Khushwant Singh
-
కుష్వంత్ సింగ్ కన్నుమూత
జర్నలిస్టుగా, రచయితగా ప్రసిద్ధి చెందిన కుష్వంత్ కొంత కాలంగా అనారోగ్య సమస్య..99వ ఏట ప్రశాంతంగా తుది శ్వాస విడిచారన్న తనయుడు సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, మోడీ, జగన్‌సహా ప్రముఖులు న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్(99) గురువారమిక్కడ తుది శ్వాస విడిచారు. సమకాలీన భారతీయ ఆంగ్ల రచయితల్లో ప్రముఖుడిగా పేరొందిన కుష్వంత్.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన చాలా కాలంగా ప్రజా జీవితానికి దూరంగా గడిపారని, ఢిల్లీ సుజన్ సింగ్ పార్కులోని స్వగృహంలో చాలా ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని ఆయన తనయుడు, జర్నలిస్టు రాహుల్ సింగ్ తెలిపారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ సమస్యతో సతమతమవుతున్నారని, చివరి వరకు మానసికంగా దృఢంగా ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం సంపూర్ణంగా గడిపారని అన్నారు. కుష్వంత్ సింగ్‌కు రాహుల్‌తోపాటు కుమార్తె మాల ఉన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు, సినీ నటులు కుష్వంత్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, బీజేపీ అగ్ర నాయకుడు అద్వానీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. కుష్వంత్ భౌతిక కాయానికి దయానంద్ ముక్తిధామ్‌లో ‘విద్యుత్ చితి’ ద్వారా అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. కుష్వంత్ 1915లో అఖండ భారత్‌లోని హదాలీ(ప్రస్తుతం పాక్‌లో ఉంది) జన్మించారు. తండ్రి సివిల్ కాంట్రాక్టరు సర్ శోభా సింగ్. ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజీ, కేంబ్రిడ్జి వర్సిటీలోని కింగ్స్ కాలేజీలలో కుష్వంత్ విద్యాభ్యాసం పూర్తయింది. 1939లో కవల్ మాలిక్‌ను పెళ్లాడారు. ఈమె 2001లో మరణించారు. 1947లో విదేశాంగ వ్యవహారాల శాఖలో చేరకముందు లాహోర్ హై కోర్టులో కొన్నేళ్లపాటు పనిచేశారు. 1948-50 మధ్య కాలంలో ఐర్లాండులోని భారతీయ రాయబార కార్యాలయంలో, అమెరికాలోని హై కమిషన్‌లో ప్రజా సంబంధాల అధికారిగా, టొరాంటోలో భారత ప్రభుత్వ సమాచార అధికారిగా పనిచేశారు. కుష్వంత్ సింగ్ నాటి ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో (1979-1980), తర్వాత హిందుస్థాన్ టైమ్స్(1980-83) పనిచేశారు. తర్వాత నేషనల్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్లలో కూడా పనిచేశారు. ఆయన వారం వారం రాసే ‘విత్ మలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్’ చాలా పేరు పొందింది, అది చాలా దినపత్రికల్లో ప్రచురితమైంది. యోజన మేగజైన్‌కు(1951-1953) వ్యవస్థాపక సంపాదకుడిగా చేశారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కుష్వంత్ సింగ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1974లో పద్మభూషణ్ ప్రకటించగా.. స్వర్ణమందిరంపై సైనిక చర్యకు నిరసనగా కుష్వంత్ దాన్ని 1984లో తిరిగిచ్చేశారు. మళ్లీ 2007లో ఈయన్ను పద్మవిభూషణ్ వరించింది. రాజకీయ వ్యాఖ్యాతగా, సమకూలీన వ్యంగ్య విమర్శకుడిగా పేరొందిన కుష్వంత్.. సిక్కు మత గ్రంథాలు, ఉర్దూ కవితలు, పలు ఇతర నవలల అనువాదంలో విశేష కృషి చేశారు. కుష్వంత్ ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మలైస్’ పేరుతో 2002లో పుస్తకంగా వచ్చింది. ట్రైన్ టు పాకిస్థాన్ నవలతోపాటు ద సన్‌సెట్ క్లబ్, ద మార్క్ ఆఫ్ విష్ణు అండ్ అదర్ స్టోరీస్, ఎ బ్రైడ్ ఫర్ ద సాహిబ్ అండ్ అదర్ స్టోరీస్, బ్లాక్ జాస్మిన్, ద పోట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, ఎ లవ్ అఫైర్ ఇన లండన్ వంటి పలు పుస్తకాలు రాశారు. కుష్వంత్ సింగ్ మృతికి జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నిజమైన లౌకిక విలువలకు కట్టుబడిన పాత్రికేయుడిగా హాస్యం, వ్యంగ్యం రాయడంలో దిట్టగా కోట్లాది మంది పాఠకులకు కుష్వంత్‌సింగ్ అర్ధ శతాబ్దంగా సుపరిచితుడని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ పత్రికా రంగానికి తీరని లోటు అని జగన్ అన్నారు. ఎమ్మెల్సీ రాజు సంతాపం: కుష్వంత్ మృతిపట్ల పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు తన సంతాపాన్ని తెలియజేశారు. తాను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సలహామండలి కన్వీనర్‌గా ఉన్నపుడు సింగ్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగిందని, ఆయన గొప్ప మేధావి అని అన్నారు. -
పాత్రికేయ మేరువు కుష్వంత్
నివాళి లౌకికవాదాన్నీ, జర్నలిజం ప్రమాణాలనూ, ప్రజాస్వామ్య విలువలనూ కుష్వంత్‌సింగ్ సమర్థించిన తీరు అనితరసాధ్యం. పత్రికారంగాన్నీ, సాహిత్య లోకాన్నీ ప్రబలంగా ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి అస్తమయంతో ఒక శకం ముగిసింది. జీవితాన్ని ఎట్లా ప్రేమిం చాలో, ఎట్లా జీవించాలో, ఎట్లా అనుభవించాలో, ఎట్లా నియంత్రించాలో, వయస్సుకు తగినట్టు ఎట్లా మలచుకోవాలో ఆచరించి చూపించిన స్థితప్రజ్ఞుడు కుష్వంత్‌సింగ్. ఆయన ఎంత హాయిగా, ఉన్నతంగా, కల్లాకపటం లేకుండా, నిజాయితీగా, నిర్భీతిగా బతికాడో అంతే అనాయాసంగా ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు. కుష్వం త్సింగ్ను పోలిన వ్యక్తి మరొకరు లేరు. అం తటి బహుముఖీనమైన వ్యక్తిత్వం మరొకటి గతంలో కానీ వర్తమానంలో కానీ కనిపిం చదు. మెదడు కంటే మనసు చెప్పినట్టు నడుచుకున్న మనిషి. చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అనర్హులకు యోగ్యతాపత్రాలు ఇచ్చారు. అన్యాయాన్ని సమర్థించారు. తప్పిదాలను గ్రహించిన ప్రతిసారీ ధైర్యంగా ఒప్పుకున్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరించారు. పట్టుదల వస్తే ఎంతటికైనా తెగించే మనస్తత్వం ఆయనది. ఎదుటివారు ఎంతటి వారైనా సంకోచించకుండా మనసుకు తోచిన మాటచెప్పడం, బుర్రకు తోచిన విమ ర్శ మొహమాటం లేకుండా చేయడం ఆయన ప్రత్యేకత. కుష్వంత్ తన సుదీర్ఘ జీవితంలో తీసుకున్న నిర్ణయాలలో అసమంజసమైనవీ, అర్థం లేనివీ చాలా ఉన్నాయి. అత్యయిక పరిస్థితిని సమర్థించడం, సంజయ్ గాంధీని వెనకేసుకురావడం, ఇందిరాగాంధీ అభీష్టానికి వ్యతిరేకంగా సంజయ్ భార్య మేన కా గాంధీని అభిమానించడం, ఆమెకు జర్నలిజంలో మార్గదర్శనం చేయబూనడం వంటి అనేక పనులు ముందుగా ఆలోచించి, లాభనష్టాలను బేరీజు వేసుకొని, మంచిచెడులను పరిశీలించి చేసినవి కావు. ఏ నిర్ణయం తీసుకున్నా దానిని నిస్సంకోచంగా అమలు చేయడం కుష్వంత్‌సింగ్ చిత్తశుద్ధికి నిదర్శనం. పత్రికలపైన సెన్సార్షిప్ను విధించినందుకు ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టినప్పుడూ, పంజాబ్‌లో తీవ్రవాదానికి ప్రతీకగా నిలిచిన భింద్రన్‌వాలే