![Eminent Telangana Photographer Bharat Bhushan no more - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/31/Photographer-Bharat-Bhushan.jpg.webp?itok=LD8hkSKx)
ప్రముఖ సీనియర్ ఫోటో జర్నలిస్టు గుడిమల్ల భరత్ భూషణ్ ఇకలేరు. అనారోగ్యంతో పోరాడుతూ ఆయన ఆదివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. తెలంగాణా బతుకమ్మ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన భరత్ భూషణ్ అస్తమయం సాహితీ లోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ సాంఘిక సాస్కృతిక జీవితాన్ని అపురూపంగా చిత్రించిన ఆయన మరణం తీరని లోటంటూ పలువరు నివాళులర్పించారు.
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫొటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుడిమల్ల అనసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు వరంగల్‌లో ఆయన జన్మించారు. నిజానికి బాల్యం నుంచి ఆయనకు చిత్రకళ అంటే ఆసక్తి ఉండేది. అలా కాల క్రమంలో ఫొటోగ్రఫీపై ఆసక్తిని పెంచుకున్న తన అద్భుతమైన ఫోటోలతో గొప్ప ఫోటోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యారు. అనారోగ్యం కారణంగా మళ్లీ తన కుంచెకు పని చెప్పారు. ప్రజల జీవన శైలిని, చారిత్రక ఘట్టాలను, సంస్కృతిని తన ఛాయా చిత్రాల్లో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ఫోటోల ద్వారా బతుకమ్మ సంస్కృతి ప్రపంచానికి తెలియజేసి కల్చరల్ అంబాసడర్ ఆఫ్ తెలంగాణగా ఎదిగారంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణపల్లె జీవనం , పల్లె దర్వాజా, బొడ్డెమ్మ, బతుకమ్మ, తెలంగాణా మహిళలు ఫోటోలు సహా తెలంగాణ బతుకు చిత్రాన్ని తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు భరత్ భూషణ్. పల్లె ప్రజల జీవన వైవిద్యాన్ని ఆయన ఫోటోలు మనకు అర్థం చేయిస్తాయి. కలర్ ఫుల్ దర్వాజాలు, గోడలపై చిలికిన వెల్ల, గొళ్లాలు, కూలిన గోడలు, దర్వాజాలు, ముగ్గులు, వంటింటి వస్తువుల సౌందర్యాన్ని మన కళ్ల ముందుంచుతూ తెలంగాణ పల్లె జీవితం ఆవిష్కరించిన తీరు అద్భుతం. దైనందిన జీవితమే కాదు, పండుగలను పబ్బాలు, జాతర వైభవాన్ని కూడా ఆయన కెమెరా కన్ను అద్భుతంగా మలిచింది. అలాగే చిందుఎల్లమ్మ తొలి చిత్రాన్ని, చాకలి ఐలమ్మ ఫోటోలను ఎలా మర్చిపోగలం.
కవి శివ సాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు వంటి వారి ఫొటోలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేనా తెలంగాణా కవి కాళోజి ఛాయాచిత్రాలు తీసిన ఘనతకూడా భరత్ భూషణ్‌దే. భరత్ భూషణ్ సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. హరిజన్, కాంచన సీత, రంగులకల వంటి మూవీలకు ఫొటోగ్రఫీ చేశారు. మెగాస్టార్ చిరంజీవిగా కరియర్ ఆరంభంలో పత్రికలకోసం చక్కటి ఫోటోలను తీసింది కూడా ఆయననే చెప్పుకుంటారు. వీటన్నింటికి తోడు భరత్ భూషణ్ ఫోటో జర్నలిస్టు మాత్రమే కాదు జానపద కళలపై, కుల వృత్తులపై వ్యాసాలు రాసిన రైటర్ కూడా.
ఒకసారి కేన్సర్‌బారిన పడి కోలుకున్నప్పటికి దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టింది. దీనికి తోడు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా తీవ్రం కావడంతో శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. దీంతో ఆపై లోకంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడానికి మన భరత్ భూషణ్ తరలిపోయాడంటూ పలువురు ఫోటోగ్రాఫర్లు, రచయితలు కన్నీటి నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా దశాబ్దాల పాటు ఫోటోగ్రఫీ రంగంలో ఆయన చేసిన కృషి గొప్పదని కొనియాడారు. ఇటీవల కవి ఎండ్లూరి సుధాకర్ వెళ్లిపోయిన విషాదం నుంచికోలుకోకముందే మరో దెబ్బ తగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే అనేక సందర్భాల్లో ఆయనకు తమకు అందంగా తీసిచ్చిన అద్భుతమైన ఫోటోలను గుండెలకు హత్తుకుని పలువురు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే తన జీవితకథను గ్రంథస్థం చేయాలనుకున్న కల తీరకుండానే వెళ్లిపోయారంటూ సాహితీ మిత్రులు శోకసంద్రమయ్యారు. మరోవైపు భరత్ మరణంతో తెలంగాణ అరుదైన ఫొటో జర్నలిస్టును, చిత్రకారుడిని కోల్పోయిందంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment