కుష్వంత్ సింగ్ కన్నుమూత
జర్నలిస్టుగా, రచయితగా ప్రసిద్ధి చెందిన కుష్వంత్
కొంత కాలంగా అనారోగ్య సమస్య..99వ ఏట ప్రశాంతంగా తుది శ్వాస విడిచారన్న తనయుడు
సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, మోడీ, జగన్‌సహా ప్రముఖులు
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్(99) గురువారమిక్కడ తుది శ్వాస విడిచారు. సమకాలీన భారతీయ ఆంగ్ల రచయితల్లో ప్రముఖుడిగా పేరొందిన కుష్వంత్.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన చాలా కాలంగా ప్రజా జీవితానికి దూరంగా గడిపారని, ఢిల్లీ సుజన్ సింగ్ పార్కులోని స్వగృహంలో చాలా ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని ఆయన తనయుడు, జర్నలిస్టు రాహుల్ సింగ్ తెలిపారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ సమస్యతో సతమతమవుతున్నారని, చివరి వరకు మానసికంగా దృఢంగా ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం సంపూర్ణంగా గడిపారని అన్నారు. కుష్వంత్ సింగ్‌కు రాహుల్‌తోపాటు కుమార్తె మాల ఉన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు, సినీ నటులు కుష్వంత్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, బీజేపీ అగ్ర నాయకుడు అద్వానీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. కుష్వంత్ భౌతిక కాయానికి దయానంద్ ముక్తిధామ్‌లో ‘విద్యుత్ చితి’ ద్వారా అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.
కుష్వంత్ 1915లో అఖండ భారత్‌లోని హదాలీ(ప్రస్తుతం పాక్‌లో ఉంది) జన్మించారు. తండ్రి సివిల్ కాంట్రాక్టరు సర్ శోభా సింగ్.
ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజీ, కేంబ్రిడ్జి వర్సిటీలోని కింగ్స్ కాలేజీలలో కుష్వంత్ విద్యాభ్యాసం పూర్తయింది. 1939లో కవల్ మాలిక్‌ను పెళ్లాడారు. ఈమె 2001లో మరణించారు.
1947లో విదేశాంగ వ్యవహారాల శాఖలో చేరకముందు లాహోర్ హై కోర్టులో కొన్నేళ్లపాటు పనిచేశారు.
1948-50 మధ్య కాలంలో ఐర్లాండులోని భారతీయ రాయబార కార్యాలయంలో, అమెరికాలోని హై కమిషన్‌లో ప్రజా సంబంధాల అధికారిగా, టొరాంటోలో భారత ప్రభుత్వ సమాచార అధికారిగా పనిచేశారు.
కుష్వంత్ సింగ్ నాటి ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో (1979-1980), తర్వాత హిందుస్థాన్ టైమ్స్(1980-83) పనిచేశారు. తర్వాత నేషనల్ హెరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్లలో కూడా పనిచేశారు.
ఆయన వారం వారం రాసే ‘విత్ మలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్’ చాలా పేరు పొందింది, అది చాలా దినపత్రికల్లో ప్రచురితమైంది. యోజన మేగజైన్‌కు(1951-1953) వ్యవస్థాపక సంపాదకుడిగా చేశారు.
ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కుష్వంత్ సింగ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
1974లో పద్మభూషణ్ ప్రకటించగా.. స్వర్ణమందిరంపై సైనిక చర్యకు నిరసనగా కుష్వంత్ దాన్ని 1984లో తిరిగిచ్చేశారు. మళ్లీ 2007లో ఈయన్ను పద్మవిభూషణ్ వరించింది.
రాజకీయ వ్యాఖ్యాతగా, సమకూలీన వ్యంగ్య విమర్శకుడిగా పేరొందిన కుష్వంత్.. సిక్కు మత గ్రంథాలు, ఉర్దూ కవితలు, పలు ఇతర నవలల అనువాదంలో విశేష కృషి చేశారు.
కుష్వంత్ ఆత్మకథ ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మలైస్’ పేరుతో 2002లో పుస్తకంగా వచ్చింది.
ట్రైన్ టు పాకిస్థాన్ నవలతోపాటు ద సన్‌సెట్ క్లబ్, ద మార్క్ ఆఫ్ విష్ణు అండ్ అదర్ స్టోరీస్, ఎ బ్రైడ్ ఫర్ ద సాహిబ్ అండ్ అదర్ స్టోరీస్, బ్లాక్ జాస్మిన్, ద పోట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, ఎ లవ్ అఫైర్ ఇన లండన్ వంటి పలు పుస్తకాలు రాశారు.
కుష్వంత్ సింగ్ మృతికి జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నిజమైన లౌకిక విలువలకు కట్టుబడిన పాత్రికేయుడిగా హాస్యం, వ్యంగ్యం రాయడంలో దిట్టగా కోట్లాది మంది పాఠకులకు కుష్వంత్‌సింగ్ అర్ధ శతాబ్దంగా సుపరిచితుడని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ పత్రికా రంగానికి తీరని లోటు అని జగన్ అన్నారు.
ఎమ్మెల్సీ రాజు సంతాపం: కుష్వంత్ మృతిపట్ల పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు తన సంతాపాన్ని తెలియజేశారు. తాను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సలహామండలి కన్వీనర్‌గా ఉన్నపుడు సింగ్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగిందని, ఆయన గొప్ప మేధావి అని అన్నారు.