ను ఎండగట్టినప్పుడూ, స్వర్ణదేవాలయంలో సైనికులు ప్రవేశించడం పట్ల నిరసనగా పద్మభూషణ్ పురస్కారాన్ని వాపసు చేసినప్పుడూ కుష్వంత్సింగ్లోని నిబద్ధత కొట్టవచ్చినట్టు కనిపించింది. కుష్వంత్‌సింగ్ ఇంగ్లిష్ పత్రికా లోకానికీ, పాఠక లోకానికీ ఒక ఉత్తేజకరమైన జ్ఞాపకంగా నిలిచిపోతాడు. పత్రికా రచయితగా, నవలా రచయితగా, హాస్య రచయితగా ఆయనంటే పడిచచ్చే మూడు తరాల అభిమానుల జీవితాలలో ఆయన విడదీయలేని భాగం. ఇంగ్లిష్ వచనాన్ని ఎంత సులభగ్రాహ్యంగా, ఎంత అందంగా, ఎంత రసమయంగా, ఎంత సూటిగా రాయవచ్చునో కుష్వంత్ రచనలు చదివిన వారికి అనుభవైకవేద్యం. తాము కుష్వంత్ శిష్యులమంటూ ప్రముఖ సంపాదకుడు ఎంజె అక్బర్ వంటి వ్యక్తులు సగర్వంగా చాటుకుంటారు. ఇంగ్లిష్‌లో తాము చేసిన రచనల ప్రమాణాలను కుష్వంత్‌సింగ్ మెచ్చుకుంటూ తన కాలమ్‌లో ఒకవాక్యం రాస్తే దాన్ని ఎంతో విలువైన యోగ్యతా పత్రం గా భావించి పదిలపరుచుకునే మణిశంకర్ అయ్యర్ వంటి సమర్థులైన రచయితలు అనేక మంది. పీవీ నరసింహారావు రచించిన ఆత్మ కథాత్మక నవల ‘ఇన్సైడర్’ చప్పగా ఉందంటూ చప్పరించినా, ఒక పాఠకుడు పంపిన జోక్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తూ పాఠకులకు సిఫార్సు చేసినా కుష్వంత్ తీర్పును ప్రశ్నించే సాహసం ఎవ్వరూ చేయరు. ‘మ్యాలిస్ టువర్డ్స్ ఒన్ అండ్ ఆల్’ అనే శీర్షికతో కాలమ్‌ను అత్యద్భుతంగా అనేక సంవత్సరాలు రక్తికట్టించిన పెద్ద మనిషి మనసులో ఎవరిపట్లా ద్వేషభావం లేదు. తోటివారిని ప్రేమించే స్వభావం, మంచిని మెచ్చుకుంటూ చెడును చీదరించుకునే మనస్తత్వం ఆయనది. తన శృంగార జీవితంపై రాసిన రచనలలో వాస్తవం కంటే కల్పితమే అధికం. స్త్రీలతో తన సంబంధాల గురించి చెప్పిన విషయాలలో ఊహాజనితాలే ఎక్కువ. జీవితాన్ని గానుగ ఎద్దులాగా కాకుండా సృజనాత్మకంగా, రసభరితంగా, ఆహ్లాదకరంగా ఎట్లా జీవించవచ్చునో హృదయాలకు హత్తుకునే విధంగా చెప్పడానికి కొన్ని కట్టుకథలు చెప్పినా తప్పులేదనే ధోరణి ఆయనది. తన మీద తానే జోకులు వేసుకోవడం, సర్దార్జీల జోకులను పనికట్టుకొని వ్యాప్తిలోకి తేవడం, హాస్యానికీ, శృంగారానికీ పెద్దపీట వేయడం ఒక ఎత్తు అయితే, ‘ట్రైన్ టు పాకిస్థాన్’ వంటి యథార్థ రచనలు చేయడం, సిక్కుల చరిత్ర వంటి అధ్యయన గ్రంథం రచించడం మరో ఎత్తు. ఉర్దూ కవిత్వం పట్ల కుష్వంత్ సింగ్‌కు అపారమైన ప్రేమ. సందర్భం వచ్చినప్పుడల్లా గాలిబ్నో, ఇక్బాల్నో ఉటంకించడం ద్వారా తన రచనలను సంపన్నం చేశారు. సొంత రచనలు చేయడంతోపాటు పంజాబీ నుంచి ఇంగ్లిష్ లోకి అనువాదాలు చేశారు. కుష్వంత్ వెలువరించిన పుస్తకాల శీర్షికలు కూడా ఆకర్షణీయంగా, కొండొకచో తుంట రిగా ఉంటాయి. ‘ద కంపెనీ ఆఫ్ విమెన్’, ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మ్యాలిస్’ వంటి శీర్షికలు ఈ కోవలోనివే. సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట జర్నలిజం విద్యార్థిగా బొంబాయి వెళ్లినప్పుడు కుష్వంత్‌ను కలుసుకున్నాను. మీ రాష్ట్రంలో అన్ని వార్తలు ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ మమ్మల్ని ప్రశ్నించారు. అప్పుడు ‘జై ఆంధ్రా’ ఉద్యమం పతాకస్థాయిలో నడుస్తోం ది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కుష్వంత్ సింగ్ అంటే ప్రాణం. ఆయన రచనాశైలి చా లా ఇష్టం. లౌకికవాదాన్నీ, జర్నలిజం ప్రమాణాలనూ, ప్రజాస్వామ్య విలువలనూ ఆయన సమర్థించిన తీరు అనితరసాధ్యం. పత్రికారంగాన్నీ, సాహిత్య లోకాన్నీ ప్రబలంగా ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి కుష్వంత్‌సింగ్ అస్తమయంతో ఒక శకం ముగిసింది. కె. రామచంద్ర మూర్తి (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -
లోధీ రోడ్డు శ్మశానవాటికలో కుష్వంత్ సింగ్ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ అంత్యక్రియలు లోధీరోడ్డు శ్మశానవాటికలో జరిగాయి. 99 సంవత్సరాల వయసులో గురువారం కన్నుమూసిన కుష్వంత్ సింగ్‌కు ఢిల్లీతో ఎనలేని అనుబంధముంది. కుష్వంత్ సింగ్ తండ్రి సర్ శోభాసింగ్ లూట్యెన్స్ ఢిల్లీ కాలనీని నిర్మించిన బిల్డర్లలో ఒకరు. ఢిల్లీతో తనకున్న అనుబంధాన్ని సింగ్ తన రచనల్లో నిక్షిప్తం చేశారు. ఆయన రాసిన ఢిల్లీ నవల ఇందుకో ఉదాహరణ. ట్రైన్ టు పాకిస్థాన్ వంటి రచనలు ఆయనకు సాహితీరంగంలో విశిష్టస్థానాన్ని సంపాదించి పెట్టాయి వ్యంగ్య రచనలకు పేరొందిన సింగ్, సాంటా బంటా జోడీపై రాసిన జోక్‌లు ఆదరణ పొందాయి. సింగ్ ప్రతిరోజు ఉదయం వార్తాపత్రికలు, పుస్తకాలు చదివేవారని ఆయన కుమారుడు రాహుల్ సింగ్ చెప్పారు. గురువారం ఉదయం కూడా దినపత్రిక చదివారని, 10 రోజు కిందట ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ గురించి అడిగారని ఆయన వివరించారు. -
ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ కన్నుమూత
ప్రముఖ పాత్రికేయుడు, రచయిత కుష్వంత్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో మరణించారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.న్యూఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్‌లోని స్వగృహంలో తన తండ్రి ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారని కుష్వంత్ కుమారుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ పంజాబ్‌లోని హడలిలో ఫిబ్రవరి 2 వ తేదీన ఆయన జన్మించారు. భారత్‌లో యోజన పత్రికకు ఆయన వ్యవస్థాపక సంపాదకుడిగా వ్యవహరించారు. అలాగే నేషనల్ హెరాల్డ్, హిందూస్థాన్ టైమ్స్, ది ఇలస్ట్రేట్రడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలకు సంపాదకుడిగా విధులు నిర్వర్తించారు. ట్రైయిన్ టూ పాకిస్థాన్, ఐ షెల్ నాట్ హియిర్ ద నైటింగేల్, ఢిల్లీ రచనలు ఆయన కలం పదును ఎంతో తెలియజేస్తాయి. ఒకానొక సమయంలో దివంగత ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న కుష్వంత్ సింగ్, ఆ తర్వాతి కాలంలో కుటుంబంలో విభేదాలు వచ్చినప్పుడు రెండో వర్గం వైపు మొగ్గు చూపారు. అందువల్ల ఆయన ఇందిర వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అనంతర సమయంలో ఆయన రాసిన పలు వ్యాసాలు, సంపాదకీయాల్లో కూడా ఆ ముద్ర స్పష్టంగా కనిపించింది. 1974లో కుష్వంత్ సింగ్‌కు భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. అయితే 1984 నాటి అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో చోటు చేసుకున్న సంఘటనలను నిరసిస్తు ఆ పురస్కారాన్ని తిరిగి భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు. అయితే 2007లో కుష్వంత్ సింగ్‌ను భారత్ ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది తనను తాను గౌరవించుకుంది.1980 నుంచి1986 వరకు కుష్వంత్ సింగ్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన సంగతి తెలిసిందే.