చండీగఢ్: హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెప్పారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు దక్షిణాది కంటే హిందీ రాష్ట్రాల్లోనే విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. హరియాణాలో జోడో యాత్రలో భాగంగా ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈమేరకు మాట్లాడారు.
'కేరళలో భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు విశేష స్పందన వచ్చింది. కానీ బీజేపీ పాలిత కర్ణాటకలో ఆదరణ ఉండదని అన్నారు. కానీ కన్నడ నాట ఇంకా ఎక్కువ మంది యాత్రకు తరలివచ్చారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టినప్పుడు అక్కడ యాత్ర ఫెయిల్ అవుతుందని అన్నారు. కానీ జనం ఇంకా భారీగా తరలివచ్చారు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో యాత్రను ఆదరించరని అన్నారు. కానీ దక్షిణాది కంటే ఎక్కువ ఆదరణ ఇక్కడే లభిస్తోంది. ఈసారి కచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. యూపీ, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు' అని రాహుల్ అన్నారు.
అలాగే తన గురించి బీజేపీ పట్టించుకుంటుందని, తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. తాను మాత్రం అసలు బీజేపీని పట్టించుకోనని స్పష్టం చేశారు. మన పని మనం చేసుకుంటే పోతే ఫలితం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భగవత్‍గీత శ్లోకాన్ని గుర్తు చేశారు. అర్జునుడు చేప కంటికి గురిపెట్టిన తర్వాత ఏం చేయబోతున్నాడో చెప్పలేదని పేర్కొన్నారు.
బీజేపీ దేశాన్ని విద్వేషం, మతం ప్రాదిపదికన విడదీస్తోందని, కాంగ్రెస్ చరిత్రలో ఎనాడూ ఇలా చేయలేదని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించి దేశాన్ని ఏకం చేయడానికే తాను భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ మరోమారు స్పష్టం చేశారు.
చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో ప్రత్యేక అతిథి.. ల్యూనా ఫొటోలు వైరల్..
Comments
Please login to add a commentAdd a comment