కుష్వంత్ సింగ్
ప్రముఖ పాత్రికేయుడు, రచయిత కుష్వంత్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో మరణించారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.న్యూఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్లోని స్వగృహంలో తన తండ్రి ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారని కుష్వంత్ కుమారుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రస్తుతం పాకిస్థాన్ పంజాబ్లోని హడలిలో ఫిబ్రవరి 2 వ తేదీన ఆయన జన్మించారు. భారత్లో యోజన పత్రికకు ఆయన వ్యవస్థాపక సంపాదకుడిగా వ్యవహరించారు. అలాగే నేషనల్ హెరాల్డ్, హిందూస్థాన్ టైమ్స్, ది ఇలస్ట్రేట్రడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలకు సంపాదకుడిగా విధులు నిర్వర్తించారు. ట్రైయిన్ టూ పాకిస్థాన్, ఐ షెల్ నాట్ హియిర్ ద నైటింగేల్, ఢిల్లీ రచనలు ఆయన కలం పదును ఎంతో తెలియజేస్తాయి.
ఒకానొక సమయంలో దివంగత ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న కుష్వంత్ సింగ్, ఆ తర్వాతి కాలంలో కుటుంబంలో విభేదాలు వచ్చినప్పుడు రెండో వర్గం వైపు మొగ్గు చూపారు. అందువల్ల ఆయన ఇందిర వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అనంతర సమయంలో ఆయన రాసిన పలు వ్యాసాలు, సంపాదకీయాల్లో కూడా ఆ ముద్ర స్పష్టంగా కనిపించింది.
1974లో కుష్వంత్ సింగ్కు భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. అయితే 1984 నాటి అమృత్సర్లోని స్వర్ణదేవాలయంలో చోటు చేసుకున్న సంఘటనలను నిరసిస్తు ఆ పురస్కారాన్ని తిరిగి భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు. అయితే 2007లో కుష్వంత్ సింగ్ను భారత్ ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది తనను తాను గౌరవించుకుంది.1980 నుంచి1986 వరకు కుష్వంత్ సింగ్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన సంగతి తెలిసిందే.