బహుముఖ పోటీలో బీజేపీకే మొగ్గు | Praveen Roy Review On Political Parties Winning Chances In Elections 2022 | Sakshi
Sakshi News home page

బహుముఖ పోటీలో బీజేపీకే మొగ్గు

Published Tue, Feb 8 2022 1:14 AM | Last Updated on Tue, Feb 8 2022 1:27 AM

Praveen Roy Review On Political Parties Winning Chances In Elections 2022 - Sakshi

పెద్ద రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు చిన్న రాష్ట్రాల కథనాలు విస్మరణకు గురయ్యే అవకాశం ఉంది. అలాగని అక్కడి పోరేమీ తక్కువ రసాత్మకం కాదు. మణిపూర్, గోవా శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి మామూలు కంటే ఎక్కువ పార్టీలు బరిలో ఉన్నాయి. సహజంగానే అన్నీ తమ గెలుపు పట్ల ధీమాగా ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వాటి విజయావకాశాలను ప్రభావితం చేయగలిగే అంశాలు ఎన్నో. 5 రాష్ట్రాల ఎన్నిక లను విశ్లేషిస్తూ ఢిల్లీకి చెందిన ప్రతిష్ఠాత్మక సీఎస్‌డీఎస్, ‘సాక్షి’కి ప్రత్యేకంగా రాస్తున్న వ్యాస పరంపరలో ఇది మొదటిది.

కోవిడ్‌ మహమ్మారి మూడోసారి విరుచుకు పడుతున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం... ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ పార్టీలూ, నేతలూ ఎన్నికల సంఘం నిర్ణయన్ని స్వాగతించినా ఇత రులు మాత్రం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారని విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం తీరు రోమ్‌ తగలబడుతూంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల సంఘం... ఎనభై ఏళ్ల పైబడ్డ వారికి, కోవిడ్‌ బాధితులు, దివ్యాంగు లకు పోస్టల్‌ బ్యాలెట్ల వంటి సౌకర్యాలు కొన్ని ఏర్పాటు చేసి... బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలు, ప్రదర్శనలు, పాదయాత్రలకు మాత్రం విస్పష్టంగా నో చెప్పింది. ఓటింగ్‌ జరిగే సమయాన్ని ఒక గంట పొడిగించి, పోలింగ్‌ కేంద్రాల వద్ద కోవిడ్‌ సంబంధిత రక్షణ చర్యలన్నింటినీ తప్పనిసరి చేసింది. ఈ చర్యలన్నీ చదివేందుకు, ఇంటర్నెట్, సోషల్‌ మీడియాల్లో చూసుకునేందుకు బాగానే ఉంటాయి కానీ... వాస్తవ పరిస్థితుల్లో వీటి అమలు మాత్రం చాలా కష్టం. కోవిడ్‌ కేసుల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసి ఉండే బాగుండేది. కానీ హడావుడిగా ప్రకటించడం ఎన్నికల సంఘం కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతోందనేందుకు నిదర్శనం.

తాజా ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మీడియా దృష్టి మొత్తం ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లపైనే కేంద్రీకృతమై ఉంది. మిగిలిన మూడు రాష్ట్రాల వివరాలూ, విశ్లేషణలూ తక్కువగానే అందుతున్నాయి. వివక్షకు తావు లేకుండా... అందరి సమాచారాన్ని ఇచ్చే విషయాన్ని కార్పొరేట్‌ మీడియా ఎప్పుడో మరచిపోయింది. వీటన్నింటి కార ణంగా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సవ్యంగా జరుగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో మణిపూర్, గోవాల పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి విశ్లేషించి చూడాలి. 

సంక్లిష్ట ముఖచిత్రం... మణిపూర్‌
అరవై అసెంబ్లీ సీట్లున్న ఈ ఈశాన్య రాష్ట్రంలో పోటీ బహుముఖం. బీజేపీ, కాంగ్రెస్‌ కూటమి, నేషనలిస్ట్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీఎఫ్‌), నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీపీ)లకు కొన్ని సీట్లలో చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. బీజేపీ సొంతంగా పోటీ చేస్తూండగా, కేంద్రంలో ఎన్డీయే భాగస్వాములైన ఎన్‌పీఎఫ్, ఎన్‌పీపీలు రాష్ట్రంలో విడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్‌పీ, జేడీ (ఎస్‌)లతో కాంగ్రెస్‌ కూటమి ఏర్పాటు చేసు కుంది. మణిపూర్‌ రాజకీయ ముఖచిత్రం, చరిత్ర చాలా సంక్లిష్ట మైందే. పార్టీలు, భౌగోళిక ప్రాంతాలవారీగా విడిపోయి ఉంటాయి. మొత్తం అరవై అసెంబ్లీ సీట్లలో నలభై వరకూ ఇంఫాల్‌ లోయ ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ మెయిటీ వర్గపు ఆధిపత్యం ఎక్కువ. నాగాలు, కుకీల ప్రాబల్యమున్న పర్వత ప్రాంతాల్లో 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 

2017 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ 28 స్థానాలు దక్కించుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా... ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్‌ పార్టీ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా బీజేపీ 21 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్య మంత్రి ఓఖ్రామ్‌ ఐబోబి 15 ఏళ్ల అధికారానికి తెరపడింది. బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలో బీజేపీ... ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, తృణమూల్‌ కాంగ్రెస్, లోక్‌ జనశక్తి, ఒక స్వతంత్ర అభ్యర్థుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా కనీసం 40 స్థానాలను గెలుచుకుని అధికారం లోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉంది. సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందివ్వడం మాత్రమే కాకుండా... రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ వ్యవస్థ అమలు ద్వారా ప్రజల నమ్మకం పొందడం ఇందుకు కారణాలుగా చూపుతోంది. మణిపూర్‌ రాష్ట్రంలోకి వచ్చేం దుకు ఇతర రాష్ట్రాల వారు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ ప్రజల చిరకాల డిమాండ్‌.

దీనికి తోడు... ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే రాష్ట్రంలో దాదాపు ఐదు వేల కోట్ల రూపా యలతో 21 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం కూడా తమకు కలిసివస్తుందని బీజేపీ నమ్ముతోంది. అయితే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన తమను ఎస్టీల్లో చేర్చాలన్న మెయిటీల డిమాండ్‌పై ఏకాభిప్రాయం సాధించడంలో బీజేపీ విఫలమైంది. అలాగే మణిపూర్‌ (హిల్‌ ఏరియాస్‌) అటానమస్‌ డిస్ట్రిక్‌ కౌన్సిల్స్‌ బిల్‌ 2021 ఆమోదం పొందకపోవడమూ... రాష్ట్రంలోని పర్వతప్రాంత ప్రజలు, ఇతరుల మధ్య విభేదాలకు కారణమవుతోంది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు ఎక్కువ కావడంతో అందరినీ సర్దుబాటు చేసే అవకాశాలు తగ్గిపోయాయి. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన 11 మంది ఎమ్మెల్యేలకు, ఇద్దరు టీఎంసీ, ఎల్‌జేపీ మాజీలకు మళ్లీ అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం సొంతపార్టీ నేతలు, కార్యకర్తల అసంతృప్తికి కారణమవుతోంది. ఈ అంశాలన్నీ ఫిబ్రవరి 14 నాటి ఎన్నికల్లో బీజేపీ మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. 

బీజేపీ అవకాశాలకు గండికొట్టగల ఇంకో కారణం... రాష్ట్రంలో రాజుకుంటున్న ప్రాంతీయ విద్వేషాలు. 2017లో తొమ్మిది సీట్లలో పోటీ చేసిన ఎన్‌పీపీ, వాటిల్లో నాలుగు గెలుచుకోగలిగింది. ఇప్పుడు ఆ పార్టీ 40 సీట్లకు పోటీ చేస్తోంది. ఎన్‌పీఎఫ్‌ గత ఎన్నికల్లో నాగాల ఆధిపత్యం ఉన్న 11 స్థానాల్లో పోటీ చేసి నాలుగింటిలో విజయం సాధించింది. చివరగా చొరబాటుదారులు చురాచెండ్‌పూర్‌లో జరిపిన దాడి నేపథ్యంలో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (స్పెషల్‌ పవర్స్‌) యాక్ట్‌తో కల్లోలిత ప్రాంత స్థాయిని కొనసాగించడమూ అధికార పార్టీకి కలిసివచ్చే అంశం కాదు. కుకీ పీపుల్స్‌ అలయన్స్‌ పేరుతో ఏర్పడ్డ కొత్త పార్టీ కనీసం తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ ఓట్లను చీల్చగలదని అంచనా. పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతానికి బీజేపీకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, అవకాశ వాద రాజ కీయాలకు ప్రాధాన్యం లభించే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం అంత సులువేమీ కాదు. 

గోవాలోనూ బహుముఖమే...
గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈసారి ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్, గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ)ల కూటమి మాత్రమే కాదు... మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ), తృణమూల్‌ కాంగ్రెస్‌ల కూటమి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కూడా ఉండటంతో పోటీ బహుముఖంగానే ఉండనుంది. గత ఎన్నికల్లో (2017) భార తీయ జనతా పార్టీ మొత్తం నలభై స్థానాల్లో 13 మాత్రమే గెలుచు కున్నా... ఓట్‌ షేర్‌ మాత్రం 32 శాతం దాకా సంపాదించగలిగింది. మరోవైపు కాంగ్రెస్‌ 28 శాతం ఓట్‌ షేర్‌తో 17 స్థానాల్లో విజయం సాధిం చింది. కాకపోతే మణిపూర్‌లో మాది రిగానే నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్‌లో జరిగిన ఆలస్యం కాస్తా కాషాయపార్టీకి వరంగా మారింది. బీజేపీ వేసిన రాజకీయ ఎత్తులకు చిల్తై అధికారానికి దూరం కావడమే కాకుండా... ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలను కోల్పోయింది.

కొంతమంది ఎమ్మెల్యేలు తృణమూల్‌ వైపునకూ మొగ్గిపోవడం గమనార్హం.ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోలేదన్న విమర్శను ఎదుర్కొంటోంది. ఉక్కు మైనింగ్‌ను మళ్లీ ప్రారంభిస్తామన్న బీజేపీ హామీ నెరవేరలేదు. ఈసారి గెలిస్తే... రాష్ట్ర ప్రభుత్వపు సంస్థ ద్వారా మళ్లీ ప్రారంభిస్తామని బీజేపీ చెబుతోంది. దీంతోపాటు మొల్లెం అటవీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పర్యావరణ సమతౌల్య పరిరక్షణ, కోవిడ్‌ నిర్వహణ, మాధే నది నీటిని కర్ణాటకతో పంచుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ధరల పెరుగుదల వంటి అనేక అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా నిలుస్తున్నాయి! ప్రాంతీయ పార్టీల మద్దతు కోల్పోయిన బీజేపీకి క్రిస్టియన్‌ (25 శాతం) ఓటర్లతోనూ పెద్దగా సంబంధాలు లేవు. పార్టీలకు అతీతంగా ఓటర్లను ఏకం చేయగల కరిష్మా ఉన్న కేంద్ర మాజీ రక్షణశాఖ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి మనో హర్‌ పారిక్కర్‌ లాంటి నేతలు లేకపోవడం బీజేపీ మళ్లీ గద్దెనెక్కేందుకు అడ్డంకులుగా నిలుస్తున్నాయి.

ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత, చర్చిలు, సామాజిక కార్యకర్తలపై పెరుగుతున్న దాడులు, పౌర చట్టానికి సవరణలు, ఎన్‌ఆర్‌సీ తదితర అంశాలూ బీజేపీకి ఇబ్బందికరమైన అంశాలే. వీటన్నింటికీ తోడుగా ఈసారి ఎన్నికల్లో కొత్తగా ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ బరిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలూ బీజేపీ మద్దతుదార్ల ఓటర్లను చీల్చే అవకాశం ఉంది. ఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూపుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ తమకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన అనుభవజ్ఞుల సాయంతో తమకూ కొన్ని సీట్లు రాగలవన్న ఆశతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉంది. అయితే... గోవాలో బీజేపీకి ఊరటనిచ్చే ఒక అంశం ఉంది. ఇక్కడ రాజకీయాలు వ్యక్తులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాయి, పార్టీలపై కాదు.

గెలుపోటముల మధ్య తేడా కూడా చాలా స్వల్పం. చిన్న చిన్న నియోజకవర్గాల కారణంగా కొన్ని వేల ఓట్లతో విజయం కాస్తా అపజయంగా మారిపోగలదు. బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో జరిగే ఓట్ల చీలిక బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. 2017లో గెలిచిన 24 మంది పార్టీలు ఫిరాయించడం వల్ల గోవా ప్రజలకు నేతలపై ఉన్న నమ్మకమూ సన్నగిల్లింది. ఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సి వస్తే మాత్రం ఈసారి హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. మొత్తమ్మీద గోవా, మణిపూర్‌ రాజకీయాల్లో ఈసారి కూడా ఫిరాయింపులు తమదైన పాత్ర పోషిస్తాయా లేదా అన్నది చూడాలి. ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీకి మణిపూర్‌లో కొంత మొగ్గు ఉన్నట్లు కనిపిస్తోంది. గోవాలో మాత్రం వెనుకబడి ఉంది. కానీ, ఈ పరిస్థితి మారేందుకు ఎక్కువ సమయమేమీ పట్టకపోవచ్చు.


వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్, ఢిల్లీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement