14, 15 తేదీల్లో జిల్లా కలెక్టర్లతో సమావేశం: భన్వర్‌లాల్
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లా కలెక్టర్లతో కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి నూటికి నూరు శాతం ఫొటోలతో ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత, పోలింగ్ నిర్వహణకు సిబ్బందిని గుర్తించడం, గతంలో పోలింగ్ నిర్వహణ సందర్భంగా ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఈవీఎంల లభ్యత, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించనున్నట్లు భన్వర్‌లాల్ వెల్లడించారు.
ఈ నెల 17తో ఓటర్ల నమోదు గడువు ముగుస్తున్నందున వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులందరూ ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని భన్వర్‌లాల్ సూచించారు. 15వ తేదీన రాష్ట్రంలోని 69,031 పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఓటర్ల జాబితాతో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఓటర్‌గా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి జనవరి 25న పోలింగ్ కేంద్రాల వద్దనే కలర్ ఓటర్ గుర్తింపు కార్డులను జారీ చేస్తామన్నారు.