు వచ్చే ఈ పంట ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి మధ్య నుంచే కాయలు దిగుబడి రావడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. పనసకాయలతో పకోడి.. పండుగలు.. సాధారణ రోజుల్లోనూ పనసకాయలతో చేసే పకోడిని ఇష్టంగా ఆరగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పనసతో పచ్చళ్లు, కూరలు, గూనచారు తయారు చేస్తారు. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు రోజుకు 40 టన్నుల వరకు పనసకాయలు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కేజీ పనసకాయ రూ.20 నుంచి రూ. 25 వరకు ధర పలుకుతోంది. మే నెల వరకు భారీ ఎగుమతులు జరుగుతాయి. తిత్లీ తుఫాన్ సమయంలో పనస చెట్లు విరిగిపోవడంతో నాలుగేళ్లుగా అంతంతమాత్రంగానే దిగుబడి వచ్చింది. జిల్లాలో సుమారు 25 వేల హెక్టార్లలో పనసకాయలు పండిస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, నందిగాం తదితర మండలాల్లో వీటి సాగు ఎక్కువ. వివిధ వంటకాలు.. పనస ముక్కల బిర్యానీ, పొట్టు కూర, హల్వా, పొట్టు పకోడీ, గింజల కూర, గూనచారు, కుర్మా, ఇడ్లీ, పచ్చళ్లు, బూరెలు వంటి విభిన్న రకాల ఆహార పదార్థాలు పనసకాయలతో చేస్తారు. ఆదాయం ఘనం.. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో పనసకాయల దిగుబడి ఎక్కువ. ఒక్కోచెట్టు నుంచి ఏడాదికి రూ. 800 నుంచి రూ.1500 వరకు ఆదాయం వస్తుంది. కేవలం పొలంగట్లపై చెట్లు వేసుకుంటేనే ఏడాదికి రూ.10 వేల వరకు ఆదాయం సంపాదించవచ్చు. – జె.సునీత, ఉద్యానవన అధికారి, పలాస -
బహుముఖ పోటీలో బీజేపీకే మొగ్గు
పెద్ద రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు చిన్న రాష్ట్రాల కథనాలు విస్మరణకు గురయ్యే అవకాశం ఉంది. అలాగని అక్కడి పోరేమీ తక్కువ రసాత్మకం కాదు. మణిపూర్, గోవా శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి మామూలు కంటే ఎక్కువ పార్టీలు బరిలో ఉన్నాయి. సహజంగానే అన్నీ తమ గెలుపు పట్ల ధీమాగా ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వాటి విజయావకాశాలను ప్రభావితం చేయగలిగే అంశాలు ఎన్నో. 5 రాష్ట్రాల ఎన్నిక లను విశ్లేషిస్తూ ఢిల్లీకి చెందిన ప్రతిష్ఠాత్మక సీఎస్డీఎస్, ‘సాక్షి’కి ప్రత్యేకంగా రాస్తున్న వ్యాస పరంపరలో ఇది మొదటిది. కోవిడ్ మహమ్మారి మూడోసారి విరుచుకు పడుతున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం... ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ పార్టీలూ, నేతలూ ఎన్నికల సంఘం నిర్ణయన్ని స్వాగతించినా ఇత రులు మాత్రం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారని విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం తీరు రోమ్ తగలబడుతూంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల సంఘం... ఎనభై ఏళ్ల పైబడ్డ వారికి, కోవిడ్ బాధితులు, దివ్యాంగు లకు పోస్టల్ బ్యాలెట్ల వంటి సౌకర్యాలు కొన్ని ఏర్పాటు చేసి... బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలు, ప్రదర్శనలు, పాదయాత్రలకు మాత్రం విస్పష్టంగా నో చెప్పింది. ఓటింగ్ జరిగే సమయాన్ని ఒక గంట పొడిగించి, పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ సంబంధిత రక్షణ చర్యలన్నింటినీ తప్పనిసరి చేసింది. ఈ చర్యలన్నీ చదివేందుకు, ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో చూసుకునేందుకు బాగానే ఉంటాయి కానీ... వాస్తవ పరిస్థితుల్లో వీటి అమలు మాత్రం చాలా కష్టం. కోవిడ్ కేసుల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసి ఉండే బాగుండేది. కానీ హడావుడిగా ప్రకటించడం ఎన్నికల సంఘం కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతోందనేందుకు నిదర్శనం. తాజా ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మీడియా దృష్టి మొత్తం ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లపైనే కేంద్రీకృతమై ఉంది. మిగిలిన మూడు రాష్ట్రాల వివరాలూ, విశ్లేషణలూ తక్కువగానే అందుతున్నాయి. వివక్షకు తావు లేకుండా... అందరి సమాచారాన్ని ఇచ్చే విషయాన్ని కార్పొరేట్ మీడియా ఎప్పుడో మరచిపోయింది. వీటన్నింటి కార ణంగా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సవ్యంగా జరుగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో మణిపూర్, గోవాల పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి విశ్లేషించి చూడాలి. సంక్లిష్ట ముఖచిత్రం... మణిపూర్ అరవై అసెంబ్లీ సీట్లున్న ఈ ఈశాన్య రాష్ట్రంలో పోటీ బహుముఖం. బీజేపీ, కాంగ్రెస్ కూటమి, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఎఫ్), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీపీ)లకు కొన్ని సీట్లలో చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. బీజేపీ సొంతంగా పోటీ చేస్తూండగా, కేంద్రంలో ఎన్డీయే భాగస్వాములైన ఎన్పీఎఫ్, ఎన్పీపీలు రాష్ట్రంలో విడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, జేడీ (ఎస్)లతో కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసు కుంది. మణిపూర్ రాజకీయ ముఖచిత్రం, చరిత్ర చాలా సంక్లిష్ట మైందే. పార్టీలు, భౌగోళిక ప్రాంతాలవారీగా విడిపోయి ఉంటాయి. మొత్తం అరవై అసెంబ్లీ సీట్లలో నలభై వరకూ ఇంఫాల్ లోయ ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ మెయిటీ వర్గపు ఆధిపత్యం ఎక్కువ. నాగాలు, కుకీల ప్రాబల్యమున్న పర్వత ప్రాంతాల్లో 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 28 స్థానాలు దక్కించుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా... ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా బీజేపీ 21 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య మంత్రి ఓఖ్రామ్ ఐబోబి 15 ఏళ్ల అధికారానికి తెరపడింది. బీరేన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ... ఎన్పీపీ, ఎన్పీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి, ఒక స్వతంత్ర అభ్యర్థుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా కనీసం 40 స్థానాలను గెలుచుకుని అధికారం లోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉంది. సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందివ్వడం మాత్రమే కాకుండా... రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, ఇన్నర్ లైన్ పర్మిట్ వ్యవస్థ అమలు ద్వారా ప్రజల నమ్మకం పొందడం ఇందుకు కారణాలుగా చూపుతోంది. మణిపూర్ రాష్ట్రంలోకి వచ్చేం దుకు ఇతర రాష్ట్రాల వారు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రజల చిరకాల డిమాండ్. దీనికి తోడు... ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే రాష్ట్రంలో దాదాపు ఐదు వేల కోట్ల రూపా యలతో 21 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం కూడా తమకు కలిసివస్తుందని బీజేపీ నమ్ముతోంది. అయితే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన తమను ఎస్టీల్లో చేర్చాలన్న మెయిటీల డిమాండ్‌పై ఏకాభిప్రాయం సాధించడంలో బీజేపీ విఫలమైంది. అలాగే మణిపూర్ (హిల్ ఏరియాస్) అటానమస్ డిస్ట్రిక్ కౌన్సిల్స్ బిల్ 2021 ఆమోదం పొందకపోవడమూ... రాష్ట్రంలోని పర్వతప్రాంత ప్రజలు, ఇతరుల మధ్య విభేదాలకు కారణమవుతోంది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు ఎక్కువ కావడంతో అందరినీ సర్దుబాటు చేసే అవకాశాలు తగ్గిపోయాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన 11 మంది ఎమ్మెల్యేలకు, ఇద్దరు టీఎంసీ, ఎల్జేపీ మాజీలకు మళ్లీ అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం సొంతపార్టీ నేతలు, కార్యకర్తల అసంతృప్తికి కారణమవుతోంది. ఈ అంశాలన్నీ ఫిబ్రవరి 14 నాటి ఎన్నికల్లో బీజేపీ మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. బీజేపీ అవకాశాలకు గండికొట్టగల ఇంకో కారణం... రాష్ట్రంలో రాజుకుంటున్న ప్రాంతీయ విద్వేషాలు. 2017లో తొమ్మిది సీట్లలో పోటీ చేసిన ఎన్పీపీ, వాటిల్లో నాలుగు గెలుచుకోగలిగింది. ఇప్పుడు ఆ పార్టీ 40 సీట్లకు పోటీ చేస్తోంది. ఎన్పీఎఫ్ గత ఎన్నికల్లో నాగాల ఆధిపత్యం ఉన్న 11 స్థానాల్లో పోటీ చేసి నాలుగింటిలో విజయం సాధించింది. చివరగా చొరబాటుదారులు చురాచెండ్పూర్లో జరిపిన దాడి నేపథ్యంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) యాక్ట్‌తో కల్లోలిత ప్రాంత స్థాయిని కొనసాగించడమూ అధికార పార్టీకి కలిసివచ్చే అంశం కాదు. కుకీ పీపుల్స్ అలయన్స్ పేరుతో ఏర్పడ్డ కొత్త పార్టీ కనీసం తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఓట్లను చీల్చగలదని అంచనా. పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతానికి బీజేపీకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, అవకాశ వాద రాజ కీయాలకు ప్రాధాన్యం లభించే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం అంత సులువేమీ కాదు. గోవాలోనూ బహుముఖమే... గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈసారి ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)ల కూటమి మాత్రమే కాదు... మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), తృణమూల్ కాంగ్రెస్‌ల కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కూడా ఉండటంతో పోటీ బహుముఖంగానే ఉండనుంది. గత ఎన్నికల్లో (2017) భార తీయ జనతా పార్టీ మొత్తం నలభై స్థానాల్లో 13 మాత్రమే గెలుచు కున్నా... ఓట్ షేర్ మాత్రం 32 శాతం దాకా సంపాదించగలిగింది. మరోవైపు కాంగ్రెస్ 28 శాతం ఓట్ షేర్‌తో 17 స్థానాల్లో విజయం సాధిం చింది. కాకపోతే మణిపూర్‌లో మాది రిగానే నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్‌లో జరిగిన ఆలస్యం కాస్తా కాషాయపార్టీకి వరంగా మారింది. బీజేపీ వేసిన రాజకీయ ఎత్తులకు చిల్తై అధికారానికి దూరం కావడమే కాకుండా... ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలను కోల్పోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు తృణమూల్ వైపునకూ మొగ్గిపోవడం గమనార్హం.ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోలేదన్న విమర్శను ఎదుర్కొంటోంది. ఉక్కు మైనింగ్‌ను మళ్లీ ప్రారంభిస్తామన్న బీజేపీ హామీ నెరవేరలేదు. ఈసారి గెలిస్తే... రాష్ట్ర ప్రభుత్వపు సంస్థ ద్వారా మళ్లీ ప్రారంభిస్తామని బీజేపీ చెబుతోంది. దీంతోపాటు మొల్లెం అటవీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పర్యావరణ సమతౌల్య పరిరక్షణ, కోవిడ్ నిర్వహణ, మాధే నది నీటిని కర్ణాటకతో పంచుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ధరల పెరుగుదల వంటి అనేక అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా నిలుస్తున్నాయి! ప్రాంతీయ పార్టీల మద్దతు కోల్పోయిన బీజేపీకి క్రిస్టియన్ (25 శాతం) ఓటర్లతోనూ పెద్దగా సంబంధాలు లేవు. పార్టీలకు అతీతంగా ఓటర్లను ఏకం చేయగల కరిష్మా ఉన్న కేంద్ర మాజీ రక్షణశాఖ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి మనో హర్ పారిక్కర్ లాంటి నేతలు లేకపోవడం బీజేపీ మళ్లీ గద్దెనెక్కేందుకు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత, చర్చిలు, సామాజిక కార్యకర్తలపై పెరుగుతున్న దాడులు, పౌర చట్టానికి సవరణలు, ఎన్ఆర్సీ తదితర అంశాలూ బీజేపీకి ఇబ్బందికరమైన అంశాలే. వీటన్నింటికీ తోడుగా ఈసారి ఎన్నికల్లో కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ బరిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలూ బీజేపీ మద్దతుదార్ల ఓటర్లను చీల్చే అవకాశం ఉంది. ఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూపుతూ ఆమ్ ఆద్మీ పార్టీ తమకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తోంది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన అనుభవజ్ఞుల సాయంతో తమకూ కొన్ని సీట్లు రాగలవన్న ఆశతో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. అయితే... గోవాలో బీజేపీకి ఊరటనిచ్చే ఒక అంశం ఉంది. ఇక్కడ రాజకీయాలు వ్యక్తులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాయి, పార్టీలపై కాదు. గెలుపోటముల మధ్య తేడా కూడా చాలా స్వల్పం. చిన్న చిన్న నియోజకవర్గాల కారణంగా కొన్ని వేల ఓట్లతో విజయం కాస్తా అపజయంగా మారిపోగలదు. బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో జరిగే ఓట్ల చీలిక బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. 2017లో గెలిచిన 24 మంది పార్టీలు ఫిరాయించడం వల్ల గోవా ప్రజలకు నేతలపై ఉన్న నమ్మకమూ సన్నగిల్లింది. ఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సి వస్తే మాత్రం ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. మొత్తమ్మీద గోవా, మణిపూర్ రాజకీయాల్లో ఈసారి కూడా ఫిరాయింపులు తమదైన పాత్ర పోషిస్తాయా లేదా అన్నది చూడాలి. ఒపీనియన్ పోల్స్ ప్రకారం బీజేపీకి మణిపూర్‌లో కొంత మొగ్గు ఉన్నట్లు కనిపిస్తోంది. గోవాలో మాత్రం వెనుకబడి ఉంది. కానీ, ఈ పరిస్థితి మారేందుకు ఎక్కువ సమయమేమీ పట్టకపోవచ్చు. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
వారితో ఇక పనిలే.. సొంతంగా మేమే ముంచుతాం!
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు ఉత్తరాదిలో స్థిరపడిన నైజీరియన్లు మాత్రమే చేసే సైబర్ నేరాలను ఇప్పుడు అక్కడి స్థానికులే చేస్తున్నారు. గతంలో నైజీరియన్లకు సహకరించిన వీళ్లే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతతో కలిసి పంజా విసురుతున్నారు. ఇటీవల కాలంలో నమోదవుతున్న కేసులు, చిక్కుతున్న నేరగాళ్ల వివరాలు విశ్లేషించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అంచనాకు వస్తున్నారు. గతంలో ప్రతి 100 సైబర్ నేరాలకు 80 కేసుల్లో నైజీరియన్లు సూత్రధారులుగా ఉండే వాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య 10కి కూడా ఉండటం లేదని అధికారులు అంటున్నారు. ► సైబర్ నేరాలు చేయడంలో నైజీరియన్లు దిట్టలు. ఉత్తరాదిలోని అనేక నగరాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకున్న వీరు అమాయకులకు ఎర వేసే వారు. ఎక్కడా నేరుగా కనిపించని వీరికి తమ వల్లో పడిన వారి నుంచి డబ్బు డిపాజిట్, ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి బ్యాంకు ఖాతాలు అవసరం. ► వీరే నేరుగా బ్యాంక్ అకౌంట్ తెరిస్తే బ్యాంకు అధికారులు అనుమానించే, కేసు నమోదై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైతే చిక్కే ప్రమాదం ఉంది. దీంతో వివిధ నగరాల్లో ఉండే నిరుద్యోగులను ఆకర్షించి వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించి వాడుకునే వారు. ► దీని నిమిత్తం వారికి కొంత కమీషన్ ముట్ట చెప్పేవారు. ఇలా సైబర్ నేరాల కోసం తమ బ్యాంకు ఖాతాలు అందించే వారిని సాంకేతికంగా మనీమ్యూల్స్ అంటారు. మనీమ్యూల్స్‌గా మారిన వారు తమ ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్మును వివిధ మార్గాల్లో డ్రా చేసేవారు. ► తమకు రావాల్సిన కమీషన్ మినహాయించుకుని మిగిలింది నైజీరియన్లకు అప్పగించే వారు. ఇలా కొన్నాళ్ల పాటు మనీమ్యూల్స్‌గా పని చేసిన వీరికి నైజీరియన్లు చేస్తున్న మోసాల్లో ఎంత ‘లాభం’ వస్తున్నదనేది అర్ధమైంది. దీంతో అనేక మంది ఉత్తరాదికి చెందిన వారు తామే సొంతంగా సైబర్ నేరాలు చేయడం ప్రారంభించారు. ► నైజీరియన్ల మాదిరిగానే వివిధ మార్గాల్లో వినియోగదారుల డేటాలు సంగ్రహించి రకరకాలుగా ఎరవేసి అందినకాడికి దండుకుంటున్నారు. వీళ్లు మనీమ్యూల్స్‌గా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని వినియోగించుకుంటున్నారు. ► ఇటీవల కాలంలో క్రెడిట్/డెబిట్ కార్డుల అప్‌గ్రెడేషన్, సమస్యల పరిష్కారమంటూ ఎర వేసి మోసాలు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఈ సైబర్ నేరగాళ్లకు వినియోగదారుల డేటా కొన్ని కాల్ సెంటర్ల నుంచి లీక్ అవుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ► ఈ తరహాలో ‘బ్యాంకు కాల్స్’ పేరుతో రెచ్చిపోతున్న ఉదంతాలు ఇటీవల కాలంలో పెరిగాయి. ఈ నేరగాళ్లలో కొందరు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మధ్యలో ఉన్న జమ్‌తార కేంద్రంగా దందాలు సాగిస్తున్నారు. కాగా, వీరి వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల కాల్ సెంటర్లను వివిధ బీపీఓ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పని చేసే కొందరు ఉద్యోగులు ఈ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. తమకు కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల సమాచారంతో పాటు ఫోన్ నంబర్ల డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా వీళ్లు ఫోన్లు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ( చదవండి: మే 2 నుంచి లాక్డౌన్ ఉంటుందా అంటూ బెట్టింగ్‌లు! ) -
ఉత్తరాదిని పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశంలో నానాటికి పెరుగుతున్న జనాభానే పెద్ద సమస్యనే విషయం పాఠశాలకు వెళ్లే ప్రతి పిల్లవాడితో సహా ప్రతి పౌరుడికి తెల్సిందే. అందుకనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1952లో కుటుంబ నియంత్రణను అమల్లోకి తెచ్చిన దేశంగా భారత్‌కు గుర్తింపు వచ్చింది. మరో ఆరేళ్లలో మరో గుర్తింపు రానుంది. ప్రస్తుతం 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశం 2024 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమిస్తుందన్నదే ఆ రికార్డు. 1950లో చైనా జనాభా మనకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేదంటే ఇప్పుడు ఎంత వేగంగా జనాభాలో ముందుకు దూసుకుపోతున్నామో గ్రహించవచ్చు. జనాభా పెరుగుదలకు సామాజిక ఆర్థిక పరిస్థితులకు విడదీయలేని అనుబంధం ఉంటుందనే విషయం తెల్సిందే. అంటే జనాభా ఎక్కువ ఉంటే సామాజిక ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, తక్కువ ఉంటే తక్కువ ఉంటాయని అర్థం. ఎక్కడైనా ఇది నిజమేగానీ మన రాష్ట్రాల విషయంలో మాత్రం ఇది పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి ఎక్కువ. మరణాలు తక్కువ. దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి తక్కువ మరణాలు ఎక్కువ. అంటే ఉత్తరాదిలో జనాభా ఎక్కువగా పెరుగుతోంది. దక్షిణాదిలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటోంది. మన దేశంలో రాష్ట్రాల నుంచి పన్ను వసూళ్లు ఆర్థిక ప్రగతిపై ఆధారపడి ఎక్కువ, తక్కువగా ఉంటే, ఆర్థిక వనరుల పంపకాలు మాత్రం జనాభా ప్రాతిపదికన జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడి ఉత్తరాది రాష్ట్రాలు బతుకుతున్నాయి. కేంద్రం చెప్పిన లెక్కలే ఇవి కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం బిహార్‌లో సంతానోత్పత్తి రేటు 3.41 శాతం ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 2.74 శాతం ఉంది. అంటే భారత్‌లోని మొత్తం జనాభాలో మూడోవంతు జనాభా ఈ రెండు రాష్ట్రాలకు చెందినదే. 1951 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడులో జనాభా బిహార్‌కన్నా ఎక్కువగా ఉండగా, నేడు తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్ల జనాభా బిహార్‌లో ఎక్కువగా ఉంది. అదే 1951లో కేరళకన్నా మధ్యప్రదేశ్ జనాభా 37శాతం ఎక్కువగా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ జనాభా కేరళకన్నా 217 శాతం ఎక్కువ. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి మించలేదు. దేశం మొత్తం మీద 1.17 శాతంతో సిక్కింలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకే రూపాయికిపైగా కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి చెల్లిస్తే కేంద్రం నుంచి 52 పైసలు వెనక్కి వచ్చేది. అలాగే తమిళనాడుకు 56 పైసలు, కేరళకు 49 పైసలు వచ్చేది. ఇక బిహార్ రూపాయి చెల్లిస్తే 1.17 రూపాయలు, ఉత్తరప్రదేశ్‌కు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా రూపాయికిపైగానే ముట్టేది. అంటే దక్షిణాది రాష్ట్రాలిచ్చే నిధులతో ఉత్తరాది రాష్ట్రాలు కడుపునింపుకుంటున్నాయి. తాజా లెక్కలు అందుబాటులో లేవు. ఇదే కారణంగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా జీఎస్టీ బిల్లు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. ఎంపీ సీట్ల విషయంలోనూ అన్యాయం ఇక జనాభా ప్రాతిపదికనే పార్లమెంట్ సీట్ల సంఖ్య ఆధారపడి ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాలే ఎక్కువగా లాభపడుతున్నాయి. అమెరికాలో రాష్ట్రం ప్రాతిపదిక సీట్ల కేటాయింపు ఉండగా, భారత్‌లో 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన 1976లో పార్లమెంట్ సీట్ల కేటాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని 2000 సంవత్సరం వరకు అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. ఆ తర్వాత అమలు పీరియడ్‌ను 2026 వరకు పొడిగించారు. ఈ కారణంగానే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాలుగు రాష్ట్రాల నుంచే 51 శాతం సీట్లను గెలుచుకుంది. అధిక జనాభా కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఉద్యోగార్థుల వలసలు పెరుగుతున్నాయి. అదీ కూడా మనకు నష్టమే. మొత్తంగా అధిక జనాభా కలిగిన ఉత్తరాది హిందీ రాష్ట్రాలు లాభపడుతుంటే, జనాభా తగ్గి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి.