సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్, కమిషనర్ హరిశంకర బ్రహ్మ, డిప్యూటీ కమిషనర్ వినోద్ జుత్సి ఈ నెల 18వ తేదీ రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. 19వ తేదీ ఉదయం జూబ్లీహాల్‌లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుతో పాటు పోలింగ్ సందర్భంగా కమిషన్ చేసిన ఏర్పాట్లను వారికి వివరించనున్నారు. ఇదే సమయంలో పార్టీలు పాటించాల్సిన నియమాలను తెలియజేస్తారు. అదే రోజు మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు, అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, డీజీపీ ప్రసాదరావుతో సమావేశమై పోలింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలపై, ముఖ్యంగా శాంతిభద్రతల అంశంపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నివారించడానికి మరిన్ని గట్టి చర్యలు తీసుకోవడంతో పాటు, పోలింగ్ రోజుల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో కేంద్ర సాయుధ పోలీసు దళం జవాను ఉండేలా చూడటం, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కనీస వసతుల కల్పనపై కమిషన్ సమీక్ష నిర్వహించనుంది.
నేడు పార్టీలు, బ్యాంకర్లతో సీఈఓ భేటీ
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చేయడాన్ని, ఇతర చర్యలను అడ్డుకోవడంపై రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా బ్యాంకుల లావాదేవీలపైనా నిఘా పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీఈఓ గురువారం మధ్యాహ్నం బ్యాంకర్ల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో ఎవరైనా నగదు డ్రా చేస్తే ఆ వివరాలను తెలియజేయాల్సిందిగా బ్యాంకర్లను కోరాలని నిర్ణరుుంచారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళల ఖాతాలకు, అలాగే మహిళా సంఘాల ఖాతాలకు ఎవరైనా డబ్బులు వేస్తే వారి వివరాలను తెలియజేయాల్సిందిగా కూడా కోరనున్నారు. మరోవైపు గురువారం ఉదయం ఎన్నికల ఏర్పాట్లపై, ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలుపై భన్వర్‌లాల్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఎన్నికల ఏర్పాట్లపై 19న ఈసీ సమీక్ష
Published Thu, Apr 17 2014 2:25 AM | Last Updated on Mon, Sep 17 2018 6:12 PM
Advertisement