Noted writer and journalist
-
ప్రముఖ ఫోటో జర్నలిస్టు భరత్ భూషణ్ ఇక లేరు
ప్రముఖ సీనియర్ ఫోటో జర్నలిస్టు గుడిమల్ల భరత్ భూషణ్ ఇకలేరు. అనారోగ్యంతో పోరాడుతూ ఆయన ఆదివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. తెలంగాణా బతుకమ్మ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన భరత్ భూషణ్ అస్తమయం సాహితీ లోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ సాంఘిక సాస్కృతిక జీవితాన్ని అపురూపంగా చిత్రించిన ఆయన మరణం తీరని లోటంటూ పలువరు నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫొటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుడిమల్ల అనసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు వరంగల్‌లో ఆయన జన్మించారు. నిజానికి బాల్యం నుంచి ఆయనకు చిత్రకళ అంటే ఆసక్తి ఉండేది. అలా కాల క్రమంలో ఫొటోగ్రఫీపై ఆసక్తిని పెంచుకున్న తన అద్భుతమైన ఫోటోలతో గొప్ప ఫోటోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యారు. అనారోగ్యం కారణంగా మళ్లీ తన కుంచెకు పని చెప్పారు. ప్రజల జీవన శైలిని, చారిత్రక ఘట్టాలను, సంస్కృతిని తన ఛాయా చిత్రాల్లో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ఫోటోల ద్వారా బతుకమ్మ సంస్కృతి ప్రపంచానికి తెలియజేసి కల్చరల్ అంబాసడర్ ఆఫ్ తెలంగాణగా ఎదిగారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణపల్లె జీవనం , పల్లె దర్వాజా, బొడ్డెమ్మ, బతుకమ్మ, తెలంగాణా మహిళలు ఫోటోలు సహా తెలంగాణ బతుకు చిత్రాన్ని తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు భరత్ భూషణ్. పల్లె ప్రజల జీవన వైవిద్యాన్ని ఆయన ఫోటోలు మనకు అర్థం చేయిస్తాయి. కలర్ ఫుల్ దర్వాజాలు, గోడలపై చిలికిన వెల్ల, గొళ్లాలు, కూలిన గోడలు, దర్వాజాలు, ముగ్గులు, వంటింటి వస్తువుల సౌందర్యాన్ని మన కళ్ల ముందుంచుతూ తెలంగాణ పల్లె జీవితం ఆవిష్కరించిన తీరు అద్భుతం. దైనందిన జీవితమే కాదు, పండుగలను పబ్బాలు, జాతర వైభవాన్ని కూడా ఆయన కెమెరా కన్ను అద్భుతంగా మలిచింది. అలాగే చిందుఎల్లమ్మ తొలి చిత్రాన్ని, చాకలి ఐలమ్మ ఫోటోలను ఎలా మర్చిపోగలం. కవి శివ సాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు వంటి వారి ఫొటోలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేనా తెలంగాణా కవి కాళోజి ఛాయాచిత్రాలు తీసిన ఘనతకూడా భరత్ భూషణ్‌దే. భరత్ భూషణ్ సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. హరిజన్, కాంచన సీత, రంగులకల వంటి మూవీలకు ఫొటోగ్రఫీ చేశారు. మెగాస్టార్ చిరంజీవిగా కరియర్ ఆరంభంలో పత్రికలకోసం చక్కటి ఫోటోలను తీసింది కూడా ఆయననే చెప్పుకుంటారు. వీటన్నింటికి తోడు భరత్ భూషణ్ ఫోటో జర్నలిస్టు మాత్రమే కాదు జానపద కళలపై, కుల వృత్తులపై వ్యాసాలు రాసిన రైటర్ కూడా. ఒకసారి కేన్సర్‌బారిన పడి కోలుకున్నప్పటికి దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టింది. దీనికి తోడు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా తీవ్రం కావడంతో శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. దీంతో ఆపై లోకంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడానికి మన భరత్ భూషణ్ తరలిపోయాడంటూ పలువురు ఫోటోగ్రాఫర్లు, రచయితలు కన్నీటి నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా దశాబ్దాల పాటు ఫోటోగ్రఫీ రంగంలో ఆయన చేసిన కృషి గొప్పదని కొనియాడారు. ఇటీవల కవి ఎండ్లూరి సుధాకర్ వెళ్లిపోయిన విషాదం నుంచికోలుకోకముందే మరో దెబ్బ తగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అనేక సందర్భాల్లో ఆయనకు తమకు అందంగా తీసిచ్చిన అద్భుతమైన ఫోటోలను గుండెలకు హత్తుకుని పలువురు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే తన జీవితకథను గ్రంథస్థం చేయాలనుకున్న కల తీరకుండానే వెళ్లిపోయారంటూ సాహితీ మిత్రులు శోకసంద్రమయ్యారు. మరోవైపు భరత్ మరణంతో తెలంగాణ అరుదైన ఫొటో జర్నలిస్టును, చిత్రకారుడిని కోల్పోయిందంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
కుష్వంత్ సింగ్ కన్నుమూత
జర్నలిస్టుగా, రచయితగా ప్రసిద్ధి చెందిన కుష్వంత్ కొంత కాలంగా అనారోగ్య సమస్య..99వ ఏట ప్రశాంతంగా తుది శ్వాస విడిచారన్న తనయుడు సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, మోడీ, జగన్‌సహా ప్రముఖులు న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్(99) గురువారమిక్కడ తుది శ్వాస విడిచారు. సమకాలీన భారతీయ ఆంగ్ల రచయితల్లో ప్రముఖుడిగా పేరొందిన కుష్వంత్.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన చాలా కాలంగా ప్రజా జీవితానికి దూరంగా గడిపారని, ఢిల్లీ సుజన్ సింగ్ పార్కులోని స్వగృహంలో చాలా ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని ఆయన తనయుడు, జర్నలిస్టు రాహుల్ సింగ్ తెలిపారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ సమస్యతో సతమతమవుతున్నారని, చివరి వరకు మానసికంగా దృఢంగా ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం సంపూర్ణంగా గడిపారని అన్నారు. కుష్వంత్ సింగ్‌కు రాహుల్‌తోపాటు కుమార్తె మాల ఉన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు, సినీ నటులు కుష్వంత్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, బీజేపీ అగ్ర నాయకుడు అద్వానీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. కుష్వంత్ భౌతిక కాయానికి దయానంద్ ముక్తిధామ్‌లో ‘విద్యుత్ చితి’ ద్వారా అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. కుష్వంత్ 1915లో అఖండ భారత్‌లోని హదాలీ(ప్రస్తుతం పాక్‌లో ఉంది) జన్మించారు. తండ్రి సివిల్ కాంట్రాక్టరు సర్ శోభా సింగ్. ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజీ, కేంబ్రిడ్జి వర్సిటీలోని కింగ్స్ కాలేజీలలో కుష్వంత్ విద్యాభ్యాసం పూర్తయింది. 1939లో కవల్ మాలిక్‌ను పెళ్లాడారు. ఈమె 2001లో మరణించారు. 1947లో విదేశాంగ వ్యవహారాల శాఖలో చేరకముందు లాహోర్ హై కోర్టులో కొన్నేళ్లపాటు పనిచేశారు. 1948-50 మధ్య కాలంలో ఐర్లాండులోని భారతీయ రాయబార కార్యాలయంలో, అమెరికాలోని హై కమిషన్‌లో ప్రజా సంబంధాల అధికారిగా, టొరాంటోలో భారత ప్రభుత్వ సమాచార అధికారిగా పనిచేశారు. కుష్వంత్ సింగ్ నాటి ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో (1979-1980), తర్వాత హిందుస్థాన్ టైమ్స్(1980-83) పనిచేశారు. తర్వాత నేషనల్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్లలో కూడా పనిచేశారు. ఆయన వారం వారం రాసే ‘విత్ మలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్’ చాలా పేరు పొందింది, అది చాలా దినపత్రికల్లో ప్రచురితమైంది. యోజన మేగజైన్‌కు(1951-1953) వ్యవస్థాపక సంపాదకుడిగా చేశారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కుష్వంత్ సింగ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1974లో పద్మభూషణ్ ప్రకటించగా.. స్వర్ణమందిరంపై సైనిక చర్యకు నిరసనగా కుష్వంత్ దాన్ని 1984లో తిరిగిచ్చేశారు. మళ్లీ 2007లో ఈయన్ను పద్మవిభూషణ్ వరించింది. రాజకీయ వ్యాఖ్యాతగా, సమకూలీన వ్యంగ్య విమర్శకుడిగా పేరొందిన కుష్వంత్.. సిక్కు మత గ్రంథాలు, ఉర్దూ కవితలు, పలు ఇతర నవలల అనువాదంలో విశేష కృషి చేశారు. కుష్వంత్ ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మలైస్’ పేరుతో 2002లో పుస్తకంగా వచ్చింది. ట్రైన్ టు పాకిస్థాన్ నవలతోపాటు ద సన్‌సెట్ క్లబ్, ద మార్క్ ఆఫ్ విష్ణు అండ్ అదర్ స్టోరీస్, ఎ బ్రైడ్ ఫర్ ద సాహిబ్ అండ్ అదర్ స్టోరీస్, బ్లాక్ జాస్మిన్, ద పోట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, ఎ లవ్ అఫైర్ ఇన లండన్ వంటి పలు పుస్తకాలు రాశారు. కుష్వంత్ సింగ్ మృతికి జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నిజమైన లౌకిక విలువలకు కట్టుబడిన పాత్రికేయుడిగా హాస్యం, వ్యంగ్యం రాయడంలో దిట్టగా కోట్లాది మంది పాఠకులకు కుష్వంత్‌సింగ్ అర్ధ శతాబ్దంగా సుపరిచితుడని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ పత్రికా రంగానికి తీరని లోటు అని జగన్ అన్నారు. ఎమ్మెల్సీ రాజు సంతాపం: కుష్వంత్ మృతిపట్ల పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు తన సంతాపాన్ని తెలియజేశారు. తాను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సలహామండలి కన్వీనర్‌గా ఉన్నపుడు సింగ్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగిందని, ఆయన గొప్ప మేధావి అని అన్నారు. -
ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ కన్నుమూత
ప్రముఖ పాత్రికేయుడు, రచయిత కుష్వంత్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో మరణించారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.న్యూఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్‌లోని స్వగృహంలో తన తండ్రి ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారని కుష్వంత్ కుమారుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ పంజాబ్‌లోని హడలిలో ఫిబ్రవరి 2 వ తేదీన ఆయన జన్మించారు. భారత్‌లో యోజన పత్రికకు ఆయన వ్యవస్థాపక సంపాదకుడిగా వ్యవహరించారు. అలాగే నేషనల్ హెరాల్డ్, హిందూస్థాన్ టైమ్స్, ది ఇలస్ట్రేట్రడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలకు సంపాదకుడిగా విధులు నిర్వర్తించారు. ట్రైయిన్ టూ పాకిస్థాన్, ఐ షెల్ నాట్ హియిర్ ద నైటింగేల్, ఢిల్లీ రచనలు ఆయన కలం పదును ఎంతో తెలియజేస్తాయి. ఒకానొక సమయంలో దివంగత ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న కుష్వంత్ సింగ్, ఆ తర్వాతి కాలంలో కుటుంబంలో విభేదాలు వచ్చినప్పుడు రెండో వర్గం వైపు మొగ్గు చూపారు. అందువల్ల ఆయన ఇందిర వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అనంతర సమయంలో ఆయన రాసిన పలు వ్యాసాలు, సంపాదకీయాల్లో కూడా ఆ ముద్ర స్పష్టంగా కనిపించింది. 1974లో కుష్వంత్ సింగ్‌కు భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. అయితే 1984 నాటి అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో చోటు చేసుకున్న సంఘటనలను నిరసిస్తు ఆ పురస్కారాన్ని తిరిగి భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు. అయితే 2007లో కుష్వంత్ సింగ్‌ను భారత్ ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది తనను తాను గౌరవించుకుంది.1980 నుంచి1986 వరకు కుష్వంత్ సింగ్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన సంగతి తెలిసిందే